ఆక్రమణలో ఆయకట్టు
ఆక్రమణలో ఆయకట్టు
Published Fri, Feb 17 2017 11:23 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
చేపల చెరువుగా మార్చేందుకు అధికారుల అనుమతులు?
రైతులకు తీరని అన్యాయం
పవర(సామర్లకోట) : పవర గ్రామంలోని రాజు చెరువు ఆక్రమణకు గురై చేపల చెరువుగా మారి పోనుందని గ్రామ రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 145లో సుమారు 110 ఏళ్ల క్రితం పిఠాపురం మహారాజు రైతుల భూములకు సాగునీరు అందించేందుకు 105 ఎకరాల్లో చెరువును ఏర్పాటు చేశారు. ఆ చెరువుకు రాజు చెరువు అని నామకరణం చేశారు. అలాంటి చెరువును గ్రామానికి చెందిన కొంతమంది రాజకీయ పలుకు బడితో చేపల చెరువుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పదేళ్ల క్రితం చెరువు ఆక్రమణకు గురికావడంతో రైతుల ఫిర్యాదు మేరకు అప్పటి తహసీల్దార్ సత్తిరాజు గ్రామానికి వచ్చారు. ఆక్రమణదారులకు అనుకూలంగా వ్యవహరించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి తహసీల్దార్‌ను రామాలయంలో బంధించిన విషయం విదితమే. దాంతో ఆ చెరువుకు రక్షణ ఏర్పడింది. ప్రస్తుతం అప్పటి రోజులు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన అనుబోయిన గోపాలరావు చెరువులో 30 ఎకరాలను అన్యాక్రాంతం చేసి చెరువును నాలుగు చిన్న చిన్న చెరువులుగా చేస్తున్నారని గ్రామస్తులు ఎన్.వీర్రాజు, నాగేశ్వర రావు, నాగనబోయిన అయ్యన్న, కె.నరసయ్య తదితరులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆక్రమణదారుడు గోపాలరావును ప్రశ్నిస్తే తహసీల్దార్, ఫిషరీస్ డిపార్టుమెంటు, పీడబ్ల్యూడీ నుంచి అనుమతులు ఉన్నాయని చెబుతున్నారని గ్రామ రైతులు తెలిపారు. రైతులకు చెందిన చెరువును ఏవిధంగా చేపల చెరువుకు ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. చెరువులోని మట్టిని అమ్మకం చేస్తూ రూ.లక్షలు సంపాదించుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం చెరువును అభివృద్ధి చేయాలని, ఈ క్రమంలో గ్రామంలోని కూలీలకు ఉపాధి కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పొక్లెయిన్‌తో మట్టి తవ్వకం చేస్తూ ఉపాధి కూలీలకు పని లేకుండా చేస్తున్నారని వారు చెప్పారు. రైతుల సమస్యపై గ్రామానికి చెందిన సుమారు 100 మంది సంతకాలతో కలెక్టరుకు ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై న్యాయం చేసి రైతులకు చెందిన సుమారు 500 ఎకరాలకు సాగు నీరు అందించే చెరువును రక్షించాలని కోరుతున్నారు. ఈ చెరువులోకి సామర్లకోట గోదావరి కాలువ నుంచి పీడబ్ల్యూడీ కాలువ ద్వారా నీటిని స్టోరేజ్ చేసి పంట భూములకు నీరు అందస్తున్నారని తెలిపారు. దీనిపై తహసీల్దార్ ఎల్.శివకుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తాను ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు.
Advertisement