రమణయ్య పంట పండింది
- ఎకరాకు 59 బస్తాల దిగుబడి
- రాష్ట్ర ఉత్తమ రైతుగా ఎంపిక
- నేడు విజయవాడలో సన్మానం
మహానంది(శ్రీశైలం):
డిగ్రీ వరకు చదువుకున్న రమణయ్య తండ్రి వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్నే నమ్ముకున్నాడు. ఏటా వరి సాగు చేసి మంచి దిగుబడి సాధిస్తున్నాడు. గత ఏడాది ఎకరాకు 58బస్తాలు సాధించి జిల్లా స్థాయి ఉత్తమ రైతుగా ఎంపికైన ఇతడు ఈ ఏడాది ఏకంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతుగా ఎదిగాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏఓ కల్యాణ్‌కుమార్ గురువారం వెల్లడించారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన పన్నంగి వెంకటరమణయ్య డిగ్రీ తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆదర్శరైతుగా ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన ఇతడు పంటలు సాగు చేస్తూనే పది మంది రైతులకు సలహాలు ఇచ్చేవాడు. ఈ ఏడాది రెండెకరాల్లో బీపీటీ-2 రకం పంట సాగు చేసిన రమణయ్య ఎకరాకు 59 బస్తాల దిగుబడి సా««ధించి రికార్డు సృష్టించాడు. దీంతో అతన్ని ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ వరి రైతుగా ఎంపిక చేసింది. శుక్రవారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా విజయవాడలో అవార్డు అందుకోనున్నారు.