ramanayya
-
MRO రమణయ్య హత్య కేసును చేధించాం: విశాఖ సీపీ
విశాఖపట్నం, సాక్షి: రాష్ట్రంలో సంచలనం రేపిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసును చేధించినట్లు కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నాం ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన హత్య చేసిన నిందితుడిని గుర్తించినట్లు.. అతని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం. నిందితుడు విమానం ఎక్కి వెళ్లాడు. టికెట్ బుక్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయి. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. పది టీమ్‌లు రంగంలోకి దిగాయి. నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అనేది పరిశీలిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో నిందితుడి కోసం గాలిస్తున్నాం. చాలాసార్లు ఎమ్మార్వో ఆఫీస్‌కు నిందితుడు వెళ్లినట్లు తేలింది. నిందితుడు మరింత దూరం పారిపోతాడనే కారణంతోనే కొన్ని వివరాలను చెప్పట్లేదు అని సీపీ రవిశంకర్ వెల్లడించారు. రాత్రి పది గంటల సమయంలో హత్య జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. హత్యకు ఆర్ధిక లావాదేవీలు కారణమని భావిస్తున్నాం. రియల్ ఎస్టేట్, భూవివాదాలే హత్యకు కారణమై ఉండొచ్చు. హత్యకు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. తనతో మాట్లాడడానికి వచ్చిన వారికి తహశీల్దార్ సెండాఫ్ చెప్పడానికి వెళ్లగా.. అదే అదనుగా నిందితుడు హత్య చేశాడు అని సీపీ మీడియాకు కేసు వివరాలను వివరించారు. ఇదీ చదవండి: విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య విశాఖ రూరల్ (చినగదిలి) తహసీల్దార్‌గా సనపల రమణయ్య రెండు రోజుల కిందటి దాకా విధులు నిర్వహించారు. శుక్రవారం రాత్రి సమయంలో కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్లో రమణయ్య ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. వచ్చిరాగానే రమణయ్యతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం, తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో రమణయ్యపై దాడి చేశాడు. దీంతో, తలకు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలారు. అది చూసి నిందితుడిని పట్టుకునేందుకు అపార్ట్‌మెంట్‌వాసులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తొలుత నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. -
రమణయ్య పంట పండింది
- ఎకరాకు 59 బస్తాల దిగుబడి - రాష్ట్ర ఉత్తమ రైతుగా ఎంపిక - నేడు విజయవాడలో సన్మానం మహానంది(శ్రీశైలం): డిగ్రీ వరకు చదువుకున్న రమణయ్య తండ్రి వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్నే నమ్ముకున్నాడు. ఏటా వరి సాగు చేసి మంచి దిగుబడి సాధిస్తున్నాడు. గత ఏడాది ఎకరాకు 58బస్తాలు సాధించి జిల్లా స్థాయి ఉత్తమ రైతుగా ఎంపికైన ఇతడు ఈ ఏడాది ఏకంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతుగా ఎదిగాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏఓ కల్యాణ్‌కుమార్ గురువారం వెల్లడించారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన పన్నంగి వెంకటరమణయ్య డిగ్రీ తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆదర్శరైతుగా ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన ఇతడు పంటలు సాగు చేస్తూనే పది మంది రైతులకు సలహాలు ఇచ్చేవాడు. ఈ ఏడాది రెండెకరాల్లో బీపీటీ-2 రకం పంట సాగు చేసిన రమణయ్య ఎకరాకు 59 బస్తాల దిగుబడి సా««ధించి రికార్డు సృష్టించాడు. దీంతో అతన్ని ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ వరి రైతుగా ఎంపిక చేసింది. శుక్రవారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా విజయవాడలో అవార్డు అందుకోనున్నారు. -
ఆ రాత్రి వచ్చింది?
పట్టుకోండి చూద్దాం ‘‘ఇంత అన్యాయం చేసి పోతావనుకోలేదయ్యా....’’ బిగ్గరగా రోదిస్తున్నాడు రమణయ్య. అందరూ రమణయ్యను జాలిగా చూస్తున్నారు. ‘‘ఎవరండీ ఆయన?’’ ‘‘రమణయ్య అని ఈ ఇంట్లో పనిమనిషి. గత పాతిక సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నాడు. రాజావారికి అన్నీ తానై చూస్తున్నాడు... ఎంత గొప్ప అనుబంధమో...’’ రాజావారి అసలు పేరు... రాజారావు. అందరూ గౌరవంగా ‘రాజావారు’ అని పిలుస్తుంటారు. రాజావారిది పెద్ద చెయ్యి. దానధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు. ఇది నచ్చని ఆయన భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. సంవత్సరాలు గడిచిపోయాయి గానీ ఆమె తిరిగి రాలేదు. అలా ఒంటరైన రాజావారికి రమణయ్య చేదోడువాదోడు అయ్యాడు. ‘‘పాపం... రమణయ్యను చూడండి.... భార్యాపిల్లలు కూడా అంతగా తల్లడిల్లిపోరు...’’ అని ఎవరో సానుభూతిగా అంటున్నారు. ఒకరోజు... బంధువు చనిపోయాడంటూ రమణయ్య ఏదో ఊరు వెళ్లాడు. మరుసటి రోజు తిరిగి వచ్చాడు. ఉదయం పదిదాటినా... ఇంటి తలుపులు తెరుచుకోలేదు. రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా సరే... ఉదయం నాలుగింటికల్లా లేచి, వ్యాయామాలు చేసి, ఇంటి ముందు వసారాలో పేపర్ చదువుతూ కూర్చోవడం రాజావారి అలవాటు. ఆరోజు మాత్రం తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. తలుపులు దబదబా బాదాడు రమణయ్య. ఎంతసేపటికీ అవి తెరుచుకోలేదు. రమణయ్య ఇరుగు, పొరుగు వాళ్ల దగ్గరికి పరుగెత్తి.... ‘‘ఎంత గట్టిగా తలుపులు బాదినా మా అయ్యగారు... తీయడం లేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. నాకేదో భయంగా ఉంది’’ అని బిగ్గరగా ఏడ్వడం మొదలు పెట్టాడు. ‘‘ఏమైందో చూద్దాం పదా’’ అని ఇరుగుపొరుగు రాజావారి ఇంటికి చేరుకున్నారు. ‘‘రాజావారు... రాజావారు’’ అని గట్టిగా తలుపులు బాదడం మొదలుపెట్టారు. అందరికీ అనుమానం వచ్చింది. ‘కచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది’ అనుకున్నారు అందరు. అందరూ కలిసి తలుపులను బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. ఒక చిన్న టేబుల్ ముందు కుర్చీలో కళ్లు మూసుకొని కనిపిస్తున్నారు రాజావారు. టేబుల్ మీద ఒక హాఫ్‌బాటిల్ మందు, ప్లాస్కు, ఖాళీ అయిన ఒక గ్లాస్ కనిపిస్తుంది. రాజావారిని కదిలించి చూశారు. అనుమానించినట్లే... ఆయన చనిపోయి ఉన్నారు. ‘‘రెండు పెగ్గులకు మించి తాగినట్లు కనిపించడం లేదు. ఈ మాత్రం దానికే...’’ అని ఎవరో ఆశ్చర్యపడ్డారు. ‘‘రాజావారి శక్తి గురించి నాకు తెలుసు. ఇలా కూర్చొని అలా ఫుల్‌బాటిల్ తాగేయగలరు. అలాంటి వ్యక్తి ఆఫ్ట్రాల్ రెండు పెగ్గులకు చనిపోవడం ఏమిటి? ఏదో జరిగింది...’’ ‘‘అనుమానం ఎందుకు? ఇది ఖచ్చితంగా హత్యే’’ ‘‘వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి... పని మనిషి రమణయ్య ఊరికెళ్లాడు. బయటి వ్యక్తి ఇంట్లోకి వచ్చిన ఆనవాళ్లు కూడా ఏవీ కనిపించడం లేదు... ఇది హత్యేనంటావా?’’ ‘‘అలా అయితే ఆత్మహత్య అని చెప్పడానికి కూడా ఏ ఆధారం కనిపించడం లేదు కదా...’’ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో రాజావారిపై విషప్రయోగం జరిగిందనే విషయం తెలిసింది. దర్యాప్తు తరువాత... పోలీసులు పనిమనిషి రమణయ్యను అరెస్ట్ చేసి నిజం కక్కించారు. రాజావారు మందు తాగిన ఆ రాత్రి రమణయ్య ఊళ్లోనే లేడు. ఇంట్లో కూడా ఎవరూ లేరు. బయట నుంచి ఎవరూ రాలేదు. మరి విషప్రయోగం ఎలా జరిగింది? ఊరికి వెళ్లేముందు... విషం కలిపిన నీళ్లను డీప్ ఫ్రిజ్‌లో పెట్టాడు రమణయ్య. విషయం తెలియని రాజావారు... ఫ్రిజ్ నుంచి ఆ విషంతో కూడిన ఐస్‌క్యూబ్‌లను తీసుకొని మందు గ్లాస్లో వేసుకున్నారు. తాగి చనిపోయారు. తనను అనుమానించకుండా ఉండడానికి ఆరోజు ఊళ్లో లేకుండా జాగ్రత్తపడ్డాడు రమణయ్య. -
ఈవ్‌టీజర్‌కు దేహశుద్ధి
పోలీసులకు అప్పగింత మాచర్లటౌన్: పట్టణంలోని పలనాడు జూనియర్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థినిని వేధిస్తున్న ఈవ్‌టీజర్‌ను కళాశాల యాజమాన్యం వారు అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సోమవారం సాయంత్ర ఆరు గంటల సమయంలో కళాశాలకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిని పట్టణంలో నడిచి వెళుతుండగా వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెందిన తాడి రమణయ్య ఆమెపట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తూ వాహనం ఎక్కాలంటూ వేధించాడు. అంతకు ముందు కూడా తనను వేధిస్తున్న ఆ యువకుడి తీరు పట్ల ఆవేదన చెందిన విద్యార్థిని కళాశాలకు వెళ్లి డెరైక్టర్ కావూరి శ్రీరాములుకు విషయం చెప్పింది. స్పందించిన ఆయన విద్యార్థులను తీసుకుని పట్టణంలో ఆ యువకుడి కోసం గాలించారు. పార్కు సెంటర్లో ఉన్న రమణయ్యను విద్యార్థిని చూపించగానే వారు పట్టుకుని కళాశాలకు తీసుకొచ్చి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సైకో తీరులో మాట్లాడుతున్న ఆ యువకుడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్ఐ జయకుమార్ తెలిపారు. విద్యార్థుల వేధింపులు తాళలేక తిరుపతమ్మ ఆత్మహత్య చేసుకున్న విషయం మరువకముందే ఇలాంటివి జరగడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.