ఆ రాత్రి వచ్చింది?
పట్టుకోండి చూద్దాం
‘‘ఇంత అన్యాయం చేసి పోతావనుకోలేదయ్యా....’’ బిగ్గరగా రోదిస్తున్నాడు రమణయ్య.
అందరూ రమణయ్యను జాలిగా చూస్తున్నారు.
‘‘ఎవరండీ ఆయన?’’
‘‘రమణయ్య అని ఈ ఇంట్లో పనిమనిషి. గత పాతిక సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నాడు. రాజావారికి అన్నీ తానై చూస్తున్నాడు... ఎంత గొప్ప అనుబంధమో...’’
రాజావారి అసలు పేరు... రాజారావు.
అందరూ గౌరవంగా ‘రాజావారు’ అని పిలుస్తుంటారు.
రాజావారిది పెద్ద చెయ్యి. దానధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు. ఇది నచ్చని ఆయన భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.
సంవత్సరాలు గడిచిపోయాయి గానీ ఆమె తిరిగి రాలేదు. అలా ఒంటరైన రాజావారికి రమణయ్య చేదోడువాదోడు అయ్యాడు.
‘‘పాపం... రమణయ్యను చూడండి.... భార్యాపిల్లలు కూడా అంతగా తల్లడిల్లిపోరు...’’ అని ఎవరో సానుభూతిగా అంటున్నారు.
ఒకరోజు...
బంధువు చనిపోయాడంటూ రమణయ్య ఏదో ఊరు వెళ్లాడు.
మరుసటి రోజు తిరిగి వచ్చాడు.
ఉదయం పదిదాటినా... ఇంటి తలుపులు తెరుచుకోలేదు.
రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా సరే... ఉదయం నాలుగింటికల్లా లేచి, వ్యాయామాలు చేసి, ఇంటి ముందు వసారాలో పేపర్ చదువుతూ కూర్చోవడం రాజావారి అలవాటు.
ఆరోజు మాత్రం తలుపులు ఇంకా మూసే ఉన్నాయి.
తలుపులు దబదబా బాదాడు రమణయ్య.
ఎంతసేపటికీ అవి తెరుచుకోలేదు.
రమణయ్య ఇరుగు, పొరుగు వాళ్ల దగ్గరికి పరుగెత్తి....
‘‘ఎంత గట్టిగా తలుపులు బాదినా మా అయ్యగారు... తీయడం లేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. నాకేదో భయంగా ఉంది’’ అని బిగ్గరగా ఏడ్వడం మొదలు పెట్టాడు.
‘‘ఏమైందో చూద్దాం పదా’’ అని ఇరుగుపొరుగు రాజావారి ఇంటికి చేరుకున్నారు.
‘‘రాజావారు... రాజావారు’’ అని గట్టిగా తలుపులు బాదడం మొదలుపెట్టారు.
అందరికీ అనుమానం వచ్చింది.
‘కచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది’ అనుకున్నారు అందరు.
అందరూ కలిసి తలుపులను బద్దలు కొట్టి లోనికి వెళ్లారు.
ఒక చిన్న టేబుల్ ముందు కుర్చీలో కళ్లు మూసుకొని కనిపిస్తున్నారు రాజావారు.
టేబుల్ మీద ఒక హాఫ్‌బాటిల్ మందు, ప్లాస్కు, ఖాళీ అయిన ఒక గ్లాస్ కనిపిస్తుంది.
రాజావారిని కదిలించి చూశారు.
అనుమానించినట్లే... ఆయన చనిపోయి ఉన్నారు.
‘‘రెండు పెగ్గులకు మించి తాగినట్లు కనిపించడం లేదు. ఈ మాత్రం దానికే...’’ అని ఎవరో ఆశ్చర్యపడ్డారు.
‘‘రాజావారి శక్తి గురించి నాకు తెలుసు. ఇలా కూర్చొని అలా ఫుల్‌బాటిల్ తాగేయగలరు. అలాంటి వ్యక్తి ఆఫ్ట్రాల్ రెండు పెగ్గులకు చనిపోవడం ఏమిటి? ఏదో జరిగింది...’’
‘‘అనుమానం ఎందుకు? ఇది ఖచ్చితంగా హత్యే’’
‘‘వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి... పని మనిషి రమణయ్య ఊరికెళ్లాడు. బయటి వ్యక్తి ఇంట్లోకి వచ్చిన ఆనవాళ్లు కూడా ఏవీ కనిపించడం లేదు... ఇది హత్యేనంటావా?’’
‘‘అలా అయితే ఆత్మహత్య అని చెప్పడానికి కూడా ఏ ఆధారం కనిపించడం లేదు కదా...’’
పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో రాజావారిపై విషప్రయోగం జరిగిందనే విషయం తెలిసింది.
దర్యాప్తు తరువాత... పోలీసులు పనిమనిషి రమణయ్యను అరెస్ట్ చేసి నిజం కక్కించారు.
రాజావారు మందు తాగిన ఆ రాత్రి రమణయ్య ఊళ్లోనే లేడు. ఇంట్లో కూడా ఎవరూ లేరు. బయట నుంచి ఎవరూ రాలేదు. మరి విషప్రయోగం ఎలా జరిగింది?
ఊరికి వెళ్లేముందు... విషం కలిపిన నీళ్లను డీప్ ఫ్రిజ్‌లో పెట్టాడు రమణయ్య.
విషయం తెలియని రాజావారు... ఫ్రిజ్ నుంచి ఆ విషంతో కూడిన ఐస్‌క్యూబ్‌లను తీసుకొని మందు గ్లాస్‌లో వేసుకున్నారు. తాగి చనిపోయారు. తనను అనుమానించకుండా ఉండడానికి ఆరోజు ఊళ్లో లేకుండా జాగ్రత్తపడ్డాడు రమణయ్య.