విశాఖపట్నం, సాక్షి: రాష్ట్రంలో సంచలనం రేపిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసును చేధించినట్లు కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నాం ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన హత్య చేసిన నిందితుడిని గుర్తించినట్లు.. అతని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం. నిందితుడు విమానం ఎక్కి వెళ్లాడు. టికెట్ బుక్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయి. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. పది టీమ్‌లు రంగంలోకి దిగాయి. నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అనేది పరిశీలిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో నిందితుడి కోసం గాలిస్తున్నాం. చాలాసార్లు ఎమ్మార్వో ఆఫీస్‌కు నిందితుడు వెళ్లినట్లు తేలింది. నిందితుడు మరింత దూరం పారిపోతాడనే కారణంతోనే కొన్ని వివరాలను చెప్పట్లేదు అని సీపీ రవిశంకర్ వెల్లడించారు.
రాత్రి పది గంటల సమయంలో హత్య జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. హత్యకు ఆర్ధిక లావాదేవీలు కారణమని భావిస్తున్నాం. రియల్ ఎస్టేట్, భూవివాదాలే హత్యకు కారణమై ఉండొచ్చు. హత్యకు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. తనతో మాట్లాడడానికి వచ్చిన వారికి తహశీల్దార్ సెండాఫ్ చెప్పడానికి వెళ్లగా.. అదే అదనుగా నిందితుడు హత్య చేశాడు అని సీపీ మీడియాకు కేసు వివరాలను వివరించారు.
ఇదీ చదవండి: విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య
విశాఖ రూరల్ (చినగదిలి) తహసీల్దార్‌గా సనపల రమణయ్య రెండు రోజుల కిందటి దాకా విధులు నిర్వహించారు. శుక్రవారం రాత్రి సమయంలో కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్‌మెంట్‌లో రమణయ్య ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. వచ్చిరాగానే రమణయ్యతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం, తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో రమణయ్యపై దాడి చేశాడు. దీంతో, తలకు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలారు. అది చూసి నిందితుడిని పట్టుకునేందుకు అపార్ట్‌మెంట్‌వాసులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తొలుత నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment