నడిరోడ్డుపై ఓ యువతి దారుణహత్యకు గురైంది. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
చిలకలూరిపేట (గుంటూరు) : గుంటూరు జిల్లాలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న యువతి విధులు ముగించుకొని బయటకువస్తున్న సమయంలో ఓ వ్యక్తి కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని సుగాలి కాలనీలోని కళ్యాణి రెస్టారెంట్ ఎదుట జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుగాలి కాలనీకి చెందిన రమావత్ జైనీ బాయి(25)కి అదే కాలనీకి చెందిన బాలునాయక్(29)తో ఐదేళ్ల కిందట వివాహమైంది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే భర్త చనిపోవడంతో.. కళ్యాణి రెస్టారెంట్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో అదే రెస్టారెంట్లో పని చేస్తున్న వ్యక్తితో సహజీవనం చేస్తుండేది. కాగా జైనీబాయితో సహజీవనం చేస్తున్న సదరు వ్యక్తి నెల రోజుల కిందట ఆటో ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆమె మంగళవారం రెస్టారెంట్లో విధులు ముగించుకొని బయటకు వస్తుండగా.. ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. ఇది గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా.. దాడి చేసిన వ్యక్తి గతంలో జైనీబాయితో సహజీవనం చేసిన వ్యక్తి సోదరుడు సామ్యూల్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.