
చార్జీల మంటపై రణభేరి!
♦ సర్కారు తీరుపై జనం ఆందోళన
♦ పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్
♦ ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రజలు భగ్గుమన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్‌లు, బస్ డిపోల ఎదుట బైఠాయించారు.
జిల్లాల్లో జనాగ్రహం: వైఎస్సార్‌జిల్లా కడపలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాషా, మేయర్ కె.సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి నేతృత్వంలో ధర్నా చేశారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ధర్నాలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పాల్గొన్నారు. నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ధర్నా చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏలేశ్వరం డిపో ఎదుట ఎమ్మెల్యే వరుపుల నేతృత్వంలో ధర్నా చేపట్టారు.
విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. విశాఖ ద్వారకా బస్‌స్టేషన్ కాంప్లెక్స్ ఎదుట వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు గుడివాడ అమర్‌నాథ్, జాన్‌వెస్లీ, కోలా గురువులు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోను ముట్టడించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ధర్నా నిర్వహించారు.
పాలకొల్లు బస్టాండు వద్ద ధర్నాలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో నిరసన తెలిపారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ధర్నా నిర్వహించారు. మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టారు.