
కమనీయం.. రంగనాథుడి కల్యాణం
హిందూపురం అర్బన్ : అశేష భక్తజన వాహినీ మధ్య గుడ్డం రంగనాథస్వామి కల్యాణోత్సవం మంగళ వాయిద్యాల నడుమ శనివారం కమనీయంగా జరిగింది. గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు నిర్వహించి బెంగళూరు నుంచి తీసుకువచ్చిన విశేష పుష్పాలంకరణలతో పూజలు చేశారు. అనంతరం మహిళలు జ్యోతులతో ఆలయ ప్రదర్శన చేశారు.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథుడు ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాలతో ప్రాకారోత్సవంగా తీసుకువచ్చి ఆలయ ఆవరణలో కల్యాణ వేదికలో కొలువుదీర్చారు. ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు అర్చకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో సుగూరు, గుడ్డం ఆలయ కమిటీ «అధ్యక్షుడు ప్రభాకర్, మోహన్, అర్చకులు గోవిందశర్మ తదితరులు పాల్గొన్నారు.