బాలుడిపై సైకో లైంగిక దాడి
* తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న వైనం
* మరో నలుగురి పైనా లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం
తెనాలి రూరల్: నియోజకవర్గంలోని ఓ మండల కేంద్రంలో సైకోగా మారిన కామాంధుడు మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు ఐదుగురు బాలలపై దుశ్చర్యకు పాల్పడినట్టు తెలిసింది. ఇటీవల మరో బాలుడిపై దాడి చేయగా, ప్రస్తుతం ఆ బాలుడు తీవ్ర అస్వస్థతతో తెనాలిలోని ప్రైవేటు వైదశాలలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
కొల్లిపర గ్రామానికి చెందిన సుమారు 40 ఏళ్ల వివాహితుడు సైకోగా మారాడు. స్వయానా అక్క కూతురినే వివాహం చేసుకున్న అతనికి పిల్లలు లేరు. ఆది నుంచి కొంత వికృత చేష్టలు చేస్తుండేవాడు. రాను రాను ఇది విపరీత ధోరణిగా మారింది. ఎనిమిది నుంచి 17 ఏళ్లలోపు వయసున్న బాలురను ఎంచుకుని వారిని చంపుతానని బెదిరించి లైంగిక దాడికి పాల్పడుతున్నాడని తెలిసింది. బాలురను ఎంచుకుని, వారికి మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఐదుగురు బాలురపై లైంగికదాడి చేశాడని తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీన కొల్లిపర పరిధిలో కృష్ణానది ఏరులో వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తున్న 15 ఏళ్ల వయసున్న బాలుడిని అటకాయించి, గడ్డి మోపు ఉంది ఎత్తడానికి సాయం కావాలంటూ అరటి తోటలోకి తీసుకెళ్లాడు. ఎక్కడా గడ్డిమోపు ఆనవాళ్లు కనబడకపోవడంతో బాలుడు ప్రశ్నించాడు. దీంతో తన వెంట తెచ్చిన కత్తితో చంపుతానని బెదిరించి, బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్టు గ్రామస్తులు తెలిపారు.
విషయం ఎవరికైనా చెబితే హతమారుస్తానని బెదిరించడంతో బాలుడు ఆ రోజు మిన్నకుండి పోయాడు. మరుసటి రోజు అదే బాలుడు తన స్నేహితుడితో కలసి సైకిల్‌పై వెళుతుంటే ‘సైకో’ కొద్ది దూరం వెంబడించాడు. రెండు రోజుల అనంతరం బాధిత బాలుడి మెడ చుట్టూ వాపు వచ్చి, తీవ్ర జ్వరం రావడంతో గమనించిన కుటుంబసభ్యులు వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి మెడ చుట్టూ గోళ్లతో రక్కి ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ప్రశ్నించగా, బాలుడు జరిగినదంతా వారికి తెలియజేశాడు. బాలురపై లైంగిక దాడి విషయం పోలీసుల దృష్టికి వెళ్లినా వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే సదరు సైకో తమను ఏం చేస్తాడో అన్న భయంతో బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. ఫిర్యాదు రానప్పుడు ఏం చేస్తాం అన్న విధంగా పోలీసులు వ్యవహరిస్తుండడంతో సైకో ఆగడాలకు అంతే లేకుండా పోయిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులైనా పట్టించుకుని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.