జీజీహెచ్‌లో అరుదైన ఆపరేషన్
జీజీహెచ్‌లో అరుదైన ఆపరేషన్
Published Thu, Aug 11 2016 6:15 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
గుంటూరు మెడికల్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడినట్లు గుంటూరు జీజీహెచ్ కార్డియోథొరాసిక్ వైద్య విభాగం( సిటిఎస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మెగావత్ మోతీలాల్ చెప్పారు. గురువారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ వివరాలను ఆయన వెల్లడించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చెర్లోపల్లికి చెందిన పాముల ఆవులయ్య గొర్రెలు, మేకలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 10న తన పశువులకు ఆహారం కోసం చెట్టు నరుకుతున్న సమయంలో కొమ్మ విరిగిపడి కుడికాలికి గుచ్చుకుని రక్తనాళం తెగిపోయింది. దీంతో ఆగకుండా రక్త స్రావం అవుతోంది. . సుమారు 4 లీటర్లకు పైగా ఆవులయ్య శరీరం నుండి రక్తం పోవటంతో అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో బుధవారం అర్ధరాత్రి జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ డ్యూటీకి అర్ధరాత్రి హాజరై ముందస్తుగా ఐదు బ్యాగ్స్ రక్తం ఎక్కించి ఎమర్జన్సీ ఆపరేషన్ థియేటర్‌లోనే రెండుగంటలసేపు ఆపరేషన్ చేసి ఆవులయ్య ప్రాణాలను కాపాడినట్లు డాక్టర్ మోతీలాల్ చెప్పారు. ‘ఫిమరల్ వీన్ ఎండ్‌టు ఎండ్’ అనే ఆపరేషన్ చేశామని ఆపరేషన్ ప్రక్రియలో తనతోపాటుగా మత్తు వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగభూషణం, పీజీ వైద్యుడు డాక్టర్ కౌషిక్, జనరల్ సర్జరీ పీజీ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రాకేష్, డాక్టర్ రాజేష్‌లు పాల్గొన్నట్లు వెల్లడించారు. జీజీహెచ్‌లో ఇలాంటి ఆపరేషన్ చేయటం ఇదే మొదటిసారి అని, ప్రమాద బాధితుడికి హెపటైటిస్ పాజిటివ్ ఉన్నప్పటికీ రిస్క్ తీసుకుని తాము ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడామన్నారు. సకాలంలో ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు పోతాయని, కుడి కాలిలో నరం తెగిపోవటంతో, కడుపులో రక్తనాళం తీసి ఆపరేషన్ చేశామని డాక్టర్ మోతీలాల్ వివరించారు. ఆవులయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రెండు రోజుల్లో ఆస్పత్రి నుండి డిశ్చార్జి చేస్తామన్నారు.
Advertisement