- 42 వేల కుటుంబాలకు అందని బియ్యం కార్డులు
- పేదలై ఉండీ ప్రభుత్వ పథకాలకు దూరం
- రుణాలకు అనర్హత.. నిస్పృహలో నిరుద్యోగ యువత
అనంతపురం అర్బన్ : కరువు జిల్లాగా పేరుగాంచిన అనంతలో 42 వేల పేద కుటుంబాలు ఏ రకంగానూ ప్రభుత్వ సాయం అందక అధోగతి పాలవుతున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ రేషన్ కార్డుతో ముడిపడి ఉండటం వల్ల వీరికి ఈ దుస్థితి ఏర్పడింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో దాదాపు లక్షకు పైగా రేషన్‌కార్డులను తొలగించింది. కొత్తకార్డులు పంపిణీ చేస్తామని చెప్పడంతో 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో అనర్హత పేరిట పది వేల దరఖాస్తులను తిరస్కరించారు. 8 వేల మందికి మాత్రమే కార్డులు అందజేశారు. ఇంకా 42 వేల మంది రెండేళ్లకు పైగా ఎదురు చూస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డు లేక ఆయా కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత అర్హత కోల్పోయి నిస్పృహకు గురవుతోంది. 2014కు ముందు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే విచారణ చేసి అర్హులైతే మంజూరు చేసేవారు. అంతే కాకుండా ప్రతి ఏడాదీ కోటా విడుదల చేసేవారు. దీంతో అర్హులైన పేదలందరికీ కార్డులు అందేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దరఖాస్తు చేసుకున్న వారు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా కార్డులు అందడం లేదు. రెండేళ్లుగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయకపోవడంతో దరఖాస్తుల సంఖ్య చేంతాడులా పెరిగిపోతోంది. అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం కప్పదాట్లతో కాలం వెళ్లదీస్తుండటం వారి పాలిట శాపంగా మారింది. పేదల సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదనేందుకు రేషన్‌కార్డుల మంజూరులో చూపిస్తున్న నిర్లక్ష్యమే నిదర్శనమని బాధిత కుటుంబాల నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అధోగతి
Published Fri, Dec 2 2016 11:35 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement