
ప‘రేషన్’!
► ఇక బియ్యం, కిరోసిన్ మాత్రమే సరఫరా
► దూరమైన పంచదార
► నిత్యావసర ధరల పెరుగుదలే కారణం
నేరడిగొండ(బోథ్): ఒకటో తారీఖు వచ్చిందంటే చౌకధరల దుకాణాల వద్ద సరుకుల కోసం ప్రజలు బారులు తీరడం కనిపిస్తుంది. ఆరోజు పనికి వెళ్లకపోయినా పర్వాలేదు. సరుకులు ఉంటే చాలు అని అనుకునే నిరుపేద ప్రజలు ఎందరో ఉన్నారు. అలాంటిది క్రమక్రమంగా రేషన్ సరుకులను ఒక్కొక్కటిగా దూరం చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
కేంద్ర ప్రభుత్వం సరుకుల పంపిణీలో రాయితీ ఎత్తివేయడంతో ఆహార భద్రత కార్డులు ఉన్న పేద ప్రజలకు ఇక చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం, కిరోసిన్ మాత్రమే పంపిణీ చేయనున్నారు. మిగితా సరుకులన్నీ బహిరంగ మార్కెట్లలో కొనుగోలు చేయాలంటే పెరిగిన ధరల నేపథ్యంలో ప్రజలు జంకుతున్నారు. చాలామంది రేషన్ దుకాణాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తుండగా ఇప్పటికే చౌకధరల దుకాణాల్లో ఏ నెల, ఏ సరుకు లేకుండా సరఫరా చేస్తారో తెలియక లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. తాజాగా రేషన్ సరుకుల్లో మునుపెన్నడూ లేనివిధంగా కోత విధించడంతో పేద, మధ్యతరగతి ప్రజలు మండిపడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 344 రేషన్ దుకాణాలు ఉండగా, 1,81,608 మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో 1,68,407 ఆహార భద్రత కార్డులు, 12,928 అంత్యోదయ కార్డులు, 273 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీరికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.140 తొమ్మిది రకాల సరుకుల్లో బియ్యం, కందిపప్పు, చక్కెర, నూనె, గోధుమ పిండి, కిరోసిన్, ఉప్పు, చింతపండు, తదితర సరుకులను అందించేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చక్కెర, మంచినూనె, గోధుమ, చింతపండు, కారంపొడి, ఉప్పు లాంటి సరుకులను అందించారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం చింతపండు, నూనె, కంది పప్పు, గోధుమ పిండి, కారం తదితర సరుకుల్లో కోత విధించింది. మార్కెట్లో కొనుగోలు చేయాలంటే రూ.300 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇటీవల చక్కెర రాయితీ ఎత్తివేయడంతో జూన్ నుంచి అది కూడా పేద ప్రజలకు దూరమైంది. ఇక బియ్యంతోనే పేద ప్రజలు సరిపెట్టుకుంటున్నారు.
తగ్గిన కిరోసిన్ కోటా
వంట గ్యాస్ సిలెండర్‌ను వాడుతున్న కుటుంబాలకు లీటర్, లేని కుటుంబాలకు 2 లీటర్ల చొప్పున కిరోసిన్ సరఫరా చేసే పద్దతిని తాజాగా మార్చేశారు. రాయితీని తగ్గిస్తూ లీటర్‌కు రూ.10ఉన్న కిరోసిన్‌ను రూ.21కి పెంచడంతో పేద ప్రజలకు భారంగా మారింది. నిత్యావసర సరుకులు ఒక్కొక్కటి మాయం కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని సరుకులు అందించాలి
పేదప్రజలకు గతంలో మాదిరి బియ్యంతో పాటు కందిపప్పు, ఉప్పు, కారంపొడి, చక్కెర, చింతపండు సరుకులను రూ.140లకే అందించాలి. ప్రధానంగా విద్యుత్ లేని సమయంలో దీపం వెలిగిద్దామన్నా కిరోసిన్ లేక ఉదయం వేళల్లో టీ తాగాలన్నా చక్కెరను అందించకపోవడంతో మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– లచ్చన్న, నేరడిగొండ
పంపిణీలో పారదర్శకత పాటిస్తాం
ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత పాటిస్తూ పేద ప్రజలందరికీ సరుకులు దొరికేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం బియ్యం, కిరోసిన్ అందిస్తున్నాం. మే నుంచి చక్కెర కోత విధించడంతో అంత్యోదయ కార్డులు ఉన్నవారికే అందిస్తున్నాం. చింతపండు, కారంపొడి, గోధుమ, తదితర సరుకుల పంపిణీ చేపడితే పక్కదారి పడతున్నాయనే ఉద్దేశ్యంతో నిలిపివేశాం.
– కూనాల గంగాధర్, తహసీల్దార్ నేరడిగొండ