- పీడీఎస్ బియ్యం సేకరణపై అనుమానాలు
- నెలకోసారి పట్టివేత
- డీలర్లే ప్రధాన సూత్రధారులు
ఆగని బియ్యం దందా
Published Sat, Jul 23 2016 7:23 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
హసన్‌పర్తి : పేదలకు చెందాల్సిన బియ్యం పక్కాదారి పడుతున్నాయి. అక్రమార్కులపై కేసులు నమోదు చేసినా బియ్యం దందా ఆగడం లేదు. నాలుగు నెలలుగా బియ్యం వ్యాపారులపై నాలుగు కేసులు నమోదైనా మళ్లీ అదే మార్గం పట్టారు. 40 రోజుల క్రితం ఇదే ముఠా హుస్నాబాద్‌లో లారీలతో పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 15 రోజుల్లో మళ్లీ వారు సుమారు 80 క్వింటాళ్ల బియ్యం సేకరించి అధికారులకు చిక్కారు. ఆ తర్వాత నెల తిరగకముందే శనివారం మళ్లీ 80 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని స్వయంగా లబ్ధిదారుల నుంచే కొనుగోలు చేసి.. రెండుమూడు రూపాయలకు ఎక్కువగా అమ్ముకుంటున్నామని నిందితులు చెబుతున్న మాటల్లో స్పష్టత లేదు.
బియ్యం సేకరణపై అనుమానాలు..
రేషన్ బియ్యం దందా చేసే వారు పేర్కొంటున్న విధంగా బియ్యం సేకరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కూలీలకు వెళ్లేవారు. ఈ బియ్యాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే కార్డులు కలిగిన మధ్యతరగతి వర్గాలు మాత్రం రేషన్‌షాపుల నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని రూ.8 నుంచి రూ.10 వరకు విక్రయిస్తున్నారు. కొందరైతే నెలవారీగా బియ్యం తీసుకెళ్లడం లేదు. ఈ బియ్యాన్ని సదరు డీలర్లు బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రేషన్‌షాపుకు వచ్చే క్రమంలోనే లారీని మధ్యలోనే నిలిపివేసి.. బియ్యాన్ని కొంతమంది డీలర్లు అమ్ముతున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా నిందితుల మాత్రం అధికారులకు మరోలా వాంగ్మూలం ఇస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఉల్లిగడ్డలు విక్రయించి.. అందుకు బదులుగా బియ్యం తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. హసన్‌పర్తిలో మరో రెండు ప్రాంతాల్లో పెద్దమొత్తంలో రేషన్ బియ్యం దందా నడుస్తున్నా అధికారులు ఎందుకు దాడులు చేయడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement