పది మంది రేషన్ దొంగల అరెస్టు
పది మంది రేషన్ దొంగల అరెస్టు
Published Wed, Nov 30 2016 9:13 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
కర్నూలు: రేషన్ పంపిణీలో ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్ కేసును పోలీసులు నీరుగారుస్తున్నారనే విమర్శల నేపథ్యంలో పది మంది చౌక డిపో డీలర్లను అరెస్టు చేశారు. వీరిలో కర్నూలులో ఐదుగురు, నందవరంలో ఐదుగురు ఉన్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి బుధవారం సాయంత్రం సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది, టూటౌన్ పీఎస్ పరిధిలో 42 మంది, త్రీటౌన్ పీఎస్ పరిధిలో 15 మంది, ఫోర్త్‌టౌన్ పీఎస్ పరిధిలో 11 మంది డీలర్లపై కేసులు నమోదయ్యాయి. ఇందులో వన్‌టౌన్ పరిధిలో ఖాశీం, శ్రీనివాసులు, టూటౌన్ పరిధిలో షేక్ చాంద్ బాషా, చంద్రబాబు, ఫోర్త్‌టౌన్ పీఎస్ పరిధిలో సోము సాయిబాబాలను పోలీసులు అరెస్టు చేశారు. చౌక దుకాణాల్లో అవినీతిని అడ్డుకోవడానికి గత ఏడాది ఈ–పాస్ మిషన్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సాఫ్ట్‌వేర్ ట్యాంపరింగ్‌తో క్లోజింగ్ బ్యాలెన్స్‌లో తక్కువ చూపించి రూ.లక్షల్లో ప్రభుత్వానికి గండి కొట్టారు. జిల్లా వ్యాప్తంగా 149 మంది డీలర్లు ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసులు దర్యాప్తులో తేల్చారు. పౌర సరఫరాల, రెవెన్యూ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కర్నూలు డివిజన్‌లో 121, నందికొట్కూరు పట్టణ పరిధిలో 12, కర్నూలు అర్బన్ తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో 5, శ్రీశైలం పీఎస్ పరిధిలో 3, వెల్దుర్తి పీఎస్ పరిధిలో 1, పాణ్యం పీఎస్ పరిధిలో 3, నంద్యాల డివిజన్ పరిధిలో 3, దేవనకొండలో 3, నందవరంలో 7, ఎమ్మిగనూరు పట్టణ పరిధిలో 15, ఆదోని డివిజన్ పరిధిలో 25 మంది డీలర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ–పాస్ మిషన్ల ట్యాంపరింగ్‌కు పాల్పడిన డీలర్లందరినీ త్వరలో అరెస్టు చేస్తామని, వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఒకటవ పట్టణ సీఐ కృష్ణయ్య, తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి, నాల్గవ పట్టణ సీఐ నాగరాజ రావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఎమ్మిగనూరులో...
రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడిన కేసులో నందవరం మండలానికి చెందిన ఐదుగురు డీలర్లను అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. బుధవారం రాత్రి స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎస్‌ఓ, ఆర్డీఓ, తహసీల్దార్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు. అరెస్ట్ చేసిన వారిలో నందవరం మండలం గంగవరానికి చెందిన డీలర్ సత్యనారాణయశెట్టి, నాగలదిన్నెకు చెందిన డీలర్లు సుమిత్రబాయి, షబ్బిర్, ప్రేమకుమారి, కనకవీడు డీలర్ బోయ కోటేష్‌లు ఉన్నట్లు చెప్పారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారన్నారు. ఇకపోతే పట్టణంలో 13 మంది, రూరల్‌లో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయని.. వీరంతా పరారీలో ఉన్నట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో నందవరం ఎస్‌ఐ జగన్‌మోహన్ పాల్గొన్నారు.
Advertisement