తర్జన భర్జన!
– కొలిక్కిరాని రేషనలైజేషన్ ప్రక్రియ
– 55 స్కూళ్లకు అడ్డంకిగా మారిన ‘దూరం’
– ఎంఈఓలు, జీపీఎస్ జాబితాలో వ్యత్యాసం
– రేపటి వరకు గడువు పొడిగింపు
అనంతపురం ఎడ్యుకేషన్ : పాఠశాలల రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ)కు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే పలు పాఠశాలలు మూతపడనున్నాయి. ఉపాధ్యాయ పోస్టులను ఇతర పాఠశాలలకు బదలాయించనున్నారు. నిబంధనలను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఆ మేరకు మండల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేసినా తుది దశకు చేరుకోవడం లేదు. 2016 డిసెంబర్ 31 తేదీ కటాఫ్‌గా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, మంజూరు పోస్టులు, స్కూళ్ల మధ్య దూరం తదితర వివరాలను మండల విద్యాశాఖ అధికారులు తేలాల్సి ఉంది.
ఇందుకోసం జిల్లా విద్యాశాఖ నుంచి ప్రొఫార్మాలు పంపారు. వాటిని భర్తీ చేసి జిల్లా విద్యాశాఖకు పంపితే వారు ఆన్‌లైన్‌లో భర్తీ చేసి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు. ఇందుకోసం మంగళవారం నాటికే గడువు ముగిసింది. అయితే చాలా విషయాల్లో స్పష్టత రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంది. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల కిందట జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్ సంధ్యారాణి మాట్లాడుతూ జూన్ 2 వరకు గడువు పొడిగిస్తున్నామని, ఆలోగా పూర్తి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. 3న తుది వివరాలను వెల్లడించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
55 స్కూళ్లకు ‘దూరం’ సమస్య
ముఖ్యంగా ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్‌కు ఉన్న దూరం ఆధారంగా చాలా స్కూళ్లు మూతపడే పరిస్థితి. స్కూళ్ల మధ్య దూరాన్ని ప్రభుత్వం ఆన్‌లైన్ జీపీఎస్ (గ్లోబల్ పొజిషినింగ్ సిస్టం) ద్వారా గుర్తించారు. అయితే క్షేత్రస్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు గుర్తించిన దూరానికి వ్యత్యాసం వస్తోంది. జిల్లాలో సుమారు 55 స్కూళ్లకు ఈ సమస్య నెలకొంది. సీఆర్పీలతో జీపీఎస్ ద్వారా మరోసారి దూరాన్ని పరిశీలించి అమరావతి ఐటీ విభాగానికి పంపాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయా స్కూళ్లకు వెళ్లిన సీఆర్పీలు వివరాలను ఐటీ విభాగానికి పంపారు.
ఇదిలా ఉండగా పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, డీ. హీరేహాల్ మండలం సోమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం విద్యార్థులను ఇంగ్లిష్ మీడియంలో చేర్చడంతో రెండు మీడియాల్లోనూ సంఖ్య తక్కువై మూతపడే ప్రమాదం నెలకొంది. అయితే యూడైస్‌లో తప్పుగా నమోదు చేశారని, వాస్తవానికి తెలుగు మీడియం విద్యార్థులు అధికంగా ఉన్నారని పొరబాటున ఆన్‌లైన్‌లో ఇలా నమోదు చేశారంటూ ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు వాపోతున్నారు. ఇదే జరిగితే ఈ రెండు స్కూళ్లలోనూ ఒక మీడియం రద్దయి ఒక మీడియం కొనసాగే వీలుంటుంది. దీనిపై విద్యాశాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. వీటిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాం = పగడాల లక్ష్మీనారాయణ, డీఈఓ
‘రేషనలైజేషన్ ప్రక్రియ ఈపాటికి పూర్తికావాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో నెలకొన్న చిన్న చిన్న సమస్యల వల్ల కాస్త ఆలస్యమైంది. ఈ నెల 2 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈలోగా పూర్తి చేస్తాం. జిల్లాలో కొన్ని స్కూళ్ల మధ్య ఉన్న దూరం, పరిగి, సోమలాపురం పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యపై స్పష్టత కోసం ప్రభుత్వానికి పంపాం. అక్కడి నుంచి రాగానే వాటిపై ఓ నిర్ణయం తీసుకుంటాం.’