- సత్యదేవుని సన్నిధిలో 40 వివాహాలు
- స్వామివారిని దర్శించిన
- 15వేల మంది భక్తులు
- ఆదాయం రూ.15 లక్షలు
రత్నగిరిపై మొదలైన పెళ్లిసందడి
Published Fri, Feb 3 2017 11:08 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
అన్నవరం:
రెండు నెలల విరామం అనంతరం రత్నగిరిపై వివాహాల సందడి నెలకొంది. మాఘమాసం సందర్భంగా సత్యదేవుని సన్నిధిన పెద్దసంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం ముహూర్తాలలో సుమారు 40 వివాహాలు జరిగాయి. వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా వివాహాలు చేసుకున్న పెళ్లి బృందాల వారు కూడా నవదంపతులతో సత్యదేవుని సన్నిధికి విచ్చేస్తుండడంతో ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా నవదంపతులే దర్శనమిస్తున్నారు. ఈ నెలలో ఐదో తేదీ, తొమ్మిదో తేదీ, 13, 15, 16, 18 తేదీల్లో వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు తెలిపారు.
సత్యదేవుని దర్శించిన 15 వేల మంది భక్తులు
రత్నగిరికి భక్తులతోపాటు వివాహ బృందాల రాక కూడా పెరిగింది. దీనికి తోడు శుక్రవారం రథ సప్తమి పర్వదినం సందర్భంగా సత్యదేవుని ఆలయాన్ని సుమారు 15 వేల మంది భక్తులు దర్శించి పూజలు చేశారు. ప్రతీ వ్రతమండపంలోను నవదంపతులు వ్రతాలాచరించడంతో మండపాలకే కళ వచ్చింది. సత్యదేవుని దర్శనానికి గంట సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు 1,622 జరుగగా అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి సుమారు రూ.15 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
Advertisement