’రవాణా’ బాదుడు
10 శాతం చార్జీలు పెంచిన రవాణా శాఖ
ఎల్‌ఎల్‌ఆర్ నుంచి వాహన రిజిస్ట్రేషన్ వరకూ అన్నీ ప్రియమే
జిల్లాలో రోజుకు రూ.9 లక్షల అదనపు భారం
ఏలూరు (మెట్రో) :
వాహన రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఫీజులు భారీగా పెరిగాయి. రవాణా శాఖ ద్వారా అందించే 83 రకాల సేవలకు సంబంధించి వసూలు చేసే చార్జీలు, ఫీజులను 10 శాతం నుంచి 100 శాతం వరకూ పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో రవాణా శాఖ ద్వారా సేవలు పొందే జిల్లా ప్రజలపై రోజుకు సుమారు రూ.9 లక్షల మేర అదనపు భారం పడింది.
పెంపుదల ఇలా..
ఇప్పటివరకూ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన వారినుంచి ఎల్‌ఎల్‌ఆర్ నిమిత్తం ప్రస్తుతం రూ.30 వసూలు చేస్తుండగా.. ఆ మొత్తాన్ని రూ.150కి పెంచారు. దీనిపై వసూలు చేసే సర్వీస్ చార్జి రూ.60ని యథాతథంగా వసూలు చేస్తారు. రూ.550 ఉండే డ్రైవింగ్ లైసెన్స్ ఫీజును రూ.960కి పెంచారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు రూ.500 వసూలు చేస్తుండగా.. ఇప్పుడు రూ.1,000కి పెంచారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌కు రూ.50 వసూలు చేసేవారు. ఇదికాస్తా రూ.200కు పెరిగింది. గడువు తీరిపోయిన లైసెన్స్ రెన్యువల్‌కు అపరాధ రుసుంతో రూ.100 వసూలు చేసేవారు. ఆ మొత్తాన్ని రూ.300కు పెంచారు. డ్రైవింగ్ లైసెన్స్‌లో మార్పులు చేయాల్సి వస్తే రూ.50 వసూలు చేసేవారు. ప్రస్తుతం అది రూ.200కు పెరిగింది. వాహన రిజిస్ట్రేషన్ చార్జీలు సైతం పెరిగాయి. ఏ మేరకు పెంచారనే విషయంలో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు అందలేదు.
కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి
పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. మా శాఖ ద్వారా 83 రకాల సేవలు అందిస్తున్నాం. ప్రతి సేవలోనూ పెరిగిన చార్జీలను అమలు చేస్తున్నాం.
ఎస్‌ఎస్ మూర్తి, డెప్యూటీ కమిషనర్, రవాణా శాఖ