అసలు విషయాన్ని బయటపెట్టిన రావెల
- బాక్సైట్ జీవో రద్దుచేయలేదని బయటపెట్టిన మంత్రి
- మోదకొండమ్మ జాతర సాక్షిగా బయటపడిన టీడీపీ కుట్ర
- కలవరపడుతున్న గిరి పుత్రులు
- మన్యంలో మళ్లీ రగులుకుంటున్న బాక్సైట్ ఉద్యమం
అమాయక గిరిజనంపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు అమ్మవారి జాతరను అడ్డుపెట్టుకున్నారు.. ప్రభుత్వ ఉత్సవంగా గుర్తించామంటూనే మన్యంలో సంతోషాన్ని లాగేసుకున్నారు.. నాడు ఆదివాసీ దినోత్సవం వేదికగా బాక్సైట్ తవ్వుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటిస్తే, నేడు గిరిజన ఉత్సవం సందర్భంగా మంత్రి రావెల కిశోర్‌బాబు అదే మాటను పునరుద్ఘాటించారు. బాక్సైట్‌పై అడవి బిడ్డలు చేసిన పోరాటాలు, త్యాగాలకు తలొగ్గి వెనక్కు తగ్గినట్లు ఇన్నాళ్లూ నటించిన ప్రభుత్వం తెరవెనుక కుట్రలు బయటపడుతున్నాయి.
విశాఖపట్నం : బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.97ను గిరిజనులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సహా పార్టీ యంత్రాంగం చేసిన బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం నేపధ్యంలో తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆ తర్వాత ఉద్యమం సద్దుమణిగింది. ఇక బాక్సైట్ జోలికి ప్రభుత్వం రాదనుకునే సంతోషంతో గిరిజనులు మోదకొండమ్మ అమ్మవారి జాతర జరుపుకుంటున్నారు. ఈ జాతరకు వచ్చిన రాష్ర్ట గిరిజన శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు బాక్సైట్ గురించి అక్కడ ఏమీ మాట్లాడలేదు.
పైగా గిరిజనులు అడవిని కాపాడుకోవడం వల్లనే పచ్చగా ఉన్నారని తేనె పలుకులు పలికి వెళ్లిపోయారు. జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించామని, రూ.50 లక్షలను నిర్వహణ ఖర్చులుగా ప్రభుత్వం ఇస్తోందని ప్రకటించారు. కానీ ఆ ఆనందాన్ని గిరజనులకు ఆయన ఎంతో సేపు నిలువనివ్వలేదు.
నర్సీపట్నం వెళ్లగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. తవ్వకాల కోసం జారీ చేసిన జీవోను రద్దు చేయలేదని, గిరిజనుల ఆమోదం తోనే బాక్సైట్ తవ్వకాలకు ముందుకు వెళతామన్నారు. సోమవారం కూడా అరకులో ఇవే వ్యాఖ్యలు చేశారు. తొలిసారిగా బాక్సైట్ తవ్వుతున్నామనే విషయాన్ని కూడా గిరిజనులు సంతోషంగా జరుపుకుంటున్న ఆదివాసీ ఉత్సవాల్లోనే చంద్రబాబు ప్రకటించి చిచ్చు పెట్టారు. మళ్లీ అదే విధంగా గిరిజనుల ఆనందాన్ని హరించేలా వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షంపైనా కుట్ర
అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడం వెనుక కూడా ప్రభుత్వ కుట్ర ఉన్నట్లు కనిపిస్తోంది. ఆలయ కమిటీ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వ్యవహరిస్తున్నారు. ఆమె నేతృత్వంలోనే జాతర ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. కనీవినీ ఎరుగని రీతితో అత్యంత వైభవంగా జాతర జరిపేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నం గురించి తెలుసుకున్న ప్రభుత్వం జాతర విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావించింది. అంతేకాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాధాన్యాన్ని తగ్గించాలనుకుంది. మరోవైపు రూ. 50 లక్షలు ఇవ్వడం ద్వారా గిరిజనులకు తామోదో మేలు చేస్తున్నట్లు చూపించి, ఇదే అదునుగా బాక్సైట్ తవ్వకాలకు మళ్లీ అంకురార్పణ చేయాలని కుట్ర పన్నింది. అదే రావెల వ్యాఖ్యల్లో బయటపడింది.
ఎమ్మెల్యేకు ఎరవేసింది ఇందుకేనా!
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇటీవల టీడీపీలోకి జంపయిన విషయం తెలిసిందే. భారీగా ముడుపులు ఆశచూపి ఆయనను చేర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే ముడుపులతో పాటు బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు వ్యతిరేకించకుండా ఉండేలా చేయడం కూడా కిడారి చేరికలో భాగమని తెలుస్తోంది. బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన కిడారి సొంత నియోజకవర్గంలో బాక్సైట్‌కు అనుకూలంగా మంత్రి మాట్లాడే ధైర్యం చేయడం వెనుక కుట్ర ఇదేనని గిరిజనులు భావిస్తున్నారు.
కేవలం రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు చేస్తున్న కుట్రలకు కిడారి వంటి గిరిజన ద్రోహులు చేస్తున్న ప్రయత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వమని, అవసరమైతే మళ్లీ బాక్సైట్ ఉద్యమ దివిటీని రగిలిస్తామని వారు అంటున్నారు. ఏది ఏమైనా గిరిజనులు అత్యంత పవిత్రంగా, సంతోషంగా జరుపుకునే మోద కొండమ్మ జాతర సమయంలో వారి జీవితాలను చిదిమేయాలనే ప్రభుత్వ కుట్రలు బయటపడటం మన్యంలో కలకలం రేపింది.