కేడీసీసీబీ డిపాజిట్లపై ఆర్‌బీఐ ఆరా
కేడీసీసీబీ డిపాజిట్లపై ఆర్‌బీఐ ఆరా
Published Sun, Dec 25 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM
- నవంబరు 10 నుంచి 14 వరకు రూ.26 కోట్ల డిపాజిట్లు
- నల్లధనం డిపాజిట్ అయినట్లు అనుమానాలు
కర్నూలు(అగ్రికల్చర్): రద్దయిన రూ.500, 1000 నోట్లకు సంబంధించి జిల్లా సహకార కేంద్రబ్యాంకులో జమ అయిన డిపాజిట్లపై రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియాతో పాటు ఆదాయపు పన్నుశాఖ దృష్టి పడింది. జిల్లాలో కేడీసీసీబీకి 22 బ్రాంచీలున్నాయి. కేంద్రప్రభుత్వం నవంబర్ 8వతేదీన రూ.500, 1000 నోట్లను రద్దు చేసింది. 9న బ్యాంకులు బంద్ అయ్యాయి. పదవ తేదీ నుంచి 14 వరకు జిల్లా సహకార బ్యాంకులో రూ. 26 కోట్ల రద్దయిన కరెన్సీ డిపాజిట్ అయింది. ఈ బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారుల్లో 85శాతం మంది రైతులే. వరుస కరువులతో అప్పుల్లో కూరుకుపోయిన రైతులు డిపాజిట్లు చేసే స్థాయిలో లేరు. దీన్ని బట్టి చూస్తే కేడీసీసీబీలో రాజకీయ ప్రమేయం ఎక్కువగా ఉండటం వల్ల నల్లడబ్బును భారీగా డిపాజిట్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పటికే ఆర్‌బీఐ జిల్లా కేంద్రసహకార బ్యాంకులో నవంబరు 10 నుంచి 14వ తేదీ వరకు వచ్చిన డిపాజిట్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా రాజకీయ నేతల అధీనంలో ఉన్న సహకార బ్యాంకుల్లో రద్దయిన నోట్లు డిపాజిట్లుగా వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని డీసీసీబీల్లో డిపాజిట్లు పెద్ద ఎత్తున వచ్చిపడ్డాయి. వీటిన్నిటిని ఆరాతీస్తున్న ఆర్‌బీఐ కర్నూలు సహకార బ్యాంకుకు వచ్చిన డిపాజిట్లను పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా సీఈఓ రామాంజనేయులు మాట్లాడుతూ... తమ బ్యాంకుకు రద్దయిన నోట్లు దాదాపు రూ.26 కోట్లు డిపాజిట్లుగా వచ్చాయని, ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్‌బీఐ, ఆప్కాబ్‌కు పంపినట్లు తెలిపారు. కేడీసీసీబీకి 22 బ్రాంచీలుండగా సగటున రూ.1.10 కోట్ల ప్రకారం డిపాజిట్లు పడ్డాయన్నారు. ఇవన్నీ కూడా రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల మొత్తంలో డిపాజిట్ అయినవేనని వెల్లడించారు.
Advertisement
Advertisement