kdcc
-
శిక్షణకు జిల్లా సహకార కేంద్రబ్యాంకు పాలకవర్గం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు పాలక వర్గం సభ్యులు, సీనియర్ అధికారులు ఆదివారం రాత్రి శిక్షణ నిమిత్తం పోర్టుబ్లెయిర్‌కు వెళ్లారు. వైకుంఠమెహతా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ కో ఆపరేటివ్లో బ్యాంకును మరింత అభివృద్ధిలోకి ఏ విధంగా తీసుకోరావచ్చు అనే దానిపై ఫిబ్రవరి నాలుగు వరకు శిక్షణ పొందనున్నారు. ఆదివారం రాత్రి ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలులో చైర్మన్ మల్లికార్జునరెడ్డి, వైస్ చైర్మన్ అహ్మద్‌హుసేన్, బ్యాంకు సీఈఓ రామాంజనేయులు, ఇతర పాలకవర్గ సభ్యులు బయలు దేరారు. జ్ఞాన సముపార్జన నిమిత్తం శిక్షణకు వెళ్తున్నట్లుగా బ్యాంకు వర్గాలు తెలిపాయి. -
రూపేకార్డుల పంపిణీకి చర్యలు
ఆలూరు: జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఖాతాదారులందరికీ రూపేకార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని డీసీసీబీ డీజీఎం సునిల్‌కుమార్ తెలిపారు. స్థానిక సింగిల్ విండో సహకార పరపతి సంఘ ఽకార్యాలయంలో కర్షక జ్యోతి ఫైనాన్ష్యల్ ఆర్గనైజర్ బసవరాజ్ ఆధ్వర్యంలో బుధవారం రూపేకార్డులతో నగదు బదిలీలను చేసుకునే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునిల్‌కుమార్ రైతులు, చిరువ్యాపారులు, ఖాతాదారులను ఉద్దేశించి మాట్లాడారు. భవిష్యత్‌లో ప్రతిఒక్కరికి బ్యాంకు ఖాతాల ద్వారానే లావాదేవీలు కొనసాగించుకోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో 1.50లక్షల రూపే కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో స్థానిక కేడీసీసీ బ్యాంకు మేనేజర్ రమేష్, జిల్లా అధికారి శాస్త్రీ, జనజ్యోతి ఫైనాన్షియల్ కౌన్సిల్ సభ్యుడు రామూర్తి, ఆలూరు సహకార సింగిల్ విండో సీఈఓ వెంకటరెడ్డి, డైరెక్టర్లు హనుమంతు, అనిల్, స్వామి పాల్గొన్నారు. -
కేడీసీసీబీ డిపాజిట్లపై ఆర్బీఐ ఆరా
- నవంబరు 10 నుంచి 14 వరకు రూ.26 కోట్ల డిపాజిట్లు - నల్లధనం డిపాజిట్ అయినట్లు అనుమానాలు కర్నూలు(అగ్రికల్చర్): రద్దయిన రూ.500, 1000 నోట్లకు సంబంధించి జిల్లా సహకార కేంద్రబ్యాంకులో జమ అయిన డిపాజిట్లపై రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియాతో పాటు ఆదాయపు పన్నుశాఖ దృష్టి పడింది. జిల్లాలో కేడీసీసీబీకి 22 బ్రాంచీలున్నాయి. కేంద్రప్రభుత్వం నవంబర్ 8వతేదీన రూ.500, 1000 నోట్లను రద్దు చేసింది. 9న బ్యాంకులు బంద్ అయ్యాయి. పదవ తేదీ నుంచి 14 వరకు జిల్లా సహకార బ్యాంకులో రూ. 26 కోట్ల రద్దయిన కరెన్సీ డిపాజిట్ అయింది. ఈ బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారుల్లో 85శాతం మంది రైతులే. వరుస కరువులతో అప్పుల్లో కూరుకుపోయిన రైతులు డిపాజిట్లు చేసే స్థాయిలో లేరు. దీన్ని బట్టి చూస్తే కేడీసీసీబీలో రాజకీయ ప్రమేయం ఎక్కువగా ఉండటం వల్ల నల్లడబ్బును భారీగా డిపాజిట్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పటికే ఆర్బీఐ జిల్లా కేంద్రసహకార బ్యాంకులో నవంబరు 10 నుంచి 14వ తేదీ వరకు వచ్చిన డిపాజిట్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా రాజకీయ నేతల అధీనంలో ఉన్న సహకార బ్యాంకుల్లో రద్దయిన నోట్లు డిపాజిట్లుగా వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని డీసీసీబీల్లో డిపాజిట్లు పెద్ద ఎత్తున వచ్చిపడ్డాయి. వీటిన్నిటిని ఆరాతీస్తున్న ఆర్బీఐ కర్నూలు సహకార బ్యాంకుకు వచ్చిన డిపాజిట్లను పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా సీఈఓ రామాంజనేయులు మాట్లాడుతూ... తమ బ్యాంకుకు రద్దయిన నోట్లు దాదాపు రూ.26 కోట్లు డిపాజిట్లుగా వచ్చాయని, ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్బీఐ, ఆప్కాబ్‌కు పంపినట్లు తెలిపారు. కేడీసీసీబీకి 22 బ్రాంచీలుండగా సగటున రూ.1.10 కోట్ల ప్రకారం డిపాజిట్లు పడ్డాయన్నారు. ఇవన్నీ కూడా రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల మొత్తంలో డిపాజిట్ అయినవేనని వెల్లడించారు. -
కేడీసీసీబీ ఆధ్వర్యంలో పోటీలు
కర్నూలు(అగ్రికల్చర్): వచ్చే నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే సహకార వారోత్సవాల సందర్భంగా జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఆధ్వర్యంలో విద్యార్థులకు, సహకార సిబ్బందికి, కవులు, రచయితలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా సీఈఓ రామాంజనేయులు తెలిపారు. సహకార వ్యవస్థ ఔనత్యం చాటి చెప్పడం, సహకార సంఘాలు నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టేదెలా తదితర వాటిపై పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.వివరాలకు 83330 32950ను సంప్రదించాలన్నారు. - డిగ్రీ విద్యార్థులకు నవంబరు 6న మద్దూరు నగర్‌లోని మాస్టర్ జూనియర్ కళాశాలలో దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార రంగ పాత్ర, ప్రాధాన్యత అవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలు. - కవులు, రచయితలకు సహకార వ్యవస్థ– ఔన్నత్యం అనే అంశంపై కవితలు రాసి వచ్చే నెల 7వ తేదీలోపు జిల్లా సహకార కేంద్రబ్యాంకుకు పంపాలి. - పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలను ఎంపిక చేసి సహకార వారోత్సవాలు ప్రారంభం రోజున బహుమతులు పంపిణీ చేస్తారు. -
‘సహకారం’ కొరవడింది!
లాభాల పథకాల వైపే కేడీసీసీబీ మొగ్గు – పంట రుణాల కోసం చిన్న, సన్నకారు రైతుల నిరీక్షణ – పాత రుణాల రెన్యూవల్‌తో సరిపెడుతున్న బ్యాంకు – నాబార్డు బడ్జెట్ ఇవ్వలేదని సాకు – సహకార సంఘాల చుట్టూ రైతుల ప్రదక్షిణ పంట రుణాల పంపిణీలో రైతుల బ్యాంకుగా ముద్రపడిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చేతులెత్తేసింది. వేలాది రైతులు కొత్త రుణాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న తరుణంలో ఈ నిర్ణయం నిరాశ కలిగిస్తోంది. సొంత నిధులతో పంట రుణాలు ఇవ్వలేమని.. నాబార్డు నిధులు ఇస్తే తప్ప రుణాలు ఇవ్వడం వీలు పడదని బ్యాంకు అధికారులు తేల్చి చెబుతున్నారు. కాంపోజిట్ రుణ పథకం.. రైతు నేస్తం.. కర్షక జ్యోతి.. తదితర లాభాలు పండించే పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ఈ బ్యాంకు.. చిన్న, సన్న, మధ్యకారు రైతులను క్రమంగా వదిలించుకునే ప్రయత్నం చేస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ)లో 95 సహకార సంఘాలకు సభ్యత్వం ఉంది. బ్యాంకు నుంచి బడ్జెట్ ఇస్తేనే.. వీటి ద్వారా పంట రుణాల పంపిణీకి అవకాశం ఉంటుంది. అయితే కేడీసీసీ బ్యాంకు కూడా పంట రుణాల బడ్జెట్ విషయంలో నాబార్డుపై ఆధారపడింది. నాబార్డు ప్రతి యేటా ఆప్కాబ్‌కు నిధులు కేటాయిస్తుంది. ఆ మొత్తాన్ని ఆప్కాబ్ 4.65 శాతం వడ్డీతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు.. ఇది 5.5 శాతం వడ్డీతో సహకార సంఘాలకు విడుదల చేస్తోంది. సంఘాలు 7 శాతం వడ్డీతో రైతులకు రుణాలిస్తాయి. అయితే ఈ ఏడాది నాబార్డు నిధులు ఇవ్వకపోవడంతో కొత్త పంట రుణాల పంపిణీ నిలిచిపోయింది. 2015లో రెన్యూవల్‌తో పాటు దాదాపు రూ.250 కోట్ల పంట రుణాలను పంపిణీ చేశారు. ఈ ఏడాది వీటిని బుక్ అడ్జెస్ట్మెంట్ రూపంలో రెన్యూవల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాంకు పాత రుణాల రెన్యూవల్ మినహా ఒక్క కొత్త రైతుకూ ‘సహకారం’ అందించలేకపోయింది. బ్యాంకులు లేని చోట రైతులకు సహకార సంఘాలే ఆధారం. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు కొత్త రుణాల కోసం డీసీసీబీ బ్రాంచ్‌లు.. సహకార సంఘాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోంది. స్వల్పకాలిక రుణాలు నిల్ లాభార్జనే లక్ష్యంగా కేడీసీసీబీ దీర్ఘకాలిక రుణాల పంపిణీకి ప్రాధాన్యతను ఇస్తోంది. స్వల్పకాలిక రుణాల పంపిణీకి స్వస్తి పలికింది. సొంత నిధులను స్వల్పకాలిక రుణాలకు పంపిణీ చేయలేమని.. నాబార్డు నిధులు ఇస్తేనే అందుకు అవకాశం ఉంటుందని అధికారులు తేల్చేశారు. సొంత నిధులను బ్యాంకుకు లాభాలను తీసుకొచ్చే పథకాలకు మళ్లిస్తుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. కాంపోజిట్, రైతు నేస్తం, కర్షకజ్యోతి తదితర పథకాలకు వందల కోట్లు ఇస్తున్నారు. ఈ పథకాల కింద రూ.11 శాతం వడ్డీ రేటు ఉంటుంది. అందువల్ల కేడీసీసీబీ ఈ పథకాల వైపు మొగ్గు చూపుతోంది. ఇదే సమయంలో చిన్న రైతులకు ఉపయోగపడే పంటరుణాల పంపిణీకి ఎగనామం పెడుతోంది. బడ్జెట్ వస్తేనే కొత్త రుణాలు గత ఏడాది పంపిణీ చేసిన పంట రుణాలన్నింటినీ రెన్యూవల్ చేశాం. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లు మాత్రమే ఉంటాయి. వాటిని 7శాతం వడ్డీ కింద పంట రుణాలు ఇవ్వలేం. ఆప్కాబ్ నుంచి బడ్జెట్ వస్తేనే కొత్త పంట రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. – రామాంజనేయులు, కేడీసీసీబీ సీఈఓ