‘సహకారం’ కొరవడింది!
‘సహకారం’ కొరవడింది!
Published Fri, Sep 23 2016 1:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
లాభాల పథకాల వైపే కేడీసీసీబీ మొగ్గు
– పంట రుణాల కోసం చిన్న, సన్నకారు రైతుల నిరీక్షణ
– పాత రుణాల రెన్యూవల్‌తో సరిపెడుతున్న బ్యాంకు
– నాబార్డు బడ్జెట్ ఇవ్వలేదని సాకు
– సహకార సంఘాల చుట్టూ రైతుల ప్రదక్షిణ
పంట రుణాల పంపిణీలో రైతుల బ్యాంకుగా ముద్రపడిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చేతులెత్తేసింది. వేలాది రైతులు కొత్త రుణాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న తరుణంలో ఈ నిర్ణయం నిరాశ కలిగిస్తోంది. సొంత నిధులతో పంట రుణాలు ఇవ్వలేమని.. నాబార్డు నిధులు ఇస్తే తప్ప రుణాలు ఇవ్వడం వీలు పడదని బ్యాంకు అధికారులు తేల్చి చెబుతున్నారు. కాంపోజిట్ రుణ పథకం.. రైతు నేస్తం.. కర్షక జ్యోతి.. తదితర లాభాలు పండించే పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ఈ బ్యాంకు.. చిన్న, సన్న, మధ్యకారు రైతులను క్రమంగా వదిలించుకునే ప్రయత్నం చేస్తోంది.
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ)లో 95 సహకార సంఘాలకు సభ్యత్వం ఉంది. బ్యాంకు నుంచి బడ్జెట్ ఇస్తేనే.. వీటి ద్వారా పంట రుణాల పంపిణీకి అవకాశం ఉంటుంది. అయితే కేడీసీసీ బ్యాంకు కూడా పంట రుణాల బడ్జెట్ విషయంలో నాబార్డుపై ఆధారపడింది. నాబార్డు ప్రతి యేటా ఆప్కాబ్‌కు నిధులు కేటాయిస్తుంది. ఆ మొత్తాన్ని ఆప్కాబ్ 4.65 శాతం వడ్డీతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు.. ఇది 5.5 శాతం వడ్డీతో సహకార సంఘాలకు విడుదల చేస్తోంది. సంఘాలు 7 శాతం వడ్డీతో రైతులకు రుణాలిస్తాయి. అయితే ఈ ఏడాది నాబార్డు నిధులు ఇవ్వకపోవడంతో కొత్త పంట రుణాల పంపిణీ నిలిచిపోయింది. 2015లో రెన్యూవల్‌తో పాటు దాదాపు రూ.250 కోట్ల పంట రుణాలను పంపిణీ చేశారు. ఈ ఏడాది వీటిని బుక్ అడ్జెస్ట్‌మెంట్ రూపంలో రెన్యూవల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాంకు పాత రుణాల రెన్యూవల్ మినహా ఒక్క కొత్త రైతుకూ ‘సహకారం’ అందించలేకపోయింది. బ్యాంకులు లేని చోట రైతులకు సహకార సంఘాలే ఆధారం. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు కొత్త రుణాల కోసం డీసీసీబీ బ్రాంచ్‌లు.. సహకార సంఘాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోంది.
స్వల్పకాలిక రుణాలు నిల్
లాభార్జనే లక్ష్యంగా కేడీసీసీబీ దీర్ఘకాలిక రుణాల పంపిణీకి ప్రాధాన్యతను ఇస్తోంది. స్వల్పకాలిక రుణాల పంపిణీకి స్వస్తి పలికింది. సొంత నిధులను స్వల్పకాలిక రుణాలకు పంపిణీ చేయలేమని.. నాబార్డు నిధులు ఇస్తేనే అందుకు అవకాశం ఉంటుందని అధికారులు తేల్చేశారు. సొంత నిధులను బ్యాంకుకు లాభాలను తీసుకొచ్చే పథకాలకు మళ్లిస్తుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. కాంపోజిట్, రైతు నేస్తం, కర్షకజ్యోతి తదితర పథకాలకు వందల కోట్లు ఇస్తున్నారు. ఈ పథకాల కింద రూ.11 శాతం వడ్డీ రేటు ఉంటుంది. అందువల్ల కేడీసీసీబీ ఈ పథకాల వైపు మొగ్గు చూపుతోంది. ఇదే సమయంలో చిన్న రైతులకు ఉపయోగపడే పంటరుణాల పంపిణీకి ఎగనామం పెడుతోంది.
బడ్జెట్ వస్తేనే కొత్త రుణాలు
గత ఏడాది పంపిణీ చేసిన పంట రుణాలన్నింటినీ రెన్యూవల్ చేశాం. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లు మాత్రమే ఉంటాయి. వాటిని 7శాతం వడ్డీ కింద పంట రుణాలు ఇవ్వలేం. ఆప్కాబ్ నుంచి బడ్జెట్ వస్తేనే కొత్త పంట రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.
– రామాంజనేయులు, కేడీసీసీబీ సీఈఓ
Advertisement