రీ పోస్టుమార్టానికి మృతదేహం వెలికతీత
దగదర్తి : తన తండ్రి మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి కుమారుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఖననం చేసిన మృతదేహాన్ని రీపోస్టుమార్టం నిమిత్తం వెలికితీశారు. మండలం పరిధిలోని అటవీ ప్రాంతంలో గత నెల 29వ తేదీన గుర్తించిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొత్తపల్లి కౌరుగుంటకు చెందిన నారాయణ (60)గా మరుసటి రోజు కుటుంబ సభ్యులు గుర్తించిన విషయం విదితమే. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. అయితే తన తండ్రిని కొందరు హత్య చేశారని మృతుడి కుమారుడు వేణు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శుక్రవారం దగదర్తి తహసీల్దార్ వై.మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో ఖననం చేసిన మృతదేహాన్ని వెలికి తీసి, పంచనామా నిర్వహించారు. వైద్యులు మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం కేసు దర్యాప్తు చేస్తామని ఎస్సై విజయ్‌శ్రీనివాస్ తెలిపారు.