విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ప్రతి మొక్కను సంరక్షించాలి
- అడవిని నాశనం చేయిస్తే కఠిన చర్యలు
- విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల
సాక్షిప్రతినిధి, ఖమ్మం
హరితహారం కార్యక్రమం కింద జిల్లాలో పెట్టుకున్న లక్ష్యాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం డీసీసీబీ కార్యాలయంలో మొక్కలు నాటిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 2.30 కోట్ల మొక్కలు నాటారని, ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలన్నారు. మొక్కల సంరక్షణకు ఒక్కోదానికి రూ.85లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, సింగరేణి ఆధ్వర్యంలో కూడా రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నామన్నారు. హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. దేశస్థాయిలో చూస్తే జిల్లాలో అటవీ విస్తీర్ణం ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయిందని, దీనికి సామాజిక, రాజకీయ కారణాలు అనేకం ఉన్నాయన్నారు. గిరిజనుల బతుకులను బుగ్గిపాలు చేయవద్దని, సమాజ వ్యతిరేక కార్యకలాపాలను ప్రొత్సహించే పార్టీలు ఏవీ బాగుపడలేదన్నారు. కన్నతల్లి లాంటి అడవిని సంరక్షించుకోవాలని, అడవిని నాశనం చేయాలనే చూసే వారిపై కఠినంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, కలెక్టర్ డీఎస్.లోకేశ్‌కుమార్, జేసీ దివ్య, అటవీశాఖ చీప్ కన్జర్వేటర్ రఘువీర్, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు.