నంద్యాల ఉప ఎన్నికకు సిద్ధం కండి | ready to nandyal by election | Sakshi
Sakshi News home page

నంద్యాల ఉప ఎన్నికకు సిద్ధం కండి

Published Sun, Jul 23 2017 11:50 PM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

నంద్యాల ఉప ఎన్నికకు సిద్ధం కండి - Sakshi

నంద్యాల ఉప ఎన్నికకు సిద్ధం కండి

– డీ డూప్లికేట్‌ ఓటర్లకు తావులేకుండా చర్యలు తీసుకోండి
– మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయండి
–పోలింగ్‌ కేంద్రాలను క్షుణంగా పరిశీలించాలి
– రెండుమూడురోజుల్లో నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం
– అధికారులతో సమీక్షలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ 
కర్నూలు(అగ్రికల్చర్‌): నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికకు  సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆదివారం స్టేట్‌గెస్ట్‌ హౌస్‌లోని సమావేశ మందిరం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నంద్యాల నియోజక వర్గ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్‌ మాట్లాడుతూ... డీ డూప్లికెట్‌ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి బోగస్‌ ఓటర్లను తొలగించాలని సూచించారు. ఇప్పటికే నంద్యాల అసెంబ్లీలో 2.09 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, కొత్తగా ఓటరు నమోదుకు 10,500 దరఖాస్తులు వచ్చాయన్నారు.
 
నంద్యాల నియోజక వర్గం పరిధిలో ఆర్‌డీఓతో సహా తహసీల్దారు, డీఎస్‌పీ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, మున్సిపల్‌ కమిషనర్లు తదితర అధికారులు ఒకే చోట మూడేళ్లకు పైబడి పని చేస్తుంటే వారందరిని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. స్వంత జిల్లాకు చెందిన వారిని నియమించరాదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ఇతర నియోజక వర్గాలకు చెందిన ఉద్యోగులనే పోలింగ్‌ సిబ్బందిగా నియమించాలని వెల్లడించారు. పోలింగ్‌కు ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్‌ లెవల్, సెకండ్‌ లెవల్‌ చెకింగ్‌ చేపట్టాలన్నారు. 
 
రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్‌!
నంద్యాల ఉప ఎన్నిక  ప్రక్రియ మొత్తం సెప్టంబర్‌ 12లోపు పూర్తి కావాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన​‍్వర్‌లాల్‌ పేర్కొన్నారు.  రెండు, మూడు రోజుల్లో ఎన్నికల  నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని  స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూలు వెలువడగానే జిల్లా మొత్తం మీద కోడ్‌ అమల్లోకి వస్తుందని ప్రకటించారు.  
 
ఇంకా డీ డూప్లికేట్‌ ఓటర్లు ఉన్నారా?
ఓటర్ల జాబితాలో ఇప్పటికీ డీ డూప్లికేట్‌ ఓటర్లు ఉండటం పట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత టెక్నాలజీలో బోగస్‌ ఓటర్లు ఉండటమేమిటని ప్రశ్నించారు. తాను స్వయంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేశానని ఇందులోనే డీ డూప్లికేట్‌ ఓటర్లు ఉండటం గుర్తించినట్లు తెలిపారు.
 
 ఓటరు నమోదు ఆశించిన స్థాయిలో లేదు
  జిల్లాలో ఆశించిన స్థాయిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జరగడం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ అన్నారు. 18–19 ఏళ్ల యువత ఓటర్లుగా నమోదు కావడం లేదని చెపా​‍్పరు.  జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతర వృత్తి విద్యాసంస్థల్లో ఓటరు నమోదుపై యువతకు అవగాహన కల్పించాలని వివరించారు. వారంతా 2019 ఎన్నికలలోపు ఓటర్లుగా నమోదు అయ్యే విధంగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికను స్వేచ్ఛగా ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
 
ఇప్పటికే నంద్యాల నియోజకవర్గంలోని అధికారులను మార్చినట్లు తెలిపారు. బార్డర్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డీ డూప్లికేట్‌ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో  ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, జేసీ ప్రసన్న వెంకటేష్, జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, అన్ని నియోజక వర్గాల ఇఆర్‌ఓలు వెంకటసుబ్బారెడ్డి, ఈశ్వర్, హుసేన్‌సాహెబ్, రాంసుందర్‌రెడ్డి, ఓబులేసు, తిప్పేనాయక్, జయకుమార్, మల్లికార్జునుడు, సత్యం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement