విభజనకు సిద్ధం | Ready to perform | Sakshi
Sakshi News home page

విభజనకు సిద్ధం

Published Fri, Jan 13 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

Ready to perform

కొత్త జిల్లాల్లో  గ్రంథాలయ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం
సంస్థ డైరెక్టర్లు, విద్యాశాఖ కమిషనర్ల    సమావేశంలో వెల్లడి
ఉన్నతాధికారులకు నివేదిక   అందించనున్న జిల్లా కార్యదర్శి


చిరిగినచొక్కనైనా వేసుకో.. కానీ ఓ మంచిపుస్తకం కొనుక్కో అన్నాడు ఓ మహానుభావుడు.. ఎందుకంటే పుస్తకం ఓ మంచి స్నేహితుడిలాగా మార్గదర్శకం చేస్తూ గమ్యస్థానానికి చేరుస్తుంది. అలాంటి పుస్తకాల విజ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు. స్వాతంత్య్ర ఉద్యమనాటి కాలం నుంచి గ్రంథాలయాల పాత్ర కీలకం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎందరో మహనీయులు, పేద విద్యార్థులకు ఆకలింపుగా ఉన్న గ్రంథాయాలు నేడు కొత్తగా ఏర్పడ్డ జిల్లాల వారీగా విభజనకు సిద్ధమవుతున్నాయి. – ఆదిలాబాద్‌ కల్చరల్‌

ఆదిలాబాద్‌ కల్చరల్‌ : జిల్లాల పునర్విభజన పూర్తయిన నాలుగు నెలల తర్వాత గ్రంథాలయాల పునర్విభజనకూ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖతో కలిసి సమావేశం నిర్వహించింది. జనవరి 4న గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ వెంకటేశ్వరశర్మ, విద్యాశాఖ కమిషనర్‌  కిషన్, ఉమ్మడి తెలంగాణ జిల్లాల్లోని కార్యదర్శులు, చైర్మన్‌ (ప్రస్తుత జేసీలు)లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఇందులో పునర్విభజనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని, కొత్త జిల్లాలో గ్రంథాలయసంస్థ కార్యాలయాలు, సెంట్రల్‌ లైబ్రరీలకు స్థలాలను పరిశీలించాలని చెప్పినట్లు సూచించారు. దీంతో కొత్త జిల్లాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.  

కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు..
కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా మినహా, నిర్మల్, మంచిర్యాల జిల్లాకేంద్రాల్లో జిల్లా గ్రంథాలయసంస్థ కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఆదర్శనగర్‌లోని గ్రంథాలయంలో 1200 గజాలతో కూడిన స్థలంలో ఆరు గదులతో నిర్మించబడిన భవనాన్ని జిల్లా గ్రంథాలయసంస్థ కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నారు. మంచిర్యాలలోని గాంధీపార్క్‌ రోడ్డులోని గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో సుమారు వెయ్యి గజాల స్థలంలో కార్యాలయం ఏర్పాటుకు జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌ పరిశీలించి ప్రతిపాదనలు రూపొందించారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఎకరం విస్తీర్ణంలో కార్యాలయం, సెంట్రల్‌ లైబ్రరీ కొనసాగుతోంది. కాగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో స్థలం లేక పోగా గ్రంథాలయ కార్యదర్శి ప్రభాకర్‌ ఆ జిల్లా కలెక్టర్‌కు స్థలం కోసం విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ అంశం డీఆర్వోకు అప్పగించినట్లు తెలిసింది. కాగా త్వరలో ఆ జిల్లాలోనూ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కూడా కేటాయించనున్నారు.  
విభజనలో గ్రంథాలయాలు, ఉద్యోగులు, పుస్తకాలు
► ఆదిలాబాద్‌ జిల్లాలో 18మండలాలుండగా 13 మం డలాల్లో గ్రంథాయాలున్నాయి. వీటిలో 18 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, ఇద్దరు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుండగా 1,28,259 పుస్తకాలున్నాయి. కొత్తగా ఏర్పడ్డ గాదిగూడ, భీంపూర్, ఆదిలాబాద్‌రూరల్, సిరికొండ, మావల మండలాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.  
►నిర్మల్‌ జిల్లాలో 18మండలాలుండగా 16 మండలాల్లో గ్రంథాయాలు పని చేస్తున్నాయి. వీటిలో 14మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, ముగ్గురు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుండగా 1,30,014 పుస్తకాలున్నాయి. కొత్తగా ఏర్పడ్డ నిర్మల్‌ (రూరల్‌), దస్తూరాబాద్, సోన్‌ మండలాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
►మంచిర్యాల జిల్లాలో 18మండలాలుండగా 14గ్రంథాయాలు పని చేస్తున్నాయి. వీటిలో రెగ్యులర్‌ ఉద్యోగులు 8మంది, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఐదుగురు పని చేస్తుండగా 1,19,865 పుస్తకాలున్నాయి. ఇందులో వేమనపల్లి మండలంలో గ్రంథాలయం ప్రారంభానికి నోచుకోలేదు. కొత్తగా ఏర్పడ్డ నర్సాపూర్, హాజీపూర్, కన్నెపల్లి, భీమారం మండలాల్లో గ్రంథాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.  
►కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 15మండలాలుండగా తొమ్మిది మండలాల్లోనే గ్రంథాలయాలు పని చేస్తున్నాయి. వీటిలో రెగ్యులర్‌గా ఐదుగురు ఉద్యోగులు పనిచేస్తుండగా 64,141 పుస్తకాలున్నాయి. తిర్యాణి, బెజ్జూర్, దహేగాం మండలాల్లో గ్రంథాలయాలు ప్రారంభానికి నోచుకోలేదు. కొత్తగా ఏర్పడ్డ లింగాపూర్, పెంచికల్‌పేట్, చింతమణి పల్లె మండలాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పడిన జి ల్లా కేంద్రాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయాల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించాం. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోనూ స్థలానికి కలెక్టర్‌కు విన్నవించాం. త్వరలో డీఆర్వోను కలిసి స్థల వివరాలు సేకరించనున్నాం. యుద్ధప్రాతిపాదికన జిల్లా గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.   – ప్రభాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement