రెండుగా ఆర్టీఏ కార్యాలయం
-
ముమ్మరంగా విభజన ఏర్పాట్లు
-
నాలుగు జిల్లాల ఫైళ్ల ఆన్‌లైన్ పూర్తి
-
హుజూరాబాద్, ములుగులో సబ్ ఆర్టీఏలు
ఖిలావరంగల్ :
జిల్లాల పునర్విభజనలో భాగంగా వరంగల్ జిల్లా ఆర్టీఏ కార్యాలయ విభజన వేగవంతమైంది. ప్రస్తుత వరంగల్ రవాణా శాఖలో రెండు జిల్లాల పనులు సాగుతున్నాయి. నూతనంగా వరంగల్, హన్మకొండ, జయశంకర్ జిల్లా (భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అక్టోబర్ 1 నుంచే కొత్త కార్యాలయాల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు భూపాలపల్లిలో ఓ అద్దె భవనంలో జిల్లా కార్యకలాపాలకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. మహబూబాబాద్‌లో సబ్ ఆర్టీఏ కార్యాలయంలోనే జిల్లా కార్యాలయం ఏర్పాటుకు పనులు సాగుతున్నాయి. వరంగల్ ఆర్టీఏ ప్రధాన భవనం పైఫ్లోర్‌లో హన్మకొండ, గ్రౌండ్ ఫోర్‌లో వరంగల్ జిల్లా ఆర్టీఏ కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆర్టీఏ విభజన పనులతోపాటు కార్యాలయాల మరమ్మతులు వేగంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా రవాణాశాఖ కమిషనర్ ఉత్తుర్వుల మేరకు నాలుగు జిల్లాల స్టేషనరీ చేరింది. ఈమేరకు సోమవారం డీటీసీ శివలింగయ్య కార్యాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పడుతున్న జిల్లా కార్యాలయాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. జిల్లాలకు సంబంధించిన విభజన ఫైళ్లను ఆన్‌లైన్‌లోనే నమోదు చేశామని, ప్రభుత్వం అందజేసిన స్టేషనరీ చేరుకుందని చెప్పారు. ఉద్యోగుల విభజన సైతం పూర్తి చేశామని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న జనగామ సబ్ కార్యాలయాన్ని యధావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. వాహనదారుల సౌకర్యార్థం నూతనంగా ములుగు, హుజూరాబాద్‌లో సబ్ కార్యాలయాల ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీలోగా నూతన కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేసి దసరా నుంచి కొత్త కార్యాలయాల్లో పనులు ప్రారంభించనున్నట్లు డీటీసీ తెలిపారు.