వరద సహాయ చర్యలకు పోలీస్‌శాఖ సిద్ధం
-
ఎస్పీ జోయల్ డేవిస్
కరీంనగర్ క్రైం : వరద సహాయ చర్యలు చేపట్టేందుకు పోలీస్‌శాఖ సిద్ధంగా ఉందని ఎస్పీ జోయల్‌డేవిస్ అన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో చెరువులు కుంటలకు గండ్లు పడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాలు, పురాతన భవనాల్లో నివాసం ఉండొద్దని, ముంపు ప్రాంతాలను వదలి ఎత్తయిన ప్రాంతాల్లో, ప్రభుత్వ పునరావాస ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. సమాచార, ప్రసారమాద్యమాలు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైన ప్రమాదం జరిగినా జరిగే అవకాశం ఉన్నా వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
జాగ్రత్తలు..
మెరుపులతో కూడి ఉరుముల శబ్దం వినిపిస్తే వెంటనే ఇళ్లలోకి వెళ్లాలి. ఈ సమయంలో అత్యవసరమైతే తప్పా సెల్‌ఫోన్ మాట్లాడొద్దు.
పోడవైన లోహపు స్తంభాలు, ఒంటరి చెట్ల కింద ఉండకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు నీటి నిల్వ ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
ట్రాక్టర్, మోటారు సైకిళ్లు, స్కూటర్లు తదితర వాహనాలకు ఫెన్సింగ్ వైర్లు, బట్టల ఆరేసే వైర్లకు దూరంగా ఉండాలి. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, షెడ్లలో నివాసం ఉండొద్దు.
బహిరంగ ప్రదేశాల్లో ఉన్నపుడు ఉరుములు, మెరుపులు సంకేతాలు ఏర్పడినప్పుడు మెకాళ్లపై కూర్చుని తలను మెకాళ్లకు అన్చాలి. నేలపై పడుకోకూడదు.
రేడియోలు, టీవీలకు ఉన్న కనెక్షన్లు తొలగించాలి. వర్షం లేకున్నా పిడుగులు పడే అవకాశం ఉంటుంది. వర్షం పడుతున్న ప్రాంతం నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా పిడుగులు పడే అవకాశం ఉంటుంది.
పిడుగుపాటు గురైన వ్యక్తిని రక్షించే సమయంలో సదరు వ్యక్తి నుంచి విద్యుత్ సరఫరా అవుతుందనే అపవాదు నమ్మెుద్దు.