
వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది
జోగిపేట : అందోలు మండలం డాకూర్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ జహంగీర్ (65)హత్య కేసును జోగిపేట పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించి జోగిపేట సీఐ వెంకటయ్య గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఎల్లమ్మతో జహంగీర్‌కు అక్రమ సంబంధం ఉందని, అయితే రెండు సంవత్సరాల నుంచి అదే గ్రామానికి చెందిన అర్జునయ్య ఎల్లమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్నారు. ఈ విషయం జహంగీర్‌కు తెలియడంతో పలుసార్లు ఇద్దరిని పిలిచి మందలించారు. అయినా వారిద్దరూ సంబంధం కొనసాగిస్తూ వచ్చారు.
తమ సంబంధానికి అడ్డుతగులుతున్నాడని భావించిన అర్జునయ్య ఎలాగైనా జహంగీర్‌ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్జునయ్య, తన బావమరిది అనిల్, ఎల్లమ్మలు కలిసి జహంగీర్‌ను హత్య చేసేందుకు పథకం వేశారు. జూలై 24వ తేదీ రాత్రి జహంగీర్ ఇంట్లో ఎల్లమ్మతో కలిసి నిద్రిస్తున్న సమయంలో బావ, బావ మరిది కలిసి జహంగీర్ ఇంటి వద్దకు వెళ్లారు. అర్థరాత్రి సమయంలో ఎల్లమ్మ ముందు రచించిన పథకం ప్రకారం తలుపులు తెరచింది. వారిద్దరూ గదిలోకి ప్రవేశించి జహంగీర్ తలపై కట్టెలతో బలంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లమ్మ ఎప్పటిలాగే తన ఇంటికి వెళ్లిపోయింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరిపి అర్జునయ్య, అనిల్, వారికి సహకరించినందుకు ఎల్లమ్మలపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటయ్య తెలిపారు. ఎస్‌ఐ విజయ్‌రావు, ట్రైనీ ఎస్‌ఐ గౌతంలు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నిందితులను జోగిపేట మున్సిఫ్‌కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.