సి‘ఫార్స్’ నియామకం
-
ఎమ్మెల్యే బంధువు ‘పవర్’
-
నెలన్నర కిందట అధికారాలకు కోత
-
రాజకీయ జోక్యంతో మళ్లీ అప్పగింత
సాక్షి, హన్మకొండ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఉద్యోగుల పోస్టుంగ్‌లలోనే కాదు పనితీరు వ్యవహరంలోనూ రాజకీయ జోక్యం పెరిగింది. ఉద్యోగుల పనితీరుతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారికి మంచి పోస్టులు ఇవ్వాలని గ్రేటర్ అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెరిగింది. దీంతో పనితీరు బాగా లేని వారిని పక్కన పెట్టారు. ఇలా పనితీరు ప్రమాణికంగా పక్కన పెట్టిన ఓ ఉద్యోగి రాజకీయ బలంతో మళ్లీ కీలకమైన పోస్టులోకి వచ్చారు. దీంతో ఉన్నతాధికారుల నిర్ణయాలకు అర్థంలేకుండా పోయిందనే అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయ బలహీనులపైనే ఉన్నతాధికారులు అధికారం చెలాయిస్తారనే చర్చ జరుగుతోంది.
కార్పొరేషన్‌లో రెవెన్యూ విభాగంలో టాక్స్ ఆఫీసర్, అడిషనల్ కమిషనర్‌ల పనితీరు బాగాలేదనే కారణంతో కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ వారి అధికారాల్లో కోత పెట్టారు. కొత్త ఇంటి నెంబర్లకు సంబంధించిన బాధ్యతల నుంచి పక్కకు తప్పించారు. దీంతో అడిషనల్ కమిషనర్ షాహిద్ మసూద్, టాక్స్ ఆఫీసర్‌గా శాంతికుమార్ విధుల్లో ఉన్నా ఫైళ్లను చూసే పవర్ లేకుండా పోయింది. అయితే, నెలన్నర గడిచే సరికి.. ఏ స్థానం నుంచి కదిలారో వారు అదే స్థానాలను తిరిగి దక్కించుకున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోకి కొద్ది ప్రాంతం వచ్చే ఓ ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా ఈ అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ టాక్స్ ఆఫీసర్ సదరు ఎమ్మెల్యే బంధువు కావడం గమనార్హం.
అడిషనల్ కమిషనర్‌కు గ్రేటర్ వరంగల్ పాలకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి చొరవతో ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నlశాంతికుమార్ 2009లో ఖమ్మం జిల్లా పాల్వంచ మున్సిపాటీ కమిషనర్‌గా 2011 వరకు పనిచేశారు. ఈ సమయంలో రూ.1.70 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్లుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనికితోడు ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసు విషయంలోనే శాంతికుమార్‌ను పక్కకు పెట్టారనే ప్రచారం ఉంది. పనితీరు బాగాలేదని పక్కనబెట్టిన వారికి మళ్లీ అదే స్థాయిలో అధికారులు ఇవ్వడం కార్పొరేషన్‌లో చర్చనీయాంశంగా మారింది.
సమాచార లోపం వల్లే : శాంతికుమార్, టాక్స్ ఆఫీసర్
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో టాక్స్ ఆఫీసర్‌గా 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఐదు కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేయాల్సిందిగా నాకు లక్ష్యం నిర్ధేశించారు. నేను రూ. 3.15 కోట్లు పన్నులు వసూలు చేశాను. లక్ష్యం చేరలేదనే కారణంతో నన్ను తాత్కాలికంగా అధికారాల నుంచి పక్కన పెట్టారు. అయితే 42 విలీన గ్రామాల్లో నిర్ధేశించిన రూ. 4.18 కోట్ల లక్ష్యాన్ని దాటి రూ. 8.70 కోట్లు వసూలు చేశాను. ఈ విషయం ఉన్నతాధికారులకు వివరించడంతో తిరిగి అధికారాలు అప్పగించారు. ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యమూ లేదు.
ఎందుకో తెలియదు : షాహిద్ మసూద్, అడిషనల్ కమిషనర్
నెలన్నర కిందట రెవెన్యూ విభాగంలోని ఇంటినంబర్ల కేటాయింపుపై అధికారాలను ఎందుకు కోత విధించారో నాకు తెలియదు. తాజాగా ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. నేను ఎటువంటి పైరవీ చేయలేదు.