gwmc
-
సత్పతీ... సలామ్!
వరంగల్ అర్బన్ :కొందరు అధికారులు పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తారు.. మరికొందరు పనిచేస్తూ, చేయిస్తూనే కింది స్థాయి సిబ్బంది శ్రేయస్సు కోసం కృషి చేసి వారిపై చెరగని ముద్ర వేస్తారు. ఆ కోవలోకే వస్తారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) కమిషనర్ పమేలా సత్పతి! బల్దియా సిబ్బంది కార్మికుల సంక్షేమానికి తన స్నేహితుల ద్వారా రూ.20లక్షలు సేకరించి ప్రత్యేక ని«ధిగా ఏర్పాటుచేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఆమె మనసున్న మహారాణిలా నిలుస్తున్నారు. రూ.వెయ్యి ఇస్తేనే ఫొటోలు పేపర్లలో వేయించుకునే వారు ఉన్న ఈ రోజుల్లో ఏకంగా భారీ మొత్తాన్ని సాయమందించేందుకు వెచ్చిస్తున్న ఆమెపై బల్దియా ఉద్యోగులు, సిబ్బంది నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. సిబ్బంది సేవలు వెలకట్టలేనివి వరంగల్‌లోని జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉత్తమ సేవలు అందిస్తున్న వివిధ విభాగాల సిబ్బంది, కార్మికులకు కమిషనర్ పమేలా సత్పతి గురువారం ప్రశంసాపత్రాలు, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భయంకర కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు, సిబ్బంది సేవలు వెలకట్టలేనివన్నారు. కార్మికుల ఆరోగ్యం, శ్రమను దృష్టిలో పెట్టుకుని తన మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో వ్యక్తిగతంగా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విధినిర్వహణలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందడంలో ఆలస్యమైనా ఈ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.11లక్షలను ఆపదలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు సహాయార్థం ఖర్చు చేయగా మరో రూ.9లక్షలు నిధులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అయితే, అకారణంగా విధులను గైర్హాజరు కావొద్దని, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణతో పాటు విధి నిర్వహణ కూడా ముఖ్య మని గుర్తించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ విద్యాసాగర్, ఇన్చార్జ్ ఎంహెచ్ఓ జీ.వీ. నారాయణరావు, సెక్రటరీ విజయలక్ష్మి, సీహెచ్ఓ సునీత, డిప్యూటీ కమిషనర్ గోధుమల రాజు, టీఓ శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రజారోగ్య విభాగానికి చెందిన కార్మికులు మాదాసి కరుణాకర్, సంజీవ్, మల్లికార్జున్, బాబు, విజయ, సారయ్య, జవాన్లు సతీష్, సాంబయ్య, ఫీల్డ్ వర్కర్ ఆనంద్‌తో పాటు డీఆర్ఎఫ్ నుంచి సాయికుమార్, మాలి సురేష్, కంప్యూటర్ ఆపరేటర్ లింగనాథ్, కార్మికులు చందన్, లైన్మెన్ కరుణాకర్, హెల్పర్ సదానందం, బిల్ కలెక్టర్లు మొయిన్ పాషా, అటెండర్ సుజాతకు నగదు పురస్కారం, ప్రశంసాపత్రాన్ని అందశారు. -
చూద్దాం పూలదండన్నా మార్పు తీసుకొస్తుందేమో!
దండేశారు దండం పెట్టారు.. అయినా వినని వారికి ఫైన్ రాశారు... అప్పటికీ వినకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు.... వరంగల్ బల్దియా అధికారుల్లా ఆలోచిస్తారు. బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న వారికి జీడబ్ల్యూఎంసీ (గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్)ల అధికారులు వెరైటీ శిక్ష వేశారు. 200 వందల మందికి పైగా పూలదండలు వేసి సన్మానించారు. బహిరంగ మూత్ర విసర్జన కారణంగా... వరంగల్ ఏజీఎం ప్రాంతంలో రోడ్డుపై జనం నడవాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. బల్దియా అధికారులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎన్నోసార్లు శుభ్రం చేశారు. అయినా జనాల్లో మార్పు కనిపించకపోవడంతో ఈ దండ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ చుట్టు ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని.. అలా చేసినప్పుడే రోగాల బారిన పడకుండా ఉంటారని అధికారులు అంటున్నారు. చూద్దాం పూలదండ కార్యక్రమమన్నా ప్రజల్లో మార్పు తీసుకొస్తుందేమో. -
పేద్ద భారం..
♦ మ్యూటేషన్ ఫీజు 4 రెట్లు పెంపు ♦ ఆస్తుల పేరు మార్పిడిపై విధింపు ♦ ఆమోదం తెలిపిన గ్రేటర్ స్టాండింగ్ కమిటీ ♦ త్వరలో రిజిస్ట్రేషన్ శాఖకు నిర్ణయ ఉత్తర్వులు ♦ ఆందోళనలో ఆస్తుల కొనుగోలుదారులు వరంగల్ అర్బన్ : ఆస్తుల కొనుగోలుదారులపై ‘మహా’ భారం పడింది. మ్యూటేషన్(ఆస్తుల పేరు మార్పిడి) ఫీజులను నాలుగు రెట్లు పెంచుతూ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమోదముద్ర కూడా వేసింది. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున భవనాలు, ఖాళీ స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతుంటాయి. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగిన కార్యకలాపాలకు సంబంధించి ఆస్తుల పేరు మార్పిడి ప్రక్రియ గ్రేటర్ ద్వారా కొనసాగుతోంది. గతంలో రిజిస్ట్రేషన్ దస్తావేజులతో పేరు మార్పిడి కోసం గ్రేటర్ కార్పొరేషన్లో ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసేవారు. అయితే ఎనిమిది నెలల కాలంగా పారదర్శకత, సమయ పాలన, సమన్వయ లోపం వంటి తదితర సమస్యల తలెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ నిబంధనలను సడలించింది. రిజిస్ట్రేషన్ శాఖలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిగిన క్రమంలో ఆస్తుల పేరు మార్పిడి కోసం కూడా ఆ శాఖలోనే ఫీజులు వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో ఉన్న ఆస్తి విలువలో 0.20 శాతం అంటే రూ.లక్షకు రూ.200 చొప్పున రిజిస్ట్రేషన్ శాఖలోనే ఫీజు వసూలు చేస్తున్నారు. అక్కడి నుంచి గ్రేటర్ కార్పొరేషన్‌కు పేరు మార్పిడి కోసం బదలాయిస్తున్నారు. ఆస్తుల దస్తావేజుల ఆధారంగా కార్పొరేషన్ పన్నుల విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేసి పేరు మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్తుల పేరు మార్పిడి ఫీజును పెంచుతూ గ్రేటర్ వరంగల్ మునిసిపల్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 0.20 శాతం నుంచి 1.0 శాతానికి పెంచింది. త్వరలో నిర్ణయ ఉత్తర్వులను రిజిస్ట్రేషన్‌కు శాఖకు అందించనున్నారు. కొనుగోలుదారుల్లో ఆందోళన మొన్నటివరకు రూ.లక్షకు రూ.200 చెల్లించాల్సి ఉండగా, తాజాగా పెంచిన ఫీజులతో రూ.1,000 చెల్లించాల్సి వస్తుంది. దీన్ని ఆస్తుల కొనుగోలుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆస్తులకు సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్లు నిత్యం సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రతిసారి పేరు మార్పిడిపై రూ.లక్షకు రూ.వెయ్యి చొప్పన చెల్లించడం భారమని ఆందోళన చెందుతున్నారు. మ్యుటేషన్ ఫీజు పెంపుపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ పాలక, అధికార వర్గాలు మాత్రం గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నో ఏళ్లుగా ఒక శాతం ఫీజు వసూలు చేస్తున్నారని, ఈ మేరకు వరంగల్ పరిధిలో పెంచినట్లు పేర్కొంటున్నారు. -
తూర్పులో ఎక్కువ!
టెండరు పనుల్లో 10 శాతం పక్కకు కీలక ప్రజాప్రతినిధి అండదండలు నాసిరకంగా సాగుతున్న పనులు సాక్షి, వరంగల్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో అభివృద్ధి పనులకు నాణ్యత సమస్య పట్టుకుంది. కాంట్రాక్టర్లు ఒక్కటై ఈ–ప్రొక్యూర్మెంట్ టెండరు ప్రక్రియను అభాసుపాలు చేస్తున్నారు. ప్రతి పనిలోనూ పోటీ లేకుండా పోతుండడంతో జీడబ్ల్యూఎంసీ నిధులు ఎక్కువగా ఖర్చవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మొత్తంలో ఇదే పరిస్థితి ఉండగా... వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరింత ఎక్కువగా ఉంది. గ్రేటర్ పరిధిలోని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్షేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాలకు భిన్నమైన పరిస్థితి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉంది. జీడబ్ల్యూఎంసీ పనులు చేసే కాంట్రాక్లర్లలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ప్రత్యేకంగా మరో సిండికేట్ ఉన్నట్లు ప్రభుత్వ నిఘా వర్గాల నివేదిక చెబుతోంది. చట్టసభకు ప్రాతినిథ్యం వహించే కీలక ప్రజాప్రతినిధి సహకారంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లు ఈ–ప్రొక్యూర్మెంట్ టెండరు స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో కాంట్రాక్టర్లు ఒక్కటై పనులు తీసుకుంటున్నారు. ఈ నాలుగు సెగ్మెంట్లలో ప్రతి పనిలో ఎనిమిది శాతం చొప్పున మొత్తాన్ని పక్కనపెడుతున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పనులకు మాత్రం లెక్క ఇంకా ఎక్కువగా ఉంది. ప్రతి పనిలోనూ 10 శాతం మొత్తాన్ని పక్కనపెడుతున్నారు. నాణ్యతకు తిలోదకాలు... జీడబ్ల్యూఎంసీ చేపట్టే అభివృద్ధి పనుల్లో ఎక్కువ శాతం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చితే జనాభా ఎక్కువగా ఉండడం.. మౌలిక వసతుల పరంగా వెనకబడి ఉండడంతో ఎక్కువ నిధులు ఈ సెగ్మెంట్లోనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనిని కొందరు కాంట్రాక్టర్లు అవకాశంగా తీసుకుంటున్నారు. పనుల్లో 10 శాతాన్ని పక్కనపెట్టేందుకు అంగీకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు 8 శాతం వరకు ముట్టజెప్పి మిగిలిన రెండు శాతాన్ని సంక్షేమ నిధికి మళ్లిస్తున్నారు. పది శాతం నిబంధన అమలు విషయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనీ కీలక ప్రజాప్రతినిధి తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు కొందరు కాంట్రాక్టర్లే చెబుతున్నారు. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చితే కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఎక్కువ శాతం నిధులను పక్కనబెట్టాల్సి రావడంతో పనుల్లో నాణ్యత తగ్గిపోతోందని చెబుతున్నారు. జీడబ్ల్యూఎంసీలో గతంలో ఎప్పుడూ ఇలా లేదని అంటున్నారు. జీడబ్ల్యూఎంసీ నిధులతో చేపట్టే పనుల్లో నాణ్యతాలోపాలపై దృష్టి సారించి చక్కదిద్దాల్సిన ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లకు శాతాలు నిర్ణయించడం కొత్తగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నిధులు ఫోన్ల పాలు
గ్రేటర్ కార్పొరేటర్లకు స్మార్ట్ మెుబైళ్లు ప్రజాధనాన్ని పంచిన జీడబ్ల్యూఎంసీ ఒక్కో సెల్ ఖరీదు రూ.11,200 60 ఫోన్లకు రూ.6.72 లక్షల ఖర్చు సాక్షి, హన్మకొండ : గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి కార్పొరేటర్లుగా విజయం సాధించిన వారు.. ఆ తర్వాత చేసిన ఓ పని తీవ్ర విమర్శలకు దారి తీసింది. కార్పొరేటర్లుగా గెలవడానికి లక్షలు ఖర్చు చేసిన ప్రజాప్రతినిధులు... వరంగల్ మహానగరపాలక సంస్థ నిధులు తమ సొంతమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమాలకు పాల్పడడం అలవాటైన అధికారులు కూడా.. కార్పొరేటర్లను ‘సంతృప్తి’ పరిచే పనుల్లో నిమగ్నమయ్యారు. ఏదో ఒక రూపంలో ఈ పనులు చేస్తూనే ఉన్నారు. ఇలా కార్పొరేటర్ల మెప్పు పొందేందుకు వరంగల్ మహానగరపాలక సంస్థ అధికారులు మరో పని చేశారు. గ్రేటర్ వరంగల్‌లో 58 డివిజన్లు ఉన్నాయి. కార్పొరేటర్లుగా గెలుపొందిన వారిలో కొందరు కోటీశ్వరులు, మరి కొందరు లక్షాధికారులు ఉన్నారు. అందరికీ ఖరీదైన సెల్ఫోన్లు ఉన్నాయి. కార్పొరేటర్లుగా గెలిచి.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్లకు సిమ్‌కార్డులు ఇచ్చింది. అందరు ఫోన్లు ఉన్నవారే కావడంతో ఈ సిమ్‌కార్డులు ఉపయోగపడతాయని సామాన్యులు భావించారు. అయితే గ్రేటర్ అధికారులు, కార్పొరేటర్లు మాత్రం మరోలా ఆలోచించారు. ప్రజాధనం ఎలా వాడుకోవాలనే పథకాన్ని రచించారు. సిమ్‌కార్డులు ఇచ్చిన అందరికీ మొబైల్ ఫోన్లు కావాలని నిర్ణయించారు. గ్రేటర్ వరంగల్ అంటే హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం. మొబైల్ ఫోన్లు కూడా అదే స్థాయిలో ఉండాలని అధికారులు ‘ఉన్నతంగా’ ఆలోచించారు. కార్పొరేటర్లకు, గ్రేటర్ కమిషనర్ క్యాంపు క్లర్క్‌కు, పర్యావరణ విభాగం ఇంజనీర్‌కు ఒకటి చొప్పున 60 సామ్సంగ్–జే5 మోడల్ సెల్ ఫోన్లు కొనుగోలు చేశారు. ఒక్కో ఫోన్‌కు రూ.11,200 చొప్పున రూ.6.72 లక్షలు ఖర్చు చేశారు. సీల్డు కవరు టెండరు ద్వారా... కార్పొరేటర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై విషయంలో అధికారులు తమకు నచ్చిన ప్రక్రియ అనుసరించారు. ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతి కాకుండా సీల్డ్ కవరు విధానంలో టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతి అయితే కార్పొరేషన్ ఖజనాపై భారం తగ్గేది. చీపుర్లు, స్టేషనరీ, రేడియం జాకెట్లు వంటి తక్కువ ఖర్చు అయ్యే వస్తువులకు ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో స్పందన లేదని పేర్కొంటున్న అధికారులు వాటికి సీల్డ్ కవరు టెండర్లు నిర్వహించారు. అయితే మార్కెట్లో డిమాండ్ ఉండే సామ్సంగ్ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలోనూ సీల్డ్ కవర్ టెండర్లనే అమలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. కార్పొరేటర్లకు ఫోన్లు ఇచ్చినప్పుడు తమకూ ఏదో ఉండాలన్న ఉద్దేశంతోనే అధికారులు ఇలా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
సి‘ఫార్స్’ నియామకం
ఎమ్మెల్యే బంధువు ‘పవర్’ నెలన్నర కిందట అధికారాలకు కోత రాజకీయ జోక్యంతో మళ్లీ అప్పగింత సాక్షి, హన్మకొండ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఉద్యోగుల పోస్టుంగ్‌లలోనే కాదు పనితీరు వ్యవహరంలోనూ రాజకీయ జోక్యం పెరిగింది. ఉద్యోగుల పనితీరుతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారికి మంచి పోస్టులు ఇవ్వాలని గ్రేటర్ అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెరిగింది. దీంతో పనితీరు బాగా లేని వారిని పక్కన పెట్టారు. ఇలా పనితీరు ప్రమాణికంగా పక్కన పెట్టిన ఓ ఉద్యోగి రాజకీయ బలంతో మళ్లీ కీలకమైన పోస్టులోకి వచ్చారు. దీంతో ఉన్నతాధికారుల నిర్ణయాలకు అర్థంలేకుండా పోయిందనే అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయ బలహీనులపైనే ఉన్నతాధికారులు అధికారం చెలాయిస్తారనే చర్చ జరుగుతోంది. కార్పొరేషన్లో రెవెన్యూ విభాగంలో టాక్స్ ఆఫీసర్, అడిషనల్ కమిషనర్ల పనితీరు బాగాలేదనే కారణంతో కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ వారి అధికారాల్లో కోత పెట్టారు. కొత్త ఇంటి నెంబర్లకు సంబంధించిన బాధ్యతల నుంచి పక్కకు తప్పించారు. దీంతో అడిషనల్ కమిషనర్ షాహిద్ మసూద్, టాక్స్ ఆఫీసర్‌గా శాంతికుమార్ విధుల్లో ఉన్నా ఫైళ్లను చూసే పవర్ లేకుండా పోయింది. అయితే, నెలన్నర గడిచే సరికి.. ఏ స్థానం నుంచి కదిలారో వారు అదే స్థానాలను తిరిగి దక్కించుకున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోకి కొద్ది ప్రాంతం వచ్చే ఓ ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా ఈ అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ టాక్స్ ఆఫీసర్ సదరు ఎమ్మెల్యే బంధువు కావడం గమనార్హం. అడిషనల్ కమిషనర్‌కు గ్రేటర్ వరంగల్ పాలకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి చొరవతో ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నlశాంతికుమార్ 2009లో ఖమ్మం జిల్లా పాల్వంచ మున్సిపాటీ కమిషనర్‌గా 2011 వరకు పనిచేశారు. ఈ సమయంలో రూ.1.70 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్లుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనికితోడు ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసు విషయంలోనే శాంతికుమార్‌ను పక్కకు పెట్టారనే ప్రచారం ఉంది. పనితీరు బాగాలేదని పక్కనబెట్టిన వారికి మళ్లీ అదే స్థాయిలో అధికారులు ఇవ్వడం కార్పొరేషన్లో చర్చనీయాంశంగా మారింది. సమాచార లోపం వల్లే : శాంతికుమార్, టాక్స్ ఆఫీసర్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో టాక్స్ ఆఫీసర్‌గా 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఐదు కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేయాల్సిందిగా నాకు లక్ష్యం నిర్ధేశించారు. నేను రూ. 3.15 కోట్లు పన్నులు వసూలు చేశాను. లక్ష్యం చేరలేదనే కారణంతో నన్ను తాత్కాలికంగా అధికారాల నుంచి పక్కన పెట్టారు. అయితే 42 విలీన గ్రామాల్లో నిర్ధేశించిన రూ. 4.18 కోట్ల లక్ష్యాన్ని దాటి రూ. 8.70 కోట్లు వసూలు చేశాను. ఈ విషయం ఉన్నతాధికారులకు వివరించడంతో తిరిగి అధికారాలు అప్పగించారు. ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యమూ లేదు. ఎందుకో తెలియదు : షాహిద్ మసూద్, అడిషనల్ కమిషనర్ నెలన్నర కిందట రెవెన్యూ విభాగంలోని ఇంటినంబర్ల కేటాయింపుపై అధికారాలను ఎందుకు కోత విధించారో నాకు తెలియదు. తాజాగా ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. నేను ఎటువంటి పైరవీ చేయలేదు. -
‘స్టాండింగ్’ ఏకగ్రీవమే !
ఆరు స్థానాలకు ఆరే నామినేషన్లు ఈ నెల 20న అధికారిక ప్రకటన పోటీకి కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం దూరం వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైనట్టే. ఈ విషయాన్ని ఈ నెల 20న అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఆరు స్థానాలకు గాను మంగళవారం గడువు ముగిసే సమయానికి ఆరు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. చివరి తేదీన ఉదయం నుంచి ఆయా పార్టీల కార్యాలయాల్లో నాయకులు మంతనాలు జరిపారు. టీఆర్ఎస్కు చెందిన కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హన్మకొండలోని హరిత హోటల్లో సమావేశమై చర్చించారు. సభ్యులుగా ఎవరు నామినేషన్ వేయాలనే విషయంపై మంతనాలు సాగించారు. నామినేషన్ల దాఖలుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తుది గడువు కాగా, మేయర్, డిప్యూటీ మేయర్, కొందరు కార్పొరేటర్లు 1.35 నిమిషాలకు బల్దియా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. నగర మేయర్ నన్నపనేని నరేందర్ అధ్వర్యంలో కార్పొరేటర్లు బల్దియా సెక్రటరీ నాగరాజ రావుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. మొదట 8వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా, 4వ డివిజన్ కార్పొరేటర్ బిల్ల కవిత బలపరిచారు. 27వ డివిజన్ కార్పొరేటర్ వద్దిరాజు గణేష్ నామినేషన్ దాఖలు చేయగా, 47వ డివిజన్ కార్పొరేటర్ నాల్లా స్వరూప రాణి రెడ్డి బలపరిచారు. 29వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవితను 15వ డివిజన్ కార్పొరేటర్ శారదా జోషి బలపరిచారు. 3వ డివిజన్ కార్పొరేటర్ లింగం మౌనిక నామినేషన్ వేయగా, 2వ డివిజన్ కార్పొరేటర్ ల్యాదల్ల బాలయ్య బలపరిచారు. 56వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్ నాగమళ్ల ఝాన్సీ స్టాండింగ్ కమిటీకి నామినేషన్ వేయగా, 38వ డివిజన్ కార్పొరేటర్ కేశిరెడ్డి మాధవి బలపరిచారు. 40వ డివిజన్ కార్పొరేటర్ మిరియాల్‌కార్ దేవేందర్ నామినేషన్ వేయగా, 51వ డివిజన్ కార్పొరేటర్ మిడిదొడ్డి స్వప్న బలపరిచారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం దూరం.. గ్రేటర్ పరిధిలోని 58 డివిజన్లు ఉండగా, అందులో 44 సీట్లను టీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలుచుకున్నారు. 8 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించగా, వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్‌కు నలుగురు, బీజేపీకి ఒకరు, సీపీఎంకు ఒకరు కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నామినేషన్లు ఉంటాయని వీరంతా భావించారు. కానీ ఆ పార్టీ నుంచి ఎవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో టీఆర్ఎస్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బరిలో ఉంచితే ఎన్నికకు తగిన బలం లేనందున ఆయా పార్టీలు దూరంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నేడు నామినేషన్ల పరిశీలన.. ఎన్నికలు లేకున్నా ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. కార్పొరేటర్లు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు బుధవారం పరిశీలిస్తారు. నామినేషన్లలో ఏమైనా పొరపాట్లు ఉంటే తిరస్కరించిన తర్వాత మిగిలిన జాబితా వెల్లడి వెల్లడిస్తారు. ఈనెల 20న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం అధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తారు. నగరాభివృద్ధికి ఐక్యంగా కృషి చేస్తాం.. మహా నగర అభివృద్ధిలో స్టాండింగ్ కమిటీ కీలకమైనదని గ్రేటర్ మేయర్ నన్నపనేని నరేందర్అన్నారు. మంగళవారం స్టాండింగ్ కమిటీ సభ్యుల నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి ఐక్యంగా కృషి చేస్తామని చెప్పారు. కమిటీ ఎన్నిక ఏకగ్రీవడం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్, కార్పొరేటర్లు బయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్‌గా వరంగల్!
హైదరాబాద్: వరంగల్ కార్పొరేషన్ హోదా పెరుగుతోంది. వరంగల్, కాజీపేట, హన్మకొండలను కలుపుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం తెలిపారు. చారిత్రక, పర్యాటక పరంగా వరంగల్‌కు ఉన్న ప్రత్యేకతను మరింతగా పెంచుతామని మంత్రి చెప్పారు. పారిశ్రామిక, విద్యారంగాల్లో వరంగల్‌ను రాజధానికి దీటుగా తీర్చిదిద్దుతామని, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హోదా పెంచనున్నట్లు మంత్రి తెలిపారు.