తూర్పులో ఎక్కువ!
Published Sat, Oct 29 2016 3:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM
టెండరు పనుల్లో 10 శాతం పక్కకు
కీలక ప్రజాప్రతినిధి అండదండలు
నాసిరకంగా సాగుతున్న పనులు
సాక్షి, వరంగల్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో అభివృద్ధి పనులకు నాణ్యత సమస్య పట్టుకుంది. కాంట్రాక్టర్లు ఒక్కటై ఈ–ప్రొక్యూర్‌మెంట్ టెండరు ప్రక్రియను అభాసుపాలు చేస్తున్నారు. ప్రతి పనిలోనూ పోటీ లేకుండా పోతుండడంతో జీడబ్ల్యూఎంసీ నిధులు ఎక్కువగా ఖర్చవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మొత్తంలో ఇదే పరిస్థితి ఉండగా... వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరింత ఎక్కువగా ఉంది. గ్రేటర్ పరిధిలోని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్షేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాలకు భిన్నమైన పరిస్థితి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉంది.
జీడబ్ల్యూఎంసీ పనులు చేసే కాంట్రాక్లర్లలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ప్రత్యేకంగా మరో సిండికేట్ ఉన్నట్లు ప్రభుత్వ నిఘా వర్గాల నివేదిక చెబుతోంది. చట్టసభకు ప్రాతినిథ్యం వహించే కీలక ప్రజాప్రతినిధి సహకారంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లు ఈ–ప్రొక్యూర్‌మెంట్ టెండరు స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో కాంట్రాక్టర్లు ఒక్కటై పనులు తీసుకుంటున్నారు. ఈ నాలుగు సెగ్మెంట్లలో ప్రతి పనిలో ఎనిమిది శాతం చొప్పున మొత్తాన్ని పక్కనపెడుతున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పనులకు మాత్రం లెక్క ఇంకా ఎక్కువగా ఉంది. ప్రతి పనిలోనూ 10 శాతం మొత్తాన్ని పక్కనపెడుతున్నారు.
నాణ్యతకు తిలోదకాలు...
జీడబ్ల్యూఎంసీ చేపట్టే అభివృద్ధి పనుల్లో ఎక్కువ శాతం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి. మిగిలిన
నియోజకవర్గాలతో పోల్చితే జనాభా ఎక్కువగా ఉండడం.. మౌలిక వసతుల పరంగా వెనకబడి ఉండడంతో ఎక్కువ నిధులు ఈ సెగ్మెంట్‌లోనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనిని కొందరు కాంట్రాక్టర్లు అవకాశంగా తీసుకుంటున్నారు. పనుల్లో 10 శాతాన్ని పక్కనపెట్టేందుకు అంగీకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు 8 శాతం వరకు ముట్టజెప్పి మిగిలిన రెండు శాతాన్ని సంక్షేమ నిధికి మళ్లిస్తున్నారు. పది శాతం నిబంధన అమలు విషయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనీ కీలక ప్రజాప్రతినిధి తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు కొందరు కాంట్రాక్టర్లే చెబుతున్నారు. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చితే కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఎక్కువ శాతం నిధులను పక్కనబెట్టాల్సి రావడంతో పనుల్లో నాణ్యత తగ్గిపోతోందని చెబుతున్నారు. జీడబ్ల్యూఎంసీలో గతంలో ఎప్పుడూ ఇలా లేదని అంటున్నారు. జీడబ్ల్యూఎంసీ నిధులతో చేపట్టే పనుల్లో నాణ్యతాలోపాలపై దృష్టి సారించి చక్కదిద్దాల్సిన ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లకు శాతాలు నిర్ణయించడం కొత్తగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Advertisement
Advertisement