నగర మేయర్ నరేందర్‌తో స్టాండింగ్ కమిటీకి నామినేషన్ వేసిన కార్పొరేటర్లు
-
ఆరు స్థానాలకు ఆరే నామినేషన్లు
-
ఈ నెల 20న అధికారిక ప్రకటన
-
పోటీకి కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం దూరం
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైనట్టే. ఈ విషయాన్ని ఈ నెల 20న అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఆరు స్థానాలకు గాను మంగళవారం గడువు ముగిసే సమయానికి ఆరు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. చివరి తేదీన ఉదయం నుంచి ఆయా పార్టీల కార్యాలయాల్లో నాయకులు మంతనాలు జరిపారు. టీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హన్మకొండలోని హరిత హోటల్‌లో సమావేశమై చర్చించారు. సభ్యులుగా ఎవరు నామినేషన్ వేయాలనే విషయంపై మంతనాలు సాగించారు.
నామినేషన్ల దాఖలుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తుది గడువు కాగా, మేయర్, డిప్యూటీ మేయర్, కొందరు కార్పొరేటర్లు 1.35 నిమిషాలకు బల్దియా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. నగర మేయర్ నన్నపనేని నరేందర్ అధ్వర్యంలో కార్పొరేటర్లు బల్దియా సెక్రటరీ నాగరాజ రావుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. మొదట 8వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా, 4వ డివిజన్ కార్పొరేటర్ బిల్ల కవిత బలపరిచారు.
27వ డివిజన్ కార్పొరేటర్ వద్దిరాజు గణేష్ నామినేషన్ దాఖలు చేయగా, 47వ డివిజన్ కార్పొరేటర్ నాల్లా స్వరూప రాణి రెడ్డి బలపరిచారు. 29వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవితను 15వ డివిజన్ కార్పొరేటర్ శారదా జోషి బలపరిచారు. 3వ డివిజన్ కార్పొరేటర్ లింగం మౌనిక నామినేషన్ వేయగా, 2వ డివిజన్ కార్పొరేటర్ ల్యాదల్ల బాలయ్య బలపరిచారు. 56వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్ నాగమళ్ల ఝాన్సీ స్టాండింగ్ కమిటీకి నామినేషన్ వేయగా, 38వ డివిజన్ కార్పొరేటర్ కేశిరెడ్డి మాధవి బలపరిచారు. 40వ డివిజన్ కార్పొరేటర్ మిరియాల్‌కార్ దేవేందర్ నామినేషన్ వేయగా, 51వ డివిజన్ కార్పొరేటర్ మిడిదొడ్డి స్వప్న బలపరిచారు.
కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం దూరం..
గ్రేటర్ పరిధిలోని 58 డివిజన్లు ఉండగా, అందులో 44 సీట్లను టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు గెలుచుకున్నారు. 8 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించగా, వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్‌కు నలుగురు, బీజేపీకి ఒకరు, సీపీఎంకు ఒకరు కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నామినేషన్లు ఉంటాయని వీరంతా భావించారు. కానీ ఆ పార్టీ నుంచి ఎవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో టీఆర్‌ఎస్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బరిలో ఉంచితే ఎన్నికకు తగిన బలం లేనందున ఆయా పార్టీలు దూరంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
నేడు నామినేషన్ల పరిశీలన..
ఎన్నికలు లేకున్నా ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. కార్పొరేటర్లు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు బుధవారం పరిశీలిస్తారు. నామినేషన్లలో ఏమైనా పొరపాట్లు ఉంటే తిరస్కరించిన తర్వాత మిగిలిన జాబితా వెల్లడి వెల్లడిస్తారు. ఈనెల 20న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం అధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తారు.
నగరాభివృద్ధికి ఐక్యంగా కృషి చేస్తాం..
మహా నగర అభివృద్ధిలో స్టాండింగ్ కమిటీ కీలకమైనదని గ్రేటర్ మేయర్ నన్నపనేని నరేందర్‌అన్నారు. మంగళవారం స్టాండింగ్ కమిటీ సభ్యుల నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి ఐక్యంగా కృషి చేస్తామని చెప్పారు. కమిటీ ఎన్నిక ఏకగ్రీవడం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్, కార్పొరేటర్లు బయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.