సర్వేయర్ పోస్టుల భర్తీకి పచ్చజెండా
♦ చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
♦ రాష్ట్రంలో ఖాళీగా 400 పోస్టులు
♦ త్వరలో తహసీల్దారు, వీఆర్‌వోల బదిలీలు
♦ సెక్రటేరియట్‌లో ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటుకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గత ఎనిమిదేళ్లుగా రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో సర్వే విభాగంలో సుమారు 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టుల భర్తీకి సంబంధించి విధివిధానాలను సిద్ధం చేయాలని రెవెన్యూ ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి మహ మూద్ అలీ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ విభాగంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా వినూత్న పద్ధతులను అవలంబించాలని సూచించారు. శాఖకు సంబంధించిన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు పాల్గొన్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివీ..
♦ ఎక్కువ కాలం ఒకేచోట పనిచేస్తున్న మండల తహసీల్దార్లు, గ్రామ రెవెన్యూ అధికారుల బదిలీలను వెంటనే చేపట్టాలి.
♦ రెవెన్యూ అంశాలు, కొత్త చట్టాలకు సంబంధించి తహసీల్దార్లు, ఆర్డీవోలకు తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్(టలిమ్)లో శిక్షణ ఇప్పించాలి.
♦ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా రెవెన్యూ శాఖలో వ్యవస్థాగతంగా అవసరమైన మార్పులను తీసుకురావాలి.
♦ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి మిగిలిన లబ్ధిదారులకు వెంటనే పట్టాలు అందజేయాలి.
♦ సచివాలయంలోని డిప్యూటీ సీఎం పేషీలో ప్రజా ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుల స్వీకరణకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించాలి.
♦ ప్రజల నుంచి విజ్ఞప్తులను నేరుగా లేదా పోస్టు ద్వారా కూడా స్వీకరించాలి.
♦ రెవెన్యూ డివిజనల్ అధికారుల పనితీరును జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలి. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునే విధంగా బాధ్యతలను అప్పగించాలి.
♦ నిర్దేశించిన జిల్లాల్లో భూభారతి కార్యక్రమాన్ని 15 రోజుల్లోగా పూర్తి చేయాలి. భూముల వివరాల నమోదు ప్రక్రియను ఐటీ నెట్‌వర్క్‌తో లింక్ చేయాలి.
♦ {పజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు త్వరలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం కావాలని డిప్యూటీ సీఎం నిర్ణయించారు.