IT network
-
కొత్త ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు.
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ ఆర్భాటంగా ప్రారంభించిన కొత్త ఐటీ ఫైలింగ్ పోర్టల్‌కు సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. లాగిన్ కావడానికి సుదీర్ఘ కాలం పట్టేస్తుండటంతో పాటు కొన్ని ఫీచర్లు ఇంకా అందుబాటులోకే రాలేదు. కొత్త పోర్టల్‌ను ప్రారంభించినప్పట్నుంచీ సాంకేతిక లోపాలు తలెత్తుతూనే ఉన్నాయని, ఇప్పటికీ వాటిని పూర్తిగా సరిచేయలేదని చార్టర్డ్ అకౌంటెంట్లు తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తాము గతంలో ఈ–ఫైలింగ్ చేసిన రిటర్నులను చూసుకోవడానికి కుదరడం లేదని, ఇంకా చాలామటుకు ఫీచర్లకు ’కమింగ్ సూన్ (త్వరలో అందుబాటులోకి వస్తాయి)’ అంటూ పోర్టల్ చూపిస్తోందని వారు పేర్కొన్నారు. లాగిన్ మొదలుకుని ఈ–ప్రొసీడింగ్స్ వంటి కీలకమైన ఫీచర్ల దాకా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొనాల్సి వస్తోందని నాంగియా అండ్ కో పార్ట్నర్ శైలేష్ కుమార్ చెప్పారు. దీంతో నిబంధనల ఉల్లంఘన నోటీసులు అందుకుంటున్న వారు వివరణ ఇచ్చేందుకు తగినంత వ్యవధి దొరక్క ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. ‘పన్ను చెల్లింపుదారులు తమ నియంత్రణలో లేని అంశాల కారణంగా పెనాల్టీ పరిణామాలను ఎదుర్కొనాల్సి వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఫారం 15సీఏ/సీబీ లేకపోవడం వల్ల విదేశాలకు నిధులు పంపించే వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు‘ అని కుమార్ తెలిపారు. మరోవైపు, ఇటు ట్యాక్స్‌పేయర్లు అటు ట్యాక్స్ నిపుణులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్న నేపథ్యంలో కొత్త పోర్టల్‌ను సత్వరం సరిచేయాల్సిన అవసరం ఉందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ పేర్కొన్నారు. కొత్త పోర్టల్‌పై అంతా భారీ అంచనాలు పెట్టుకోగా.. చాలా మందకొడిగా పనిచేస్తోందని, యూజ ర్లు చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆర్తి తెలిపారు. మ్యాన్యువల్‌గా రెమిటెన్స్ ఫారంల ఫైలింగ్.. పోర్టల్‌లో సాంకేతిక సమస్యల నేపథ్యంలో కొన్ని ఫారంలను మ్యాన్యువల్‌గా ఫైలింగ్ చేసేందుకు అనుమతించాలని ఐటీ విభాగం నిర్ణయించింది. విదేశీ రెమిటెన్సులకు అవసరమైన ఫారం 15సీఏ/సీబీని జూన్ 30 దాకా బ్యాంకులకు మాన్యువల్‌గా సమర్పించవచ్చని తెలిపింది. వీటిని తర్వాత ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారని ఐటీ విభాగం వివరించింది. -
‘వన్నాక్రై’ పై సెర్ట్–ఇన్ సూచనలు పాటించండి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఐటీ నెట్‌వర్క్‌లను అస్తవ్యస్తం చేస్తున్న రాన్సమ్వేర్ ’వన్నాక్రై’ దాడుల బారిన పడకుండా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) సూచనలు పాటించాలంటూ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. అలాగే తమ తమ సిస్టమ్స్‌పై వైరస్ దాడులు జరగకుండా ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్‌ను కూడా అప్డేట్ చేసి ఉంచాలని సూచించింది. రష్యా, బ్రిటన్ సహా 150 పైగా దేశాల్లోని ఐటీ నెట్‌వర్క్‌లను వన్నాక్రై దెబ్బతీసింది. మైక్రోసాఫ్ట్‌కి చెందిన ఎక్స్పీ వంటి పాత తరం ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేస్తున్న కంప్యూటర్లు దీని బారిన పడ్డాయి. దీంతో.. రాన్సమ్వేర్ దాడుల నుంచి నెట్‌వర్క్‌లను రక్షించుకునేందుకు దేశీయంగా సంస్థలు తీసుకోతగిన చర్యల జాబితాను సెర్ట్–ఇన్ రూపొందించిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్‌లో సీఎఫ్‌వో పోస్టు..: ఆర్బీఐ తొలిసారిగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో) పోస్టును ఏర్పాటు చేసింది. ఇందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈడీ హోదా ఉండే సీఎఫ్‌వో.. అకౌంటింగ్ విధానాల రూపకల్పన, ఆర్బీఐ ఆర్థిక సమాచారం తదితర బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. -
సర్వేయర్ పోస్టుల భర్తీకి పచ్చజెండా
♦ చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం ♦ రాష్ట్రంలో ఖాళీగా 400 పోస్టులు ♦ త్వరలో తహసీల్దారు, వీఆర్వోల బదిలీలు ♦ సెక్రటేరియట్లో ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గత ఎనిమిదేళ్లుగా రిక్రూట్మెంట్ లేకపోవడంతో సర్వే విభాగంలో సుమారు 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టుల భర్తీకి సంబంధించి విధివిధానాలను సిద్ధం చేయాలని రెవెన్యూ ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి మహ మూద్ అలీ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ విభాగంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా వినూత్న పద్ధతులను అవలంబించాలని సూచించారు. శాఖకు సంబంధించిన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివీ.. ♦ ఎక్కువ కాలం ఒకేచోట పనిచేస్తున్న మండల తహసీల్దార్లు, గ్రామ రెవెన్యూ అధికారుల బదిలీలను వెంటనే చేపట్టాలి. ♦ రెవెన్యూ అంశాలు, కొత్త చట్టాలకు సంబంధించి తహసీల్దార్లు, ఆర్డీవోలకు తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్(టలిమ్)లో శిక్షణ ఇప్పించాలి. ♦ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా రెవెన్యూ శాఖలో వ్యవస్థాగతంగా అవసరమైన మార్పులను తీసుకురావాలి. ♦ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి మిగిలిన లబ్ధిదారులకు వెంటనే పట్టాలు అందజేయాలి. ♦ సచివాలయంలోని డిప్యూటీ సీఎం పేషీలో ప్రజా ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుల స్వీకరణకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించాలి. ♦ ప్రజల నుంచి విజ్ఞప్తులను నేరుగా లేదా పోస్టు ద్వారా కూడా స్వీకరించాలి. ♦ రెవెన్యూ డివిజనల్ అధికారుల పనితీరును జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలి. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునే విధంగా బాధ్యతలను అప్పగించాలి. ♦ నిర్దేశించిన జిల్లాల్లో భూభారతి కార్యక్రమాన్ని 15 రోజుల్లోగా పూర్తి చేయాలి. భూముల వివరాల నమోదు ప్రక్రియను ఐటీ నెట్‌వర్క్‌తో లింక్ చేయాలి. ♦ {పజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు త్వరలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం కావాలని డిప్యూటీ సీఎం నిర్ణయించారు.