వచ్చే నెల్లో ఎర్రచందనం వేలం
-
రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
వెంకటగిరి :
అటవీశాఖ కార్యాలయాల్లో ఉన్న ఎర్రచందనం నిల్వలను సెప్టెంబర్‌లో వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. వెలిగొండల నుంచి ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు అటవీప్రాంతంలో కందకాలు తవ్వనున్నట్లు తెలిపారు. ఇక వనమహోత్సవాన్ని అన్ని శాఖల అధికారులు ఉద్యమంగా చేపట్టడంతో రాష్ట్రంలో 1.25 కోట్లు మొక్కలు నాటామని తెలిపారు. ఎస్‌ఎస్ కెనాల్ (స్వర్ణముఖి– సోమశిల) నిర్మాణ పనులను వేగవంతం చేశామన్నారు. కాలువ నిర్మాణంలో భూముల కోల్పోయిన వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమేనని, సాధించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని తెలిపారు. కేంద్రమంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులను బయటకు వచ్చేయాలని, బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్‌డీవీ ప్రసాద్‌నాయుడు, సీనియర్ టీడీపీ నాయకుడు చెలికంశంకరరెడ్డి పాల్గొన్నారు.