red sanders
-
రూట్ మారింది
వెలుగొండల నుంచి యథేచ్ఛగా ఎర్రచందనం రవాణా పట్టీపట్టనట్టుగా అధికారులు మర్రిపాడు : మండలంలోని విస్తారంగా ఉన్న వెలుగొండ అడవుల నుంచి ఎర్రచందనాన్ని తరలించేందుకు అనువుగా ఉండటంతో స్మగ్లర్లు యథేచ్ఛగా తరలిపోతుంది. అయితే అధికారులు మాత్రం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతం నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనాన్ని యథేచ్ఛగా దోచుకున్నారు. అటవీ శాఖఅధికారుల సహాయంతో ఎర్రచందనాన్ని కొల్లగొట్టారు. ప్రస్తుతం ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా పెరగడంతో కొంత మేర ఆగింది. అయితే ప్రస్తుతం మళ్లీ ఎర్రచందనం తరలింపు జోరుగానే సాగుతుంది. గతంలో ఈ ప్రాంతం నుంచి నెల్లూరు మీదుగా ఎర్రచందనాన్ని తరలించేవారు. అయితే జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద తనిఖీలతో బయట పడుతాయనే ఉద్దేశంతో ప్రస్తుతం నెల్లూరుపాళెం, సంగం మీద నుంచి రాపూరు మీదుగా తరలిస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని ఆత్మకూరు రేంజ్ పరిధిలో 45,216 హెక్టార్లలో వెలిగొండ అడవులు విస్తరించి ఉన్నాయి. మర్రిపాడు మండలంతో పాటు సీతారామపురం, ఉదయగిరి, అనంతసాగరం, వెంకటగిరి, రాపూరు, మండలాల్లో కూడా అధికంగా ఎర్రచందనం నిల్వలు ఉండటంతో వారి వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో స్మగ్లర్లకు వ్యాపారం అనువుగా మారింది. వైఎస్సార్, నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతం మర్రిపాడు కావడంతో అక్కడి నుంచి ఎర్రచందనాన్ని తీసుకుని మర్రిపాడు మండల అటవీ ప్రాంతంలో నిల్వ చేస్తున్నారు. అదను చూసుకుని ఇక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎర్రచందం తరలింపు సమయంలో మోటార్‌సైకిళ్లు, కార్లలో ముందు వైపు ఎస్కార్ట్‌గా తిరుగుతూ సమాచారం తెలుసుకుంటూ అనంతరమే ఎర్రచందనాన్ని తరలిస్తున్నారు. అయినా కానీ ఆ శాఖ అధికారులు మాత్రం కనీసం అటవీ ప్రాంతం వైపు కన్నెత్తి చూడకపోవడంతో వారికి ఇది వరంగా మారింది. గత నెల 21వ తేదీన మర్రిపాడు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం తరులుతుండడంతో మర్రిపాడు ఎస్సై వైవీ సోమయ్య ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహించి రూ.10 లక్షలు విలువ చేసే 53 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులే సమాచారం తెలుసుకుని దాడులు నిర్వహించి పట్టుకున్నా.. అటవీశాఖ అధికారులు మాత్రం ఎర్రచందనం తరలింపు కార్యక్రమాలు కానరాకపోవడం విశేషం. మండలంలోని ప్రధానంగా మర్రిపాడు, కదిరినాయుడుపల్లి, కృష్ణాపురం, బీట్ పరిసర ప్రాంతాల్లో వైఎస్సార్ జిల్లా నుంచి వచ్చిన ఎర్రచందనాన్ని నిల్వ ఉంచి తరలిస్తున్నట్లు సమాచారం. మరి ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటే ఎర్రచందనం అక్రమ తరలింపును అడ్డుకోవచ్చునని ఈ ప్రాంతవాసులు అంటున్నారు. కట్టుదిట్టంగా ఏర్పాట్లు : రామకొండారెడ్డి, రేంజ్ అధికారి, ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం తరలకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. అటవీ ప్రాంతమంతా గస్తీ నిర్వహిస్తున్నాం. చెట్లు కొట్టనివ్వకుండానే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. -
ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్ డక్కిలి : మండలంలోని నాగవోలు పంచాయతీ మహాసముద్రం చిన్నచెరువు తూము వద్ద అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన 33 ఎర్ర చందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ ఆధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ హరనాథ్‌బాబు కథనం మేరకు... మహాసముద్రం ప్రాంతంలో ఎర్ర చందనం దుంగలు దాచి ఉంచినట్లు అధికారులకు ముందుగా సమాచారం అందింది. దీంతో మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో డీఎస్పీ హరనాథ్‌బాబు తమ సిబ్బందితో గాలించగా చిన్న చెరువు తూములో 33 ఎర్రచందనం దుంగలు దాచి ఉంచడాన్ని గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. ఈ గాలింపుల్లో వెంకటగిరి సీఐ శ్రీనివాసరావు, ఎస్సై జిలాని, టాస్క్‌ఫోర్స్ ఎస్సై హజావలీ, ఎఫ్ఆర్ఓ వెంకటసుబ్బయ్య, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్ మహాసముద్రం చిన్నచెరువు వద్ద అక్రమంగా దాచి ఉంచిన 33 ఎర్రచందనం దుంగలకు సంబంధించిన స్మగ్లర్లు అయిన అదే గ్రామానికి చెందిన కృష్ణయ్య, వెంకటగిరికి చెందిన కోండయ్య, సుమంత్‌ను అరెస్ట్ చేశారు. వారిని అని కోణాల్లో విచారిస్తున్నారు. -
వచ్చే నెల్లో ఎర్రచందనం వేలం
రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెంకటగిరి : అటవీశాఖ కార్యాలయాల్లో ఉన్న ఎర్రచందనం నిల్వలను సెప్టెంబర్‌లో వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఆర్అండ్బీ అతిథిగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. వెలిగొండల నుంచి ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు అటవీప్రాంతంలో కందకాలు తవ్వనున్నట్లు తెలిపారు. ఇక వనమహోత్సవాన్ని అన్ని శాఖల అధికారులు ఉద్యమంగా చేపట్టడంతో రాష్ట్రంలో 1.25 కోట్లు మొక్కలు నాటామని తెలిపారు. ఎస్ఎస్ కెనాల్ (స్వర్ణముఖి– సోమశిల) నిర్మాణ పనులను వేగవంతం చేశామన్నారు. కాలువ నిర్మాణంలో భూముల కోల్పోయిన వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమేనని, సాధించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని తెలిపారు. కేంద్రమంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులను బయటకు వచ్చేయాలని, బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ డిమాండ్ చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్‌డీవీ ప్రసాద్‌నాయుడు, సీనియర్ టీడీపీ నాయకుడు చెలికంశంకరరెడ్డి పాల్గొన్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఒకరి అరెస్ట్ మర్రిపాడు : మండలంలోని ఎర్రకొండ అడవి నుంచి అక్రమంగా తరలిస్తున్న 53 ఎర్రచందనం దుంగలను, ఓ వ్యక్తిని పట్టుకున్నట్లు మర్రిపాడు ఎస్సై వైవీ సోమయ్య తెలిపారు. గురువారం ఆయన మర్రిపాడు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎర్రకొండ అడవుల్లో ఎర్రచందనం తరులుతుందనే సమాచారంతో గురువారం ఉదయం కూంబింగ్ చేపట్టామన్నారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోస్తూ తారసపడ్డారని వెంటనే వారిని వెంబండించగా ఓ వ్యక్తి పరరయ్యాడని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని ద్వారా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 53 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందన్నారు. పట్టుబడిన వ్యక్తి ఏఎస్‌పేటకు చెందిన చిలకపాటి వేణుగా గుర్తించామన్నారు. పరారైన వ్యక్తి మానం రామాంజనేయులుగా గుర్తించామని, అతని కోసం గాలింపు చేపడుతున్నామని తెలిపారు. -
అంతర్జాతీయ స్మగ్లర్ అజయ్‌పై పీడీ యాక్టు
చిత్తూరు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అజయ్ (47)పై పీడీ యాక్టు నమోదుచేయాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కేరళ రాష్ట్రం కాలికట్ జిల్లాలో ఏప్రిల్ 6న అజయ్‌ను చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. ఎర్రచందనాన్ని దేశవిదేశాలకు సుమారు 200 టన్నుల వరకు అజయ్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. ప్రస్తుతం కడప జైలులో ఉన్న అతనిపై పీడీ యాక్డు పెట్టాలన్న పోలీసులు ప్రతిపాదనకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే అజయ్‌పై 13 కేసులు నమోదై ఉన్నాయి. -
ఎర్రచందనం కూలీలు అరెస్ట్ : వాహనాలు సీజ్
నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఇద్దరు ఎర్రచందనం కూలీలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 26 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం కూలీలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్కౌంటర్ చేస్తామంటే.. లొంగిపోయారు!
రైల్వేకోడూరు రూరల్(వైఎస్సార్): టూరిస్ట్ బస్సులో వైఎస్సార్ జిల్లాలోకి వస్తున్న ఎర్రకూలీలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో 23 మంది తమిళ కూలీలు ఉన్నారని, మరో 25మంది వరకు పరారైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. బాలుపల్లె చెక్‌పోస్టు వద్ద శుక్రవారం అర్థరాత్రి సమయంలో సీఐ రసూల్సాహెబ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో తమిళనాడుకు చెందిన ఓ టూరిస్ట్ బస్సు వచ్చింది. తిరుపతి నుంచి కడప వెళుతోందని తెలుసుకున్న పోలీసులు అనుమానంతో ఆపారు. పోలీసులను చూడగానే కొందరు బస్‌లో నుంచి దూకి పారిపోయారు. పోలీసులు, చెక్‌పోస్టు వద్ద ఉన్న సిబ్బంది బస్ చుట్టూ కట్టెలు పట్టుకుని నిలబడ్డారు. ఎన్కౌంటర్ చేస్తామని సీఐ హెచ్చరించడంతో చివరకు 23 మంది తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు పట్టుబడ్డారు. వారిని బస్ సహా కోడూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. బస్‌పై ఉన్న ఒక పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట కేఎంఎం కళాశాల ప్రాంతంలో గురువారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 28 ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. అలాగే టవేరా వాహనంతోపాటు ఎర్రచందనం కూలీలకు చెందిన బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఎర్రచందనం కూలీల జాడ మాత్రం తెలియరాలేదు. తమను గమనించి కూలీలు పరారైనట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 50 లక్షలు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగుతుంది. -
ఐదుగురు తమిళ కూలీల అరెస్ట్
రైల్వేకోడూరు (వైఎస్సార్‌జిల్లా): జిల్లాలో అక్రమంగా ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా ఐదుగురు తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వేకోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వాహనంలో ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగి ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురు తమిళనాడుకు చెందిన కూలీలు కాగా... మరొకతను ఒంటిమిట్టకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. 628 కిలోల బురువున్న 24 ఎర్ర చందనం దుంగలతో పాటు వాహనాన్ని కూడా అదుపులోకి తీసుకొన్నట్లు సీఐ రసూల్ సాహెబ్ తెలిపారు.ఈ దుంగలు విలువ రూ.15 లక్షలు వరకూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ కూంబింగ్
-
శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ కూంబింగ్
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో బుధవారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. శ్రీవారి మెట్టు సమీపంలో ఎర్రగుట్ట వద్ద కూంబింగ్ నిర్వహించగా.. ఎర్రచందనం కూలీలు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో ఎర్రచందనం కూలీలు పరారీ అయినట్టు పోలీసులు వెల్లడించారు. ఘటన స్థలంలో 35 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. -
చిత్తూరులో 30 మంది తమిళ కూలీలు అరెస్ట్
చిత్తూరు : చిత్తూరు బైపాస్ రోడ్డులో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు నుంచి తిరుపతి వస్తున్న 30 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే వారికి చెందిన రెండు వాహనాలను సీజ్ చేశారు. లారీలలోని రూ. కోటి విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులకు అందజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాకెలాంటి సంబంధం లేదు: నటి నీతూ అగర్వాల్
కర్నూలు: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి నీతూ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ కేసులో అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమె గురువారం కర్నూలులో మీడియాతో మాట్లాడారు. మస్తాన్ వలీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాడోపేడో తేల్చుకుంటానని నీతూ అగర్వాల్ అన్నారు. మస్తాన్ వలీ ఓ రియాల్టర్, నిర్మాతగానే తనకు తెలుసునని ఆమె తెలిపారు. అంతకు మించి అతడి గురించి తనకేమీ తెలియదన్నారు. ఇద్దరం కలసి ప్రేమ ప్రయాణం చిత్రంలో కలిసి నటించామని... ఆ తర్వాత తమ మధ్య ప్రేమ చిగురించి వివాహం చేసుకున్నామని వెల్లడించారు. అయితే అతడి ఎక్కడి నుంచి వచ్చాడు... సినీ రంగానికి ఎలా వచ్చాడు... అనే అంశాలపై మస్తాన్ వలీని తాను ఏ రోజు ప్రశ్నించలేదన్నారు. ఏటీఎమ్ కార్డు కావాలని ఓ భర్తగా మస్తాన్ అడిగాడని.. భార్యగా తాను ఇచ్చానని ఆమె చెప్పారు. తన ఏటీఎం కార్డును మస్తాన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అనవసరంగా తనను ఈ కేసులో ఇరికించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఆరోపిస్తున్నట్లు తాను ఎవరిని మోసం చేయలేదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని... భవిష్యత్తులో తప్పకుండా సినిమా అవకాశాలు వస్తాయని నీతూ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
61 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్
నెల్లూరు : నెల్లూరు జిల్లా వెలిగొండ, మర్రిపాడు అటవీ ప్రాంతంలో పోలీసులు ఆదివారం కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 61 మంది ఎర్రచందనం కూలలీలను అదుపులోకి తీసుకున్నారు. వారిలో నలుగురు ప్రధాన ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పట్టుబడిన కూలీలు శేషాచలం అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో పరారైన వారిగా గుర్తించారు. సదరు కూలీలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారు సమాచారం మేరకు రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎర్రచందనం రవాణా కేసులో ఆర్టీసీ ఉద్యోగుల అరెస్టు
కడప: ఎర్రచందనం అక్రమరవాణా కేసులో తాజా మరో 30 మంది ఆర్టీసీ ఉద్యోగులను కడప పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు 9 మంది కూలీల సహా ఇద్దరు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు రోషన్, రామనాథ్ రెడ్డి అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. అక్రమరవాణాలో ఆర్టీసీ డ్రైవర్లు పాత్ర ప్రధానం కావడం సంచనం రేకిత్తిన విషయం తెలిసిందే. -
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం సమీపంలోని అటవీ ప్రాంతంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 43 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన దుంగలతోపాటు స్మగ్లర్లను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. స్మగ్లర్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నలుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రూ.కోటిన్నర విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు: జిల్లాలో మరోసారి భారీగా ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాదమర్రి మండలం కొటాలం వద్ద సోమవారం ఉదయం భారీగా ఎర్రచందనాన్నిఅక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రూ. కోటిన్నర విలువైన ఆరు టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గత మూడు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున ఎర్రచందనం పట్టుబడిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబు చందనం కథలకు వందనం....
ఎర్ర చందనం చెట్లను తాకట్టు పెట్టి మరీ పంట రుణాల మాఫీ చేయిస్తానంటున్నారు చంద్రబాబు. అడవిలో పెరుగుతున్న ఎర్ర చందనం చెట్లను తాకట్టు పెట్టొచ్చా? దీనికి బ్యాంకులు అంగీకరిస్తాయా? చెట్లను తాకట్టు పెట్టడానికి అటవీ శాఖ ఒప్పుకుంటుందా? కేంద్రం నుంచి అనుమతిని తీసుకుని మరీ ఈ పనిని చేస్తానంటున్నారు చంద్రబాబు. అసలు కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతినిస్తుందా? బ్యాంకులు ఒప్పుకోవుః ప్రభుత్వం గానీ, ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులు గానీ ఇలా చెట్లను తనఖా పెట్టి రుణం తీసుకోవటమన్నది ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఐనా వేల కోట్లు అప్పివ్వాలంటే బ్యాంకులన్నీ కన్సార్షియంగా ఏర్పడి నిర్ణయం తీసుకోవాలి. ఏ రుణమైనా దానికి తగ్గ విలువున్న ఆస్తిని తనఖా పెట్టుకుని ఇస్తారు. ఇవేమీ లేకుండా చెట్లను తనఖా పెట్టుకుని రుణాలివ్వటమనేది హాస్యాస్పదం. అటవీ శాఖ అంగీకరించదుః అడవులు జాతి సంపద. వాటిని బ్యాంకులు, ఆర్థికసంస్థల దగ్గర తాకట్టు పెట్టడానికి చట్టాలు అంగీకరించవు. అటవీ శాఖ వర్గాలు కూడా జాతి సంపదను తాకట్టు పెడతామని సీఎం చెప్పటం ఎప్పుడూ వినలేదు. కేంద్రం ఓకే చెప్పదు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పే అవకాశాలు లేవు. ఒక వేళ రుణ మాఫీ చేయించిన తరువాత ప్రభుత్వం బ్యాంకులకు డబ్బు చెల్లించలేకపోతే బ్యాంకులు చెట్లను కొట్టించి అమ్ముకుంటాయా? లేక కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతించే అవకాశాలు లేవు? కాబట్టి చంద్రబాబు చెబుతున్న చందనం కథలు మబ్బుల్లో నీళ్లు చూపి, ముంత లో నీరు ఒలకబోయించడం తప్ప మరేమీ కాదు. చందనం అమ్మకం కథలకు ఓ వందనం చెప్పి, రుణమాఫీ ఎలా చేయిస్తారో నిలదీయాల్సిన సమయం వచ్చింది. -
శేషాచలం అడవుల్లో వీరప్పన్ అనుచరులు!
హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికివేసి, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాల్లో చనిపోయిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ మాజీ అనుచరులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసు, అటవీశాఖల అధికారులు నిర్ధారించారు. పోలీసు, అటవీ శాఖల అధికారుల భయంతో ఈ చెట్లను నరికే పని చేయడానికి స్థానికులు వెనుకడుగు వేస్తుండటంతో స్మగ్లర్లు.. వీరప్పన్, అతడి ప్రధాన అనుచరుల వద్ద ఏళ్ల పాటు పని చేసిన తమిళనాడుకు చెందిన కూలీలకు అధిక మొత్తాల ఆశచూపి రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం ముఠాలు ఆకర్షిస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ప్రత్యేకంగా ఏర్పాటైన స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌నే ముప్పతిప్పలు పెట్టిన వీరప్పన్ కనుసన్నల్లో పని చేసి ఉండటంతో.. పోలీసులే ఎదురుపడి కాల్చి చంపుతామని బెదిరించినా వీళ్లు లొంగకుండా ఎదురు దాడికి దిగుతున్నారని.. రాళ్లు, మారణాయుధాల తో దాడికి పాల్పడుతున్నారని విశ్లేషిస్తున్నారు. అలాగే.. తెరవెనుక నుంచి ఈ కూలీల ముఠాలను నిర్వహిస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, మణిపూర్‌కు చెందిన స్మగ్లర్లూ ఉన్నట్లు పోలీసు, అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. -
‘ఎర్ర’ దొంగలకు ఉచ్చు
* ఎర్రచందనం స్మగ్లర్ల జాబితాను సిద్ధం చేసిన పోలీసులు * రెండు జిల్లాలలో 57మంది అరెస్టుకు రంగం సిద్ధం * పోలీసుల అదుపులో టీడీపీ నాయకులు * స్మగ్లర్ల ఆస్తుల జప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్న పోలీసులు, అటవీ అధికారులు సాక్షి, కడప: ఎర్రచందనం అక్రమ రవాణాపై ఖాకీలు కన్నెర్ర చేశారు. స్మగ్లింగ్ పాల్పడుతున్న వారి జాబితాను సిద్ధం చేసి అరెస్టు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రాయలసీమ జిల్లాల పోలీసులు మూకుమ్మడి వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేసిన పోలీసులు, జాబితాలోని 57మందిని అరెస్టు చేసేందుకు వలపన్నారు. స్మగ్లర్లందరినీ అరెస్టు చేసి, వారి ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందనం వనాలు రాయలసీమలో ఉన్నాయి. కొన్నేళ్లుగా ‘అడవి దొంగలు’ ఎర్రచందనం వృక్షాలను తెగనరికి విదేశాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం దీన్ని అడ్డుకోలేకపోతోంది. కొందరు ప్రజా ప్రతినిధులు, రాజకీయనాయకుల కనుసన్నల్లో వారి అనుచరుల ద్వారా ఈ అక్రమ రవాణా సాగుతోంది. దీనికి అటవీ, పోలీసు అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో భారీగా ఎర్రచందనం సరిహద్దులు దాటింది. ఈ రెండు నెలల్లో అధికారుల తనిఖీల్లో పట్టుబడిన దుంగల విలువే దాదాపు రూ. 78 కోట్లు ఉంటుంది. ఇక తరలిపోయిన దుంగల విలువ రూ. 500 కోట్ల పైనే ఉంటుందని నిఘా వర్గాలు అంచనా. ఈక్రమంలో ఎర్రచందనం అక్రమరవాణాపై గవర్నర్ నరసింహన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే అధికారులు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించారు. 57మంది స్మగ్లర్లు... ‘సీమ’లోని నాలుగు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా సాగేది చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలోనే అధికం. కర్నూలు, అనంతపురంతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా అప్పుడప్పుడు రవాణా సాగుతుంది. దీంతో చిత్తూరు, కడప పోలీసులు 57మంది స్మగ్లర్లతో ఓ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరితో వైఎస్సార్ జిల్లాకు సంబంధించి 26మంది, చిత్తూరు జిల్లాలో 31మంది ఉన్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. వీరిలో వైఎస్సార్ జిల్లాలో 21మంది, చిత్తూరు పరిధిలో ఆరుగురిపై పీడీ యాక్టు నమోదైంది. తిరుపతి పరిధిలో కూడా దాదాపు పదిమందికి పైగానే పీడీ యాక్టు నమోదైనట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు పేరుమోసిన స్మగ్లర్ల పేర్లను జాబితాలో చేర్చారు. ఈ జాబితాను స్మగ్లింగ్ కార్యకలాపాలు ముమ్మరంగా ఉన్న ప్రాంతాల్లోని సీఐలతో పాటు రాయలసీమలోని డీఎస్పీలకు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలోని వారు ఏ జిల్లా పరిధిలో దొరికితే అక్కడే అరెస్టు చేస్తున్నారు. పోలీసుల అదుపులో టీడీపీ నాయకులు ఈ ఆపరేషన్‌లో వైఎస్సార్ జిల్లాకు చెందిన స్మగ్లర్లు రెడ్డినారాయణ, మహేశ్ నాయుడులను కర్నూలు పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీ తరఫున చురుగ్గా పనిచేస్తున్నారు. రెడ్డినారాయణ స్వగ్రామం సంబేపల్లి మండలం గుట్టపల్లి. మహేశ్ నాయుడుది సుండుపల్లి మండలం చప్పిడివాండ్లపల్లి. మహేశ్ నాయుడు తల్లి శ్రీదేవి చప్పిడివాండ్లపల్లి ఎంపీటీసీగా టీడీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ సుండుపల్లెలోనూ ఉంటూ అక్రమ రవాణా సాగిస్తున్నారు. వీరితో పాటు వైఎస్సార్‌జిల్లా రైల్వేకోడూరుకు చెందిన కొందరి స్మగ్లర్లను కూడా కడప పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆస్తుల జప్తుకు సిఫార్సు పోలీసులు అదుపులోకి తీసుకున్న దొంగలను పూర్తిస్థాయిలో విచారించి, వారికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు. సుదీర్ఘంగా జైలు శిక్ష పడేలా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. రెండు జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకూ 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇదే విషయమై తిరుపతి టాస్క్ఫోర్సు పోలీసులను ‘సాక్షి’ సంప్రదిస్తే జాబితాను సిద్ధం చేశామని, కొందరిని అరెస్టు చేశామని చెప్పారు. ఆస్తుల జప్తునకు ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు చెప్పారు. జాబితాను పంపాం... కొందరిని అరెస్టు చేశాం జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ, వైఎస్సార్‌జిల్లా ఎర్రచందనం స్మగ్లర్లకు సంబంధించి ఓ జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపాం. రైల్వేకోడూరుకు సంబంధించిన కొంతమందిని అరెస్టు చేశాం. వారిని విచారిస్తున్నాం. వీలైనంత త్వరలో జాబితాలోని దొంగలందరినీ అరెస్టు చేసి విచారిస్తాం. -
అటవీ సిబ్బందికి సాయుధ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో అటవీ శాఖ అధికారులపై ఎర్రచందనం స్మగ్లర్లు ఇటీవల జరిపిన దాడుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. స్మగ్లర్లు సహా ఇతర అరాచక శక్తులను సమర్థంగా తిప్పికొట్టేలా అటవీ సిబ్బందికి పోలీసు శిక్షణ సంస్థల్లో సాయుధ శిక్షణ ఇవ్వనుంది. తొలుత ఎర్రచందనం వృక్షాలు ఎక్కువగా ఉన్న శేషాచలం అడవుల్లో విధులు నిర్వర్తించే చిత్తూరు, వైఎస్సార్ జిల్లాకు చెందిన 280 మంది అధికారులకు ఇటీవలే శిక్షణ ప్రారంభించారు. శిక్షణలో భాగంగా వీరికి 303 రైఫిల్ వినియోగంలో మెళకువలు నేర్పిస్తారు. 15 రోజుల శిక్షణ అనంతరం వారికి ఆయుధాలు అందిస్తారు. స్మగ్లర్ల వేటకు వెళ్లే అటవీ సిబ్బందికి భద్రతగా ఏపీఎస్పీ బలగాలను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బందికి ఇచ్చేందుకు అటవీ శాఖ ఇప్పటికే 303 రైఫిళ్లు సహా సింగిల్‌బోర్ బ్రీచ్లోడింగ్ తుపాకులను కొనుగోలు చేసింది. -
‘ఎర్ర’ స్మగ్లర్ల వేటకు ఏపీఎస్పీ బలగాలు
అటవీ సిబ్బందికి అండగా పంపాలని పోలీసుశాఖ నిర్ణయం అటవీ సిబ్బందికి పోలీసు సంస్థల్లో సాయుధ శిక్షణ పోలీసు, అటవీశాఖ సమావేశంలో కీలక నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్ల వేటకు రాష్ట్ర ప్రత్యేక పోలీస్(ఏపీఎస్పీ) బలగాలను రంగంలోకి దించనున్నారు. నల్లమలతోపాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించడంలో శిక్షణ పొందిన ఏపీఎస్పీ సాయుధ బలగాలను వినియోగించడం ద్వారా ఎర్రచందనం స్మగ్లర్ల దూకుడుకు కళ్లెం వేయాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయి అటవీ సిబ్బందిపై గొడ్డళ్లతో దాడిచేసి హతమార్చడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అనంతరం సర్కారు ఆదేశాల మేరకు డీజీపీ ప్రసాదరావు అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీఎస్పీకి చెందిన ఏడు ప్లటూన్లను అటవీ సిబ్బందికి సహాయంగా కూంబింగ్‌కు పంపాలని నిర్ణయించారు. ఎర్రచందనం స్మగ్లర్ల వేటకు వెళ్లే అటవీ సిబ్బందికి ఆయుధాలు అందించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అటవీ సిబ్బందికి ఆయుధాలు మాత్రమే ఇస్తే సరిపోదని, స్మగ్లర్ల దాడులను ఎదుర్కొనే సామర్థ్యం కూడా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పోలీసుశాఖ, అటవీశాఖ ఉన్నతాధికారులు సమావేశమై ఉమ్మడి వ్యూహరచన చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ల వేటకు వెళ్లే అటవీ సిబ్బందికి భద్రతగా ఏపీఎస్పీ సాయుధ బలగాలను పంపేందుకు పోలీసుశాఖ అంగీకరించింది. దాడులకు దిగే స్మగ్లర్లను మట్టుపెట్టే బాధ్యతను కూడా ఏపీఎస్పీ బలగాలే తీసుకుంటాయి. ఒకవైపు స్మగ్లర్ల వేట కొనసాగుతుండగానే అటవీ సిబ్బందికి సాయుధ శిక్షణ అందించేందుకు కూడా పోలీసుశాఖ అంగీకరించింది. వివిధ జిల్లాల్లో ఉన్న పీటీసీ, డీటీసీలలో అటవీ సిబ్బందికి కూడా పోలీసులతో కలిపి సాయుధ శిక్షణ అందించనున్నారు. బలగాల మధ్య సమన్వయం ముఖ్యం ఎర్రచందనం స్మగ్లర్ల వేటకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినప్పటికీ అంతగా ఫలితాలను సాధించింది లేదు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్, అటవీ సిబ్బందికి మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. దీంతో స్మగ్లర్ల ఆట కట్టించేందుకు పోలీసు, అటవీ బలగాలు సమన్వయంతో పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. దీంతోపాటు కేసుల దర్యాప్తు అంశంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. స్మగ్లర్ల దాడుల వంటి సమయంలో పోలీసులు కేసులు నమోదుచేసినప్పటికీ, వాటిని అటవీశాఖకు బదిలీ చేస్తున్నారు. కేసుల దర్యాప్తులో జాప్యం తదితర కారణాల వల్ల కేసులు వీగిపోతున్నాయనే వాదన ఉంది. దీంతో దర్యాప్తు అధికారులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. మరోవైపు స్మగ్లర్లకు శిక్షాకాలం పెంపుదలపై ప్రభుత్వానికి అటవీశాఖ ప్రతిపాదనలను పంపించనుంది. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్పైనా ఆరా: ఎర్రచందనాన్ని భారీస్థాయిలో దేశ సరిహద్దులను దాటించడంలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పాత్ర ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో దావూద్ గ్యాంగ్ పాత్రపై కూడా నిఘావర్గాలు ఆరా తీస్తున్నాయి. దావూద్ గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు ఇప్పటివరకూ ఆధారాలు లభించలేదని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్కే కౌముది వెల్లడించారు.