రూట్ మారింది
-
వెలుగొండల నుంచి యథేచ్ఛగా ఎర్రచందనం రవాణా
-
పట్టీపట్టనట్టుగా అధికారులు
మర్రిపాడు : మండలంలోని విస్తారంగా ఉన్న వెలుగొండ అడవుల నుంచి ఎర్రచందనాన్ని తరలించేందుకు అనువుగా ఉండటంతో స్మగ్లర్లు యథేచ్ఛగా తరలిపోతుంది. అయితే అధికారులు మాత్రం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతం నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనాన్ని యథేచ్ఛగా దోచుకున్నారు. అటవీ శాఖఅధికారుల సహాయంతో ఎర్రచందనాన్ని కొల్లగొట్టారు. ప్రస్తుతం ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా పెరగడంతో కొంత మేర ఆగింది. అయితే ప్రస్తుతం మళ్లీ ఎర్రచందనం తరలింపు జోరుగానే సాగుతుంది.
గతంలో ఈ ప్రాంతం నుంచి నెల్లూరు మీదుగా ఎర్రచందనాన్ని తరలించేవారు. అయితే జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద తనిఖీలతో బయట పడుతాయనే ఉద్దేశంతో ప్రస్తుతం నెల్లూరుపాళెం, సంగం మీద నుంచి రాపూరు మీదుగా తరలిస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని ఆత్మకూరు రేంజ్ పరిధిలో 45,216 హెక్టార్లలో వెలిగొండ అడవులు విస్తరించి ఉన్నాయి. మర్రిపాడు మండలంతో పాటు సీతారామపురం, ఉదయగిరి, అనంతసాగరం, వెంకటగిరి, రాపూరు, మండలాల్లో కూడా అధికంగా ఎర్రచందనం నిల్వలు ఉండటంతో వారి వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో స్మగ్లర్లకు వ్యాపారం అనువుగా మారింది.
వైఎస్సార్, నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతం మర్రిపాడు కావడంతో అక్కడి నుంచి ఎర్రచందనాన్ని తీసుకుని మర్రిపాడు మండల అటవీ ప్రాంతంలో నిల్వ చేస్తున్నారు. అదను చూసుకుని ఇక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎర్రచందం తరలింపు సమయంలో మోటార్‌సైకిళ్లు, కార్లలో ముందు వైపు ఎస్కార్ట్‌గా తిరుగుతూ సమాచారం తెలుసుకుంటూ అనంతరమే ఎర్రచందనాన్ని తరలిస్తున్నారు. అయినా కానీ ఆ శాఖ అధికారులు మాత్రం కనీసం అటవీ ప్రాంతం వైపు కన్నెత్తి చూడకపోవడంతో వారికి ఇది వరంగా మారింది.
గత నెల 21వ తేదీన మర్రిపాడు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం తరులుతుండడంతో మర్రిపాడు ఎస్సై వైవీ సోమయ్య ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహించి రూ.10 లక్షలు విలువ చేసే 53 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులే సమాచారం తెలుసుకుని దాడులు నిర్వహించి పట్టుకున్నా.. అటవీశాఖ అధికారులు మాత్రం ఎర్రచందనం తరలింపు కార్యక్రమాలు కానరాకపోవడం విశేషం. మండలంలోని ప్రధానంగా మర్రిపాడు, కదిరినాయుడుపల్లి, కృష్ణాపురం, బీట్ పరిసర ప్రాంతాల్లో వైఎస్సార్ జిల్లా నుంచి వచ్చిన ఎర్రచందనాన్ని నిల్వ ఉంచి తరలిస్తున్నట్లు సమాచారం. మరి ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటే ఎర్రచందనం అక్రమ తరలింపును అడ్డుకోవచ్చునని ఈ ప్రాంతవాసులు అంటున్నారు.
కట్టుదిట్టంగా ఏర్పాట్లు : రామకొండారెడ్డి, రేంజ్ అధికారి, ఆత్మకూరు
అటవీ ప్రాంతంలో ఎర్రచందనం తరలకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. అటవీ ప్రాంతమంతా గస్తీ నిర్వహిస్తున్నాం. చెట్లు కొట్టనివ్వకుండానే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.