‘ఎర్ర’ దొంగలకు ఉచ్చు | red sanders reddy narayana, mahesh naidu held | Sakshi
Sakshi News home page

‘ఎర్ర’ దొంగలకు ఉచ్చు

Published Tue, May 27 2014 2:46 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

2012 లో  కడపలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, ఎర్ర చందనం స్మగ్లర్ మహేశ్‌నాయుడు (సర్కిల్ ఉన్న వ్యక్తి) - Sakshi

2012 లో కడపలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, ఎర్ర చందనం స్మగ్లర్ మహేశ్‌నాయుడు (సర్కిల్ ఉన్న వ్యక్తి)

* ఎర్రచందనం స్మగ్లర్ల జాబితాను సిద్ధం చేసిన పోలీసులు
* రెండు జిల్లాలలో 57మంది అరెస్టుకు రంగం సిద్ధం
* పోలీసుల అదుపులో టీడీపీ నాయకులు
* స్మగ్లర్ల ఆస్తుల జప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్న పోలీసులు, అటవీ అధికారులు
 
సాక్షి, కడప: ఎర్రచందనం అక్రమ రవాణాపై ఖాకీలు కన్నెర్ర చేశారు. స్మగ్లింగ్ పాల్పడుతున్న వారి జాబితాను సిద్ధం చేసి అరెస్టు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రాయలసీమ జిల్లాల  పోలీసులు మూకుమ్మడి వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేసిన పోలీసులు, జాబితాలోని 57మందిని అరెస్టు చేసేందుకు వలపన్నారు.  స్మగ్లర్లందరినీ అరెస్టు చేసి, వారి ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది.

ప్రపంచంలో ఎక్కడా లేని అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందనం వనాలు రాయలసీమలో ఉన్నాయి. కొన్నేళ్లుగా ‘అడవి దొంగలు’ ఎర్రచందనం వృక్షాలను తెగనరికి విదేశాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం దీన్ని అడ్డుకోలేకపోతోంది. కొందరు ప్రజా ప్రతినిధులు, రాజకీయనాయకుల కనుసన్నల్లో వారి అనుచరుల ద్వారా ఈ అక్రమ రవాణా సాగుతోంది. దీనికి అటవీ, పోలీసు అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు.

ఎన్నికల నేపథ్యంలో భారీగా ఎర్రచందనం సరిహద్దులు దాటింది. ఈ రెండు నెలల్లో అధికారుల తనిఖీల్లో పట్టుబడిన దుంగల విలువే దాదాపు రూ. 78 కోట్లు ఉంటుంది. ఇక తరలిపోయిన దుంగల విలువ రూ. 500 కోట్ల పైనే ఉంటుందని నిఘా వర్గాలు అంచనా. ఈక్రమంలో ఎర్రచందనం అక్రమరవాణాపై గవర్నర్ నరసింహన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే అధికారులు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించారు.
 
57మంది స్మగ్లర్లు...
‘సీమ’లోని నాలుగు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా సాగేది చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలోనే అధికం. కర్నూలు, అనంతపురంతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా అప్పుడప్పుడు రవాణా సాగుతుంది. దీంతో చిత్తూరు, కడప పోలీసులు 57మంది స్మగ్లర్లతో ఓ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరితో వైఎస్సార్ జిల్లాకు సంబంధించి 26మంది, చిత్తూరు జిల్లాలో 31మంది ఉన్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి.

వీరిలో వైఎస్సార్ జిల్లాలో 21మంది, చిత్తూరు పరిధిలో ఆరుగురిపై పీడీ యాక్టు నమోదైంది. తిరుపతి పరిధిలో కూడా దాదాపు పదిమందికి పైగానే పీడీ యాక్టు నమోదైనట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు పేరుమోసిన స్మగ్లర్ల పేర్లను జాబితాలో చేర్చారు. ఈ జాబితాను స్మగ్లింగ్ కార్యకలాపాలు ముమ్మరంగా ఉన్న ప్రాంతాల్లోని సీఐలతో పాటు రాయలసీమలోని డీఎస్పీలకు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలోని వారు  ఏ జిల్లా పరిధిలో దొరికితే అక్కడే అరెస్టు చేస్తున్నారు.

పోలీసుల అదుపులో టీడీపీ నాయకులు
ఈ ఆపరేషన్‌లో వైఎస్సార్ జిల్లాకు చెందిన స్మగ్లర్లు  రెడ్డినారాయణ, మహేశ్ నాయుడులను కర్నూలు పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీ తరఫున చురుగ్గా పనిచేస్తున్నారు. రెడ్డినారాయణ స్వగ్రామం సంబేపల్లి మండలం గుట్టపల్లి. మహేశ్ నాయుడుది సుండుపల్లి మండలం చప్పిడివాండ్లపల్లి. మహేశ్ నాయుడు తల్లి శ్రీదేవి చప్పిడివాండ్లపల్లి ఎంపీటీసీగా టీడీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ సుండుపల్లెలోనూ ఉంటూ అక్రమ రవాణా సాగిస్తున్నారు. వీరితో పాటు వైఎస్సార్‌జిల్లా రైల్వేకోడూరుకు చెందిన కొందరి స్మగ్లర్లను కూడా కడప పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
 
ఆస్తుల జప్తుకు సిఫార్సు
పోలీసులు అదుపులోకి తీసుకున్న దొంగలను పూర్తిస్థాయిలో విచారించి, వారికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు. సుదీర్ఘంగా జైలు శిక్ష పడేలా పలు సెక్షన్ల కింద  కేసులు నమోదు చేస్తున్నారు. రెండు జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకూ 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇదే విషయమై తిరుపతి టాస్క్‌ఫోర్సు పోలీసులను ‘సాక్షి’ సంప్రదిస్తే జాబితాను సిద్ధం చేశామని, కొందరిని అరెస్టు చేశామని చెప్పారు. ఆస్తుల జప్తునకు ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు చెప్పారు.
 
 జాబితాను పంపాం... కొందరిని అరెస్టు చేశాం
 జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ, వైఎస్సార్‌జిల్లా
 ఎర్రచందనం స్మగ్లర్లకు సంబంధించి ఓ జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపాం. రైల్వేకోడూరుకు సంబంధించిన కొంతమందిని అరెస్టు చేశాం. వారిని విచారిస్తున్నాం. వీలైనంత త్వరలో జాబితాలోని దొంగలందరినీ అరెస్టు చేసి విచారిస్తాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement