ఉపఎన్నికల సమయంలో చంద్రబాబుతో చర్చిస్తున్న స్మగ్లర్ మహేష్ నాయుడు
పీడీ యాక్టు నిందితుడికి జెడ్పీటీసీ టికెట్
ఎంపీపీ బరిలో నిలిచిన మరో బడా స్మగ్లర్ కుటుంబం
ఎన్నికల్లో టీడీపీలో క్రియాశీల పాత్ర పోషించిన మరికొందరు నేరచరితులు
తాజాగా టీడీపీ నేత బుల్లెట్ సురేష్ అరెస్ట్
రాజమండ్రి జైలులో రెడ్డినారాయణ, మహేష్‌నాయుడు
సాక్షి ప్రతినిధి, కడప/చిత్తూరు
నూతన ఆంధ్రప్రదేశ్‌లో నేరగాళ్లకు స్థానంలేకుండా చేస్తామంటూ హూంకరిస్తున్న ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చేతల్లో వారితోనే అంటకాగుతున్నారని తెలుస్తోంది. శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనాన్ని దోచుకుంటున్న స్మగ్లర్లకు పార్టీ టికెట్లిచ్చి పోటీ చేయించడమే ఇందుకు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రెడ్డినారాయణ, మహేష్‌నాయుడు రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లర్లుగా పేరుమోశారు. వారిపై వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో అనేక స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా యంత్రాంగం 2010లో పీడీయాక్టు కూడా ప్రయోగించింది. అనంతరం కూడా వారు స్మగ్లింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తూనే వచ్చారు. వారే 2012లో రాయచోటి, రాజంపేట ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన మరో ఎర్రచందనం స్మగ్లర్ బుల్లెట్ సురేష్‌పై 20 కేసులు ఉన్నాయి. పది రోజుల కిందట సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసినట్లు చూపించారు. ఆయన 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ విజయానికి తీవ్రంగా కృషి చేయడం గమనార్హం.
వెన్నుతట్టి ఎన్నికల్లో ప్రోత్సాహం
ఎర్రచందనం స్మగ్లర్లుగా గుర్తింపుబడ్డా, పీడీ యాక్టులో జైలు కెళ్లినా పర్వాలేదు... ఎన్నికల్లో పోటీ చేసి గెలవండంటూ వైఎస్సార్ జిల్లా సంబేపల్లె జెడ్పీటీసీ స్థానాన్ని రెడ్డినారాయణకు టీడీపీ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ఆయన పోటీచేసి ఓడిపోయారు. మహేష్‌నాయుడి కుటుంబానికి సుండుపల్లె ఎంపీపీ పదవి కేటాయిస్తూ, ఆయన తల్లికి రెడ్డివారిపల్లె ఎంపీటీసీ టికెట్ అప్పగించారు. ఆమె గెలిచినప్పటికీ ఎంపీపీ పదవి మాత్రం దక్కలేదు. రెడ్డినారాయణ, మహేష్‌నాయుడు ఇరువురూ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న ఎర్రచందనం కేసుల కారణంగా పీడీయాక్టులో రాజమండ్రి జైల్లో ఉన్నారు. వీరికే కాకుండా సుండుపల్లెలో మరో ఎర్రచందనం స్మగ్లర్ పటాల రమణ సోదరుడు వీరమల్లనాయుడుకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చారు. పటాల రమణపై పలు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె టీడీపీ ఎంపీటీసీగా గెలుపొందిన సుబ్బానాయుడుపై సైతం కేసులున్నాయి. మైదుకూరు మండలంలో బడా స్మగ్లర్ శ్రీని వాసులనాయుడు సైతం టీడీపీలో క్రియాశీల భూమిక పోషించేవారు. ప్రస్తుతం పీడీ యాక్టులో రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయన సోదరుడు వెంకటసుబ్బయ్య స్మగ్లర్‌గా రికార్డులకు ఎక్కారు. టీడీపీ మైదుకూరు ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ ముఖ్య అనుచరుడు చినమల నరసింహులు యాదవ్ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుకైన పాత్ర పోషించారు.
ఎర్రదొంగల్లో తెలుగు తమ్ముళ్లే అధికం
అధికార పార్టీ నేతల అండదండలతో ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మొత్తం 198మంది ఎర్రదొంగలున్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటివరకూ 110మందికిపైగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది టీడీపీ నేతలే ఉండటం గమనార్హం. అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న వారిలో చిత్తూరు జిల్లా టీడీపీ ప్రచార కార్యదర్శి వసంత్, మధుతో పాటు మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారు. వీరిలో కొందరిపై ఇదివరకే పీడీ యాక్టు నమోదు చేశారు. ఇప్పుడు వారిపై పీడీ యాక్టు తొలగించడంతో పాటు, మిగిలిన దొంగలపై పీడీ యాక్టు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎర్రదొంగల అక్రమ సంపాదనలో వాటాలు ఉండటంతో వారిని రక్షించడం టీడీపీ కీలక నేతలకు అనివార్యంగా మారిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇతని పేరు బుల్లెట్ సురేష్. చిత్తూరు టీడీపీ నేత. ‘ఎర్ర’చందనం స్మగ్లింగ్‌లో ఆరితేరిన వ్యక్తి. 20 కేసులు ఉన్నాయి. చిత్తూరు టూటూన్ పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్ కూడా ఉంది. 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. చిత్తూరు తాలూకా, టూటౌన్, భాకరాపేట, యాదమరి, చిత్తూరుతో పాటు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ఇతడు రెడ్డి నారాయణ. వైఎస్సార్ జిల్లా సంబేపల్లె మండలం గుట్టపల్లె వాసి. ఇతడు కూడా రాయచోటి నియోజకవర్గం టీడీపీలో కీలక నేత. ఆ పార్టీ కీలక నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇతనిపై పీడీ యాక్టు కూడా నమోదైంది. రాయచోటి, పీలేరు, గంగవరం, కేవీపల్లె, వీరబల్లితో పాటు పలు స్టేషన్లలో పలు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి.
ఇతని పేరు మహేష్ నాయుడు. వైఎస్సార్ జిల్లా సుండుపల్లె మండలం చప్పిడివాండ్లపల్లె. మహేష్ తల్లి శ్రీదేవి టీడీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహేష్‌పై రెండుసార్లు పీడీ యాక్టు నమోదైంది. కేవీపల్లె, పీలేరు, కలకడతో పాటు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత.