అటవీ సిబ్బందికి అండగా పంపాలని పోలీసుశాఖ నిర్ణయం
అటవీ సిబ్బందికి పోలీసు సంస్థల్లో సాయుధ శిక్షణ
పోలీసు, అటవీశాఖ సమావేశంలో కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్ల వేటకు రాష్ట్ర ప్రత్యేక పోలీస్(ఏపీఎస్పీ) బలగాలను రంగంలోకి దించనున్నారు. నల్లమలతోపాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించడంలో శిక్షణ పొందిన ఏపీఎస్పీ సాయుధ బలగాలను వినియోగించడం ద్వారా ఎర్రచందనం స్మగ్లర్ల దూకుడుకు కళ్లెం వేయాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయి అటవీ సిబ్బందిపై గొడ్డళ్లతో దాడిచేసి హతమార్చడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అనంతరం సర్కారు ఆదేశాల మేరకు డీజీపీ ప్రసాదరావు అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీఎస్పీకి చెందిన ఏడు ప్లటూన్లను అటవీ సిబ్బందికి సహాయంగా కూంబింగ్‌కు పంపాలని నిర్ణయించారు. ఎర్రచందనం స్మగ్లర్ల వేటకు వెళ్లే అటవీ సిబ్బందికి ఆయుధాలు అందించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే అటవీ సిబ్బందికి ఆయుధాలు మాత్రమే ఇస్తే సరిపోదని, స్మగ్లర్ల దాడులను ఎదుర్కొనే సామర్థ్యం కూడా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పోలీసుశాఖ, అటవీశాఖ ఉన్నతాధికారులు సమావేశమై ఉమ్మడి వ్యూహరచన చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ల వేటకు వెళ్లే అటవీ సిబ్బందికి భద్రతగా ఏపీఎస్పీ సాయుధ బలగాలను పంపేందుకు పోలీసుశాఖ అంగీకరించింది. దాడులకు దిగే స్మగ్లర్లను మట్టుపెట్టే బాధ్యతను కూడా ఏపీఎస్పీ బలగాలే తీసుకుంటాయి. ఒకవైపు స్మగ్లర్ల వేట కొనసాగుతుండగానే అటవీ సిబ్బందికి సాయుధ శిక్షణ అందించేందుకు కూడా పోలీసుశాఖ అంగీకరించింది. వివిధ జిల్లాల్లో ఉన్న పీటీసీ, డీటీసీలలో అటవీ సిబ్బందికి కూడా పోలీసులతో కలిపి సాయుధ శిక్షణ అందించనున్నారు.
బలగాల మధ్య సమన్వయం ముఖ్యం
ఎర్రచందనం స్మగ్లర్ల వేటకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినప్పటికీ అంతగా ఫలితాలను సాధించింది లేదు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్, అటవీ సిబ్బందికి మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. దీంతో స్మగ్లర్ల ఆట కట్టించేందుకు పోలీసు, అటవీ బలగాలు సమన్వయంతో పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. దీంతోపాటు కేసుల దర్యాప్తు అంశంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. స్మగ్లర్ల దాడుల వంటి సమయంలో పోలీసులు కేసులు నమోదుచేసినప్పటికీ, వాటిని అటవీశాఖకు బదిలీ చేస్తున్నారు. కేసుల దర్యాప్తులో జాప్యం తదితర కారణాల వల్ల కేసులు వీగిపోతున్నాయనే వాదన ఉంది. దీంతో దర్యాప్తు అధికారులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. మరోవైపు స్మగ్లర్లకు శిక్షాకాలం పెంపుదలపై ప్రభుత్వానికి అటవీశాఖ ప్రతిపాదనలను పంపించనుంది.
దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌పైనా ఆరా: ఎర్రచందనాన్ని భారీస్థాయిలో దేశ సరిహద్దులను దాటించడంలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పాత్ర ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో దావూద్ గ్యాంగ్ పాత్రపై కూడా నిఘావర్గాలు ఆరా తీస్తున్నాయి. దావూద్ గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు ఇప్పటివరకూ ఆధారాలు లభించలేదని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్‌కే కౌముది వెల్లడించారు.