చంద్రబాబు చందనం కథలకు వందనం....
ఎర్ర చందనం చెట్లను తాకట్టు పెట్టి మరీ పంట రుణాల మాఫీ చేయిస్తానంటున్నారు చంద్రబాబు. అడవిలో పెరుగుతున్న ఎర్ర చందనం చెట్లను తాకట్టు పెట్టొచ్చా? దీనికి బ్యాంకులు అంగీకరిస్తాయా? చెట్లను తాకట్టు పెట్టడానికి అటవీ శాఖ ఒప్పుకుంటుందా? కేంద్రం నుంచి అనుమతిని తీసుకుని మరీ ఈ పనిని చేస్తానంటున్నారు చంద్రబాబు. అసలు కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతినిస్తుందా?
బ్యాంకులు ఒప్పుకోవుః
ప్రభుత్వం గానీ, ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులు గానీ ఇలా చెట్లను తనఖా పెట్టి రుణం తీసుకోవటమన్నది ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఐనా వేల కోట్లు అప్పివ్వాలంటే బ్యాంకులన్నీ కన్సార్షియంగా ఏర్పడి నిర్ణయం తీసుకోవాలి. ఏ రుణమైనా దానికి తగ్గ విలువున్న ఆస్తిని తనఖా పెట్టుకుని ఇస్తారు. ఇవేమీ లేకుండా చెట్లను తనఖా పెట్టుకుని రుణాలివ్వటమనేది హాస్యాస్పదం.
అటవీ శాఖ అంగీకరించదుః
అడవులు జాతి సంపద. వాటిని బ్యాంకులు, ఆర్థికసంస్థల దగ్గర తాకట్టు పెట్టడానికి చట్టాలు అంగీకరించవు. అటవీ శాఖ వర్గాలు కూడా జాతి సంపదను తాకట్టు పెడతామని సీఎం చెప్పటం ఎప్పుడూ వినలేదు.
కేంద్రం ఓకే చెప్పదు
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పే అవకాశాలు లేవు. ఒక వేళ రుణ మాఫీ చేయించిన తరువాత ప్రభుత్వం బ్యాంకులకు డబ్బు చెల్లించలేకపోతే బ్యాంకులు చెట్లను కొట్టించి అమ్ముకుంటాయా? లేక కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతించే అవకాశాలు లేవు?
కాబట్టి చంద్రబాబు చెబుతున్న చందనం కథలు మబ్బుల్లో నీళ్లు చూపి, ముంత లో నీరు ఒలకబోయించడం తప్ప మరేమీ కాదు. చందనం అమ్మకం కథలకు ఓ వందనం చెప్పి, రుణమాఫీ ఎలా చేయిస్తారో నిలదీయాల్సిన సమయం వచ్చింది.