అప్పుచేయనున్న చంద్రబాబు సర్కార్
సెక్యూరిటీల వేలం ద్వారా రుణ సమీకరణ
దీంతో రూ.15 వేలకోట్లకు చేరనున్నరుణం
సాక్షి, అమరావతి: వచ్చే మంగళవారం మరో రూ. 3,000 కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమైంది. 27న రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఈ అప్పును సమీకరించనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం సెక్యూరిటీల వేలం వివరాలను వెల్లడించింది.
ఇప్పటికే కూటమి ప్రభుత్వం మంగళవారాల్లో రూ. 12 వేల కోట్లు అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేసే అప్పుతో కలిపి మొత్తం రూ. 15 వేల కోట్లు అప్పు చేసినట్లు అవుతుంది. 12 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 17 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 22 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,000 కోట్లు వచ్చే మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయనుంది.
రూ. 2,500 కోట్లు సర్దుబాటు
సీఏజీ ద్వారా విదేశీ ప్రాజెక్టుల రుణాలకు సంబంధించి తెలంగాణ నుంచి రావాల్సిన రూ. 2,500 కోట్లకు సార్వత్రిక ఎన్నికల ముందే వైఎస్ జగన్ సర్కారు పరిష్కారం కనుగొంది. అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ ఏడాది జనవరి నుంచి సీఏజీతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఉమ్మడి ఏపీలో విదేశీ ప్రాజెక్టుల రుణాల చెల్లింపులన్నీ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేస్తూ వస్తోంది.
తెలంగాణ వాటాను కూడా ఏపీ ప్రభుత్వమే చెల్లించింది. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి ఏపీకి రూ. 2,500 కోట్లు రావాల్సి ఉందని సీఏజీ గత జనవరిలోనే తేల్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఆ తరువాత ఎన్నికల కోడ్ రావడంతో తెలంగాణ నుంచి రావాల్సిన ఆ నిధుల విషయాన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ రూ. 2,500 కోట్లను ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గురువారం సర్దుబాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment