'రోజుకో సాకుతో అయోమయంలో పడేస్తున్నారు'
హైదరాబాద్ : రైతులను అయోమయానికి గురి చేసేందుకే టీడీపీ ప్రభుత్వం రుణమాఫీని ఆధార్తో లింక్ పెడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ ప్రభుత్వ పథకానికి ఆధార్తో లింక్ వద్దంటూ గతంలో సుప్రీంకోర్టే చెప్పిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణమాఫీని ఆధార్తో లింక్ పెట్టడం ఎంతవరకూ సబబు అని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. భేషరతుగా వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆయన విమర్శించారు.
కాగా రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజుకో సాకు వెతుకుతూ రైతులను అయోమయంలో పడేస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ రైతుల బ్యాంకు రుణాలను రద్దు చేసేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని, కేంద్రప్రభుత్వం, ఇటు రిజర్వ్‌బ్యాంకు ఒప్పుకోలేదంటూ కొత్త సాకులు చెప్పిన టీడీపీ సర్కార్ తాజాగా ఆధార్ కార్డుల ఆధారంగా రుణమాఫీ చేస్తామంటూ కొత్తపల్లవి అందుకుంది. ఇదే విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే.