TDP Creating Obstacles in Every Step of Electoral Process - Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే బహిష్కరణ నాటకం

Published Mon, Sep 20 2021 3:15 AM | Last Updated on Mon, Sep 20 2021 11:37 AM

TDP creating obstacles at every step of electoral process from one half years - Sakshi

సాక్షి, అమరావతి: పరిషత్‌ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ముందే ఊహించి ప్రతిపక్ష టీడీపీ ఏడాదిన్నరగా ఏదో ఒక సాకుతో ఎన్నికల ప్రక్రియకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినట్లు స్పష్టమవుతోంది. అధికార పార్టీకి వందకు వంద శాతం అనుకూలంగా వచ్చిన ఎన్నికల ఫలితాలపై కూడా ఆత్మ వంచనకు పాల్పడుతూ తాము ఎన్నికలను బహిష్కరించడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నిజానికి ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ పార్టీ గుర్తుతో తన అభ్యర్థులకు బి–ఫామ్‌లు ఇచ్చింది. ఎన్నికల్లో అభ్యర్థులనూ నిలబెట్టింది. ప్రచారం కూడా చేయించింది. చివరకు పంచాయతీ, మునిసిçపల్‌ ఎన్నికల ఫలితాలకు మించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజాదరణ ఉన్నట్లు అర్థమయ్యేసరికి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఉత్తుత్తి ప్రకటన చేసింది. అయితే విపక్షం ఎన్నికల్లో ప్రచారమూ చేసింది, డబ్బులూ పంచింది. కానీ ఎన్ని చేసినా ఫలితం లేదని బోధపడటంతో అసలు పరిషత్‌ ఎన్నికల పోటీ నుంచి తాము తప్పుకున్నట్లు ఇప్పుడు మరో నాటకాన్ని రక్తి కట్టిస్తోంది. 

ఏడాది పాటు దాటవేత
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఓటమి భయంతో దాదాపు ఏడాది పాటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా దాటవేస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ ఫలితాలను చూసి బెంబేలెత్తి స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలంతా అడుగడుగునా అడ్డుపడిన విషయం తెలిసిందే. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యమిస్తూ ఆరేడు నెలలకే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించగా, ఈ ప్రక్రియ మొదలు కాకముందే టీడీపీ నేతలు రిజర్వేషన్లపై కోర్టులో కేసులు దాఖలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా నామినేటెడ్‌ పదవి పొందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి పైబడి రిజర్వేషన్లు అమలు చేయడంపై కోర్టును ఆశ్రయించారు. ఓటమి భయంతో టీడీపీ నేత దాఖలు చేసిన కేసు కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లను హైకోర్టు 50 శాతానికి పరిమితం చేసింది. 

ఎట్టకేలకు బరిలోకి..
ఎట్టకేలకు 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా టీడీపీ తరఫున పోటీకి అభ్యర్థులు మొహం చాటేశారు. రాష్ట్రంలో 660 జెడ్పీటీసీ స్థానాలుండగా 652 స్థానాలకు అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. టీడీపీ 482 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి 170 చోట్ల విపక్షాలకు అభ్యర్థులే లేకపోవడం గమనార్హం. ఇందులో 126 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవం కాగా ఎన్నికలు జరిగిన 44 చోట్ల టీడీపీ సహా ఇతర విపక్ష అభ్యర్థులు పోటీ చేయలేదు. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికి 3,032 చోట్ల అభ్యర్థులే కరువయ్యారు. 


వారంలో పోలింగ్‌ ఉందనగా..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మరో వారం రోజుల్లో పోలింగ్‌ నిర్వహించనున్న సమయంలో నాటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కరోనా పేరుతో ప్రభుత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆ ఎన్నికలను అర్థంతరంగా వాయిదా వేశారు. చంద్రబాబు ప్రోద్బలంతో టీడీపీ ప్రయోజనాల కోసమే నిమ్మగడ్డ ఎన్నికలను హఠాత్తుగా వాయిదా వేశారని వెల్లడవుతోంది. ఆ సమయంలో నిమ్మగడ్డ కేంద్రానికి ఓ లేఖ రాయడం, అది టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోనే తయారైందన్న విమర్శలు వచ్చాయి. 

అవకాశం ఉన్నా నిర్వహించకుండా..
అర్థంతరంగా వాయిదా వేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కన పెట్టేసిన నిమ్మగడ్డ రమేష్‌ ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ పేరుతో అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తూ తన గుప్పిట్లో పెట్టుకునేందుకు  యత్నించారు. మంత్రులు, ఐఏఎస్‌ అధికారులపై ఏకపక్షంగా చర్యలకు సిఫార్సులు చేశారు. అయినా 80 శాతం స్థానాల్లో  వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే గెలిచారు. నిమ్మగడ్డ రమేష్‌ పదవిలో ఉన్నంతకాలం అవకాశం ఉన్నా పరిషత్‌ ఎన్నికలను నిర్వహించలేదన్న విమర్శలున్నాయి. 

న్యాయ వివాదాలతో లెక్కింపు జాప్యం..
నిమ్మగడ్డ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్‌ 1వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసి 8న పోలింగ్‌ జరపాలని నిర్ణయించగా టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టులో కేసు వేశారు. ఆయనతోపాటు ఇతర పార్టీల నేతలు వేసిన కేసులు కారణంగా పోలింగ్‌ జరిగిన తర్వాత కూడా ఓట్ల లెక్కింపు దాదాపు ఐదున్నర నెలలు ఆలస్యమైంది.

ఓటమి భయంతో ఒక పక్క కేసులు వేసి అడ్డుకుంటూ మరోపక్క పార్టీ అభ్యర్థులకు టీడీపీ బీ ఫామ్‌లిచ్చి పోటీలో నిలిపింది. పరిషత్‌ ఎన్నికలను తమ పార్టీ బహిష్కరించినట్లు బుకాయిస్తూ మరోవైపు పార్టీ తరఫున బరిలో దిగిన అభ్యర్థులతో యథావిధిగా ప్రచారాన్ని నిర్వహించింది. సైకిల్‌ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులు గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. టీడీపీ నిజంగానే ఎన్నికల్ని బహిష్కరిస్తే ఆ పార్టీ సంప్రదాయ ఓటర్లు ఎన్నికలకు దూరమై పోలింగ్‌ శాతం తగ్గిపోయి ఉండాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఆ పార్టీని మరోసారి ఘోరంగా తిరస్కరించినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement