టూటౌన్‌లో పట్టుబడిన అంతర్జాతీయ ఎర్రదొంగలు(ఫైల్)
⇒ మదనపల్లె కేంద్రంగా అక్రమ రవాణా
⇒ బెంగళూరు, చెన్నైకి తరలుతున్న ఎర్రచందనం
మదనపల్లె టౌన్ :
జిల్లాలో ఎర్రచందనం దొంగలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ దాడులు చేసి పెద్ద సంఖ్యలో ఎర్రకూలీలను, స్మగ్లర్లను అరెస్టు చేస్తున్నారు. కొంతమందిపై పీడీ యాక్టును సైతం నమోదు చేసి జైలుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రదొంగలు రూటు మార్చారు. మదనపల్లెను కేంద్రంగా చేసుకుని బెంగళూరు, చెన్నైకి ఎర్రచందనం దుంగలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. వారిని పట్టుకోవడంలో మదనపల్లె ఫారెస్టు అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూడేళ్లలో ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పోలీసులు మాత్రం 72 మంది స్మగ్లర్లను అరెస్టుచేసి వారి నుంచి 13 వాహనాలు, 1490 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.4.16 కోట్లు ఉంటుందని అంచనా. గత నెల 5వ తేదీన నిమ్మనపల్లెలో 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లా, తిరుపతి, జిల్లేళ్ల మంద, కేవీపల్లె, కలకడ, రాయచోటి పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామీణులు, స్మగ్లర్లకు ఎర్రచందనం దుంగలను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. గుర్రంకొండకు చెందిన కొందరు డ్రైవర్లు వాహనాలను సమకూర్చడంతోపాటు పైలెట్లుగా వ్యవహరిస్తూ మినీ లారీలు, సుమోల్లో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులకు ఎర్రచందనం తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇటీవల వీరి కార్యకలాపాలు ఊపందుకున్నట్లు తెలిసింది. అధికారులు నిఘా పెంచినా దొంగలు ముందుగానే సమాచారం అందుకుని ఎప్పటికప్పుడు రూటు మారుస్తూ తమ వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటున్నట్టు సమాచారం. ఇందుకు కొందరు అటవీశాఖ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎర్రచందనాన్ని పీలేరు మీదుగా చెన్నైకి తరలించేవారు. పోలీసు అధికారులు వరుస దాడులతోపాటు, ఎన్‌కౌంటర్లు చేయడంతో రూటుమార్చినట్టు తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎఫ్‌ఆర్‌వో మాధవరావును వివరణ కోరగా స్మగ్లర్ల కదలికలపై నిఘా పెట్టామన్నారు. కర్ణాటకకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నట్లు తమకు సమాచారం లేదని తెలిపారు.