ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
కర్నూలు (టౌన్): రుద్రవరం మండలం శ్రీరంగాపురం గ్రామ సమీపంలోని అయ్యకుంట చెరువు వద్ద ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న 13 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 45 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆవరణలో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో భీరం నరసింహారెడ్డి, తలారీ నరసింహులు, తలారీ హరి, షేక్ చిన్న హుస్సేన్, దేవిశెట్టి సుబ్బారావు, సంపంగి వడ్డె శ్రీను, షేక్ రఫీ, బోయ ప్రసాద్, చాకలి హరిలింగం, ఆవుల ఓబులేసు, కొత్తమాసి వెంకటయ్య, గుర్రందాసు, కొత్త మాసి ధనపాల్ ఉన్నారు. వీరిపై రుద్రవరం పోలీసుస్టేషన్‌లో 158/2016 కింద ఎర్రచందనం, పర్యావరణ ఆటవీ చట్టాల కేసు నమోదు చేశారు. వీరంతా రుద్రవరం మండలంలోని శ్రీరంగా పురం, పెద్దకడబూరు, నరసాపురం, బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామాలకు చెందిన వారు. స్మగ్లర్ల అరెస్ట్‌లో ప్రతిభ చూపిన సీఐ ప్రభాకర్ రెడ్డి, రుద్రవరం ఎస్‌ఐ హనుమంతయ్య, ఎఎస్‌ఐ రామయ్య, హెడ్ కానిస్టేబుల్ భూపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కుమార్, రమేష్, శాంతి రెడ్డి, హోంగార్డు బాలసామి, హరిని ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు.