పునరావాస కేంద్రంలో పాఠశాలకు తాళం
పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత గిరిజనుల కోసం రామయ్యపేటలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారికి అద్దెలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నెలలు గడుస్తున్నా సొమ్ములు చెల్లించడం లేదు. దీంతో రామయ్యపేట పునరావాస కేంద్రంలోని అద్దె భవనంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలకు సంబంధించి అద్దె చెల్లించకపోవడంతో భవనం యజమాని పాఠశాల తాళం వేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను రోడ్డు పాలు చేశారు. దీంతో పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న 45 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ బాధలు చెప్పుకోవడానికి రెవెన్యూ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ ఎం.ముక్కంటి అందుబాటులో లేకపోవడంతో సమీపంలో ఉన్న ఎంఈవో టి.కృష్ణ విద్యార్థులను మండల విద్యాశాఖ కార్యాలయంలో కూర్చొబెట్టారు. అక్కడే ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. గతంలో సోయెం రామారావు ఇంట్లో పాఠశాల నిర్వహించే వారు. అతనికి 5 నెలల అద్దె చెల్లించకపోవడంతో రామారావు పాఠశాల ఖాళీ చేయించాడు. అప్పటి నుంచి బండారు పాప అనే మహిళకు చెందిన ఇంట్లో పాఠశాల నిర్వహిస్తున్నారు. ఆమెకు కూడా 5 నెలల అద్దె బకాయి పడటంతో మంగళవారం విద్యార్థులను, ఉపాధ్యాయులను బయటకు పంపించి ఇంటికి తాళాలు వేసింది. పాఠశాల సమస్యను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కరించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాలని, అద్దెలను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పిన అధికారులు 10 నెలలు గడిచినా అద్దె చెల్లించకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఇదిలావుంటే.. నిర్వాసితులు పునరావాస కేంద్రానికి తరలివచ్చి సంవత్సరం కావస్తున్నా ఇప్పటివరకు పాఠశాల భవన నిర్మాణం పూర్తికాలేదు.