పునరావాసం పక్కా మోసం
మంగంపేట(ఓబులవారిపల్లె):
దశాబ్దం కిందట మంగంపేట గనుల పరిధిలో డేంజర్‌జోన్‌గా ప్రకటించిన కట్టడాలను 14 రీచ్‌లుగా విభజించి ఏపీఎండీసీవారు రెవెన్యూ ద్వారా పరిహారం అందజేశారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇందులో 1వ రీచ్‌లో 90 ఇళ్లలకు రూ.2,97,61,320, 2వ రీచ్‌లో 78 కట్టడాలకు రూ.31.45లక్షలు పరిహారం నిర్వాసితులకు అందజేశారు. 3వ రీచ్‌లో 52 కట్టడాలకు రూ.19.35లక్షలు, 4వ రీచ్‌లో 78 కట్టడాలకు రూ.32.69 లక్షలు, 5వ రీచ్‌లో 209 కట్టడాలకు రూ.50.19 లక్షలు, 8వ రీచ్‌లో 31 కట్టడాలకు రూ.89.65 లక్షలు, 9వ రీచ్‌లో 172 కట్టడాలకు రూ.2.08కోట్లు, 10వరీచ్‌లో 231 కట్టడాలకు రూ.3.76కోట్లు, 11వ రీచ్‌లో 119 కట్టడాలకు రూ.2.29 కోట్లు, 12వ రీచ్‌లో 12కట్టడాలకు రూ.10.05 లక్షలు, 14వరీచ్‌లో 26కట్టడాలకు రూ.43.83 లక్షలు పరిహారం చెల్లించి వాటిని తొలగించారు.
1457 ఇళ్లు కూల్చివేత
యుద్ధ ప్రాతిపదికన కట్టడాలు తొలగించే సందర్భంలో కొందరు నిర్వాసితులు ఇళ్లను తొలగించేందుకు సమ్మతించకపోవడంతో అధికారులు డోలాయమానంలో పడ్డారు. దీంతో అధికారులు నిర్వాసిత కుటుంబాలకు ఆరునెలల్లోపు పునరావాసం కల్పించడంతోపాటు తక్షణం ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీతోపాటు ఆరునెలలపాటు ప్రతి కుటుంబానికి నెలనెలా ఏపీఎండీసీ అద్దె చెల్లిస్తుందని హామీఇచ్చారు. ఉద్యోగం రాని కుటుంబాలకు పరోక్ష ఉపాధి కల్పిస్తామని ఆశ కల్పించడంతో గ్రామంలోని తమ 1,457 ఇళ్లను దగ్గరవుండి నిర్వాసితులు కూల్చివేయించారు. ఏపీఎండీసీ అధికారులు ఇచ్చిన హామీప్రకారం పునరావాస కేంద్రాల్లో కోట్లాదిరూపాయల వ్యయంతో మౌలిక వసతులు కల్పించారు.
చక్రం తిప్పిన ఖద్దర్‌బాబులు
ముందుగా కట్టడాలను తొలగించిన నిర్వాసితులకు 1వ పునరావాసంలో 1,100 కుటుంబాలకు నివాస స్థలాలు కల్పించారు. 2వ పునరావాస కేంద్రంలో 358, 3వ పునరావాస కేంద్రంలో 325, 4వ పునరావాస కేంద్రంలో 310 కుటుంబాలకు స్థలాలు కేటాయించారు. ఇక్కడే తిరకాసు మొదలైంది. రాజకీయంగా చక్రంతిప్పే ఒక్కొక్క ఖద్దరుబాబులు అధికారులతో కుమ్మకై మూడుప్లాట్ల నుంచి పదిప్లాట్ల వరకు కబ్జాచేసి సువిశాలమైన గృహాలను నిర్మించుకున్నారు. అంతేకాకుండా అప్పట్లో ప్రభుత్వ గృహనిర్మాణశాఖ అధికారులకు పెద్దఎత్తున చేతులు తడిపి ఏకంగా పక్కా గృహాలను మంజూరు చేపించుకుని దర్జాగా భవంతులు నిర్మించుకున్నారన్నారు.
అధికారులకూ స్థలాలు
ఇదేఅదునుగా భావించి ఫ్లాట్‌లు కేటాయింపునకు సర్వే నిర్వహించడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు సైతం బినామీపేర్లతో పునరావాస కేంద్రంలో ప్లాట్లు పొందారు. వీరి నిర్వాకంతో ప్రస్తుతం కేటాయించిన పునరావాసంలో నిర్వాసితులు అందరికీ సరిపోవాల్సిన ఇంటి స్థలాలు చాలక ఏపీఎండీసీ ఇంకా లక్షల వ్యయంతో నిర్వాసితులకోసం భూములుకొని స్థలాలు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే 1,457 కట్టడాల కూల్చివేతకు 2,120 కుటుంబాలకు ఏపీఎండీసీ నివాసస్థలాలు ఏర్పాటుచేసింది. అయితే బస్టాండ్ ప్రాంతంలోని ఇంకా వందపైబడి నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఏపీఎండీసీ యాజమాన్యం వాస్తవాలను వెలికితీసి కబ్జాకు గురైన ప్లాట్లను గుర్తించి స్వాధీనపరుచుకుంటే ఇంటిస్థలాలు లేని నిర్వాసితులకు సరిపోతుందని స్థానికంగా అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కబ్జాకు గురైన స్థలాలు స్వాధీనానికి ఏపీఎండీసీ చొరవ చూపిస్తుందా లేక రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తుందా అని బాధితులు ఎదురుచూస్తున్నారు.
అధికారులకు బినామీ ప్లాట్‌లు కట్టబెట్టారు
గనుల విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయిన అర్హులైన నిర్వాసితులకు నివేశస్థలాలు ఇవ్వకుండా ఏపీఎండీసీకి చెందిన కొందరు అధికారులు బినామీ పేర్లతో ప్లాట్‌లను అక్రమంగా పొందారు. ఇప్పటికైనా ఏపీఎండీసీపై అధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుని అర్హులైన నివేశçస్థలాలు ఇప్పించాలి.
– తల్లెం భరత్‌కుమార్‌రెడిడ, కాపుపల్లె, మంగంపేట.
ఏళ్లుగా నివేశస్థలాలు కేటాయించలేదు
గనుల విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయాము. ఏపీఎండీసీ అధికారులు ఇప్పటివరకు మాకు నివేశస్థలాలు కేటాయించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంగంపేట ఆర్‌ఆర్‌సెంటర్ సమీపంలో నివేశస్థలాలు కేటాయిస్తే బాగుంటుంది.
– షేక్ కరిముల్లా, మంగంపేట.
ఇల్లు కోల్పోయిన వారికే నివాసస్థలం కల్పించాం
గనుల విస్తరణలో ఇల్లుకోల్పోయిన నిర్వాసితులకే పునరావాసంలో నివాసస్థలం కేటాయించాం. ఎవ్వరికీ అదనంగా నివాసస్థలాలు ఇవ్వలేదు. అప్పట్లో ఉన్న ఏపీఎండీసీ అధికారులు, రెవిన్యూవారు ప్లాట్లువేసి ఇల్లు కోల్పోయిన వారిప్లాట్‌లు కేటాయింపు జరిగి ఉంటుంది.
– రాచమల్లు కేథార్‌నాథ్‌రెడ్డి, సిపివో, మంగంపేట.