మొదటి విడత పునరావాసం పూర్తి
Published Thu, Aug 11 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితులకు మొదటి విడత పునరావాసం పూర్తయ్యింది. మొదటి విడత ఖాళీ చేయాల్సిన ఏడు గ్రామాల నిర్వాసితులకు, పోల వరం కుడికాలువ నిర్మాణం వల్ల ఖాళీ చేసిన మరో గ్రామానికి సంబంధించి 1,825 కుటుంబాలకు రూ.57.84 కోట్ల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రాయితీలుగా అందించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో బుధవారం తహసీల్దార్ ఎం.ముక్కంటి వివరాలను విలేకరులకు వెల్లడించారు. 2005లో విడుదల చేసిన 68 జీవో ప్రకారం రూ.6.01 కోట్లు, జీవో 90 కింద మరో రూ.51.83 కోట్లు చెల్లించామన్నారు. గతేడాది జరిగిన సర్వేలో గిరిజనేతరుల భూములకు తక్కువ రేటు చెల్లించారని, పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులు అటవీ సంపదను కోల్పోయారని గుర్తించామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిర్వాసితులను ఆదుకోవాలని కలెక్టర్ కె.భాస్కర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా జీవో 90 కింద రూ. 60.47 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. అప్పటి నుంచి అధికార యంత్రాంగం అర్హులైన నిర్వాసితుల జాబితా రూపొందించి గ్రామసభల ఆమోదంతో నివేదికలు పంపించామన్నారు.
ప్రణాళిక ప్రకారం పరిష్కారం : జేసీ పి.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ముంపు గ్రామాల వారీగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి గ్రామసభలు నిర్వహించామని చెప్పారు. ప్రణాళిక ప్రకారం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించామన్నారు. దేవరగొంది, మామిడిగొంది, తోటగొంది, చేగొండిపల్లి, సింగన్నపల్లి, రామయ్యపేట, పైడిపాక, రామన్నపాలెం గ్రామాల నిర్వాసితులకు పునరావాస కేంద్రాల్లో ఐటీడీఏ ద్వారా భూములు అభివృద్ధి చేయడం, జీవనోపాధి కోసం రుణాలు మంజూరు చేయడం, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా బోర్లు వేయించడం, ఆర్‌అండ్‌ఆర్ నిధులతో వీధిదీపాలు, చెత్తకుండీల ఏర్పాటు, ముంపు గ్రామాల్లోని నిర్వాసితుల చెట్లకు నష్టపరిహారం చెల్లించడం వంటి కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. కలెక్టర్, జేసీలు, అన్ని శాఖల అధికారుల సహకారంతో వసతులు కల్పించామని వివరించారు. ఆర్‌ఐ కె.రమేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement