డ్రాపౌట్లను బడిలో చేర్చండి: కలెక్టర్
సమీక్షలో కలెక్టర్ రోనాల్డ్ రోస్
సంగారెడ్డి జోన్: జిల్లాలో బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్ రోనాల్డ్ రోస్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ 15 మండలాలకు సంబంధించిన మండల విద్యాధికారులు, రీసోర్స్ పర్సన్లతో సమీక్ష జరిపారు. జిల్లాలో మొత్తం 3,700 మంది పిల్లలు మధ్యలో బడి మానేశారని తెలిపారు. యూనిసెఫ్ సౌజన్యంతో జిల్లాలో వలస వెళ్లిన పిల్లలను, బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడి బాట పట్టించాలన్నారు. పిల్లల కోసం 15 మండలాల్లో 163 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. ఏప్రిల్ 18 నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు విద్యా వలంటీర్ల ద్వారా తెలుగు, ఆంగ్లం, గణిత శాస్త్రం బోధించడం జరుగుతుందన్నారు.
ఈ ప్రత్యేక బోధన కార్యాక్రమం జూలై 15వరకు కొనసాగిస్తామన్నారు. ఇప్పటి వరకు మూడు వేల మంది పిల్లలను గుర్తించి బడి బాటలోకి తేవడం జరిగిందని, మిగిలిన ఏడు వందల మంది పిల్లలను పాఠశాలలో చేర్పించేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. బడిలో చేరకపోవడానికి గల కారణాలను నివేదిక రూపంలో అందజేయాలని కోరారు. పిల్లలను తిరిగి బడిలో చేరి పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఉదయం పూట స్నాక్స్ ఏర్పాటు చేయడం వలన మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
పాఠశాలలు ఈ నెల 13 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక తరగతులకు ఇబ్బంది కలుగకుండా ప్రతి ఉన్నత పాఠశాలలో ఒక క్లాస్ రూమ్ ను కేటాయించాలని ఆర్వీఎం పీఓకు సూచించారు. గదులు అందుబాటులో లోని చోట ప్రత్యామ్నాయ భవనాలను ఏర్పాటు చేయాలన్నారు, ప్రతి రోజా ఈ కేంద్రాలను ఎంఈఓలు, రిసోర్సు పర్సన్‌లు తనిఖీ చేసి నివేదికలను, ఫొటోలను వాట్సప్ ద్వారా అందజేయాలని సూచించారు. సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి బింద్రా , ఆర్వీఎం పీఓ యాస్మిన్ భాషా పాల్గొన్నారు.